నీరసంగా ఉన్నా.. కాలిబాటనే..!
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:54 PM
ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీరసంగా ఉన్నప్పటికీ.. నడక దారినే తిరుమల చేరుకున్నారు.
తిరుపతి/తిరుమల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నీరసంగా ఉన్నప్పటికీ.. నడక దారినే తిరుమల చేరుకున్నారు. 11 రోజుల దీక్ష విరమణకు గాను మంగళవారం మధ్యాహ్నం పవన్ తిరుపతికి చేరుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నందున తనకు స్వాగత సత్కారాలు అవసరం లేదని, హడావిడి, ఆర్భాటాలకు దూరంగా ఉండాలని జనసేన శ్రేణులకు, అభిమానులకు ఆదేశాలిచ్చారు. దీంతో విమానాశ్రయానికి ఎవరూ వెళ్ళలేదు. కేవలం కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు మాత్రమే పవన్‌కు స్వాగతం పలికారు. అక్కడ్నుంచి సాయంత్రం 4 గంటలకు అలిపిరి చేరుకున్నారు. నడక దారిలో వెళ్లాలంటే.. అటవీ మార్గం కావడంతో భద్రతా సమస్యలు ఎదురవుతాయని, ఇంటెలిజెన్స్ విభాగం కూడా హెచ్చరించిందని పోలీసులు తెలిపారు. అభిమానుల హడావిడితో పాటు భక్తులకూ ఇబ్బంది కలుగుతుందని వివరించారు. రోడ్డు మార్గాన వెళ్ళాలని కోరారు. తనకు భద్రతాపరమైన సమస్య ఏమీ లేదని, నడిచే వెళతానని తొలుత భీష్మించినా.. చివరికి ఆయన డైలమాలో పడ్డారు. ఈ క్రమంలో వెనుదిరిగి పద్మావతి అతిథి గృహానికి వెళ్ళారు. శ్రీవారి మెట్టు మార్గమైతే ఎలా ఉంటుందని కాసేపు చర్చించారు. చివరకు అలిపిరి నడక దారినే ఎంచుకుని 4.50 గంటలకు పాదాల మండపం నుంచి బయల్దేరారు. దీంతో గంట పాటు అలిపిరి వద్ద అయోమయం నెలకొంది. పవన్ ఏ మార్గంలో వెళతారో తెలియక తొలుత 20 నిమిషాల పాటు భక్తులను నడక దారిలో ఆపేశారు. రోడ్డు మార్గాన వెళతారనే ఉద్దేశంతో అరగంట పాటు వాహనాలనూ నిలిపేశారు. దీంతో రెండు మార్గాల్లోనూ కొంతసేపు భక్తులు ఇబ్బంది పడ్డారు.
అలసి.. సొలసినా
ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరేసరికి పవన్ కల్యాణ్ బాగా అలసిపోయి సొమ్మసిల్లిపోయారు. కాసేపు మెట్లపైనే ఒరిగిపోయినట్టు పడుకున్నారు. నీరసానికి తోడు వెన్ను, కాళ్ళ నొప్పితో ఇబ్బంది పడ్డారు. స్విమ్స్‌కు చెందిన వైద్యులతో ఫిజియో థెరపీ చేయించుకోవడంతోపాటు అక్కడక్కడా ఆగి విశ్రాంతి తీసుకుంటూ నడక సాగించారు. చివరికి నాలుగున్నర గంటల్లోనే అంటే రాత్రి 9.24 గంటలకు తిరుమల జీఎన్సీ టోల్‌గేట్ వద్దకు చేరుకున్నారు. జనసేన నేతలు పసుపులేటి హరిప్రసాద్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, ప్రముఖ ఆర్కిటెక్చర్ ఆనంద్‌సాయి ఆయన వెంట తిరుమలకు చేరారు. కాగా, అభిమానుల తోపులాటలో సామాన్య భక్తులు అక్కడక్కడా ఇబ్బంది పడ్డారు. రోప్‌లతో భద్రతా సిబ్బంది నెట్టివేయడంతో జీఎన్సీ వద్ద అగచాట్లు పడ్డారు. చిన్నపిల్లలతో వచ్చిన భక్తులు నెట్టేస్తారనే భయంతో పవన్ కల్యాణ్ వెళ్లేంతవరకు నడకమార్గానికి దూరంగా నిలబడిపోయారు.
పవన్‌కు భారీ భద్రత
పవన్ కల్యాణ్ తిరుమల పర్యటనకు ప్రభుత్వం, టీటీడీ యంత్రాంగం భారీ భద్రత కల్పించింది. ఆయన వెంట నడక దారిలో వందమంది పోలీసులు వలయంగా ఏర్పడి రక్షణ కల్పించారు. దీనికి అదనంగా టీటీడీ సెక్యూరిటీ, ఎస్పీఎఫ్, ఏపీఎ్‌సపీ, రిజర్వు పోలీసు బలగాలు బృందాలుగా ఏర్పడి ముందూవెనుక కూంబింగ్ నిర్వహిస్తూ సాగాయి.
పవన్‌ను కలిసిన అటవీశాఖ అధికారులు
అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహ ఆలయం వద్ద పవన్‌ను తిరుపతి సీఎ్‌ఫవో నాగేశ్వరరావు, ఎస్వీ జూపార్కు పర్యవేక్షకుడు సెల్వం కలిశారు. నడక మార్గంలో చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన తర్వాత తీసుకున్న చర్యలను వివరించారు. భవిష్యత్తులో చేపట్టబోయే పనులు, అభివృద్ధికి సంబంధించి మ్యాప్‌ను చూపి తెలియజేశారు.