సంక్షోభ హాస్టళ్లు!
ABN , Publish Date - Oct 22 , 2024 | 02:09 AM
సంక్షేమ హాస్టళ్లు.. సంక్షోభంగా మారాయి. పైకప్పులన్నీ పెచ్చులూడిపోయి కుంగిపోయి.. ఓ క్షణాన్నైనా కూలిపోయేలా కనిపిస్తున్నాయి. తలుపులు, కిటికీలు విరిగిపోయాయి.
పెచ్చులూడుతున్న పైకప్పులు
ఉరుస్తున్న గదులు
బీటలు వారుతున్న గోడలు
విరిగిన తలుపులు.. రెక్కలు లేని కిటికీలు
ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెల్లడైన చేదు వాస్తవాలు
తిరుపతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ హాస్టళ్లు.. సంక్షోభంగా మారాయి. పైకప్పులన్నీ పెచ్చులూడిపోయి కుంగిపోయి.. ఓ క్షణాన్నైనా కూలిపోయేలా కనిపిస్తున్నాయి. తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు నిర్వహణ సరిగాలేక దుర్వాసన వస్తున్నాయి. పలు హాస్టళ్ళలో విద్యార్థులకు బెడ్‌షీట్లు పంపిణీ చేయకపోవడంతో ఇళ్ల నుంచి తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఇన్ని దురవస్థల నేపథ్యంలో మెజారిటీ హాస్టళ్లలో విద్యార్థుల హాజరు శాతం దారుణంగా పడిపోయింది. సోమవారం రాత్రి జిల్లావ్యాప్తంగా ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్ సంక్షేమ హాస్టళ్లను సందర్శించిన సందర్భంలో ఈ చేదు వాస్తవాలు వెలుగు చూశాయి.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
ఏర్పేడులో కనీస వసతుల్లేవ్
ఏర్పేడు బీసీ బాలుర హాస్టల్లో పిల్లలకు కనీస సదుపాయాలు లేవు. బెడ్‌షీట్లు సరఫరా కాకపోవడంతో ఇళ్ల నుంచి తెచ్చుకుని వాడుకుంటున్నారు. దుస్తులు కూడా ఇంతవరకూ పంపిణీ కాలేదు. వర్షానికి రెండు గదులు ఉరుస్తున్నాయి. గదుల పైకప్పు కాంక్రీటు పెచ్చులూడిపోయి ఇనుప కమ్మీలు కనిపిస్తున్నాయి. పైపులైను పాడవడంతో రెండు వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి. సిమెంట్ తొట్టిలో నీరు నింపి వాటిని వాడుకుంటున్నారు. ప్రహరీ లేకపోవడంతో ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. దీంతో పగలు పశువులు, రాత్రిళ్లు పాములు ఆవరణలోకి వస్తున్నాయి. వార్డెన్ పోస్టు ఖాళీగా ఉండటంతో రేణిగుంట వార్డెన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
బీఎన్ కండ్రిగ హాస్టళ్లు భిన్నమేమీ కాదు
బీఎన్ కండ్రిగ ఎస్సీ బాలుర హాస్టల్ భవనం కట్టి 30 ఏళ్ళవుతోంది. గోడలు కూడా బీటలు వారాయి. కిటికీల తలుపులు పగిలిపోయాయి. బీసీ బాలుర హాస్టల్‌లో మరుగుడొడ్ల నిర్మాణం ఆరేళ్ళుగా అసంపూర్తిగానే వుంది.
దురవస్థలో సత్యవేడు హాస్టళ్ళు
సత్యవేడు బీసీ బాలుర హాస్టల్ గదుల పైకప్పు దెబ్బతింది. కాంక్రీటు పెచ్చులూడిపోయి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. గదులన్నీ వర్షానికి ఉరుస్తున్నాయి. గోడలు నానిపోయి చెమ్మ తేలి ఉన్నాయి. కిటికీల తలుపులు పుచ్చిపోయాయి. సత్యవేడులోనే ఎస్సీ బాలుర హాస్టల్ పైకప్పు కూలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. వంట గది చూస్తే అన్నం తినబుద్ది కాదు. వాచ్‌మెన్ పోస్టు ఖాళీ. వంట మనిషే అన్ని పనులూ చేస్తున్నారు.
కూలిపోయే స్థితిలో పిచ్చాటూరు హాస్టల్
పిచ్చాటూరు ఎస్సీ బాలుర హాస్టల్ భవనం ప్రమాదకర స్థితిలో ఉంది. పైకప్పు మొత్తం దెబ్బతిని ఏ క్షణానైనా కూలిపోయేలా వుంది. ప్రహరీ లేకపోవడంతో హాస్టల్ చుట్టూ వర్షానికి నీరు చేరుతోంది.
డక్కిలిలో అధ్వాన్నంగా బీసీ హాస్టల్
డక్కిలి బీసీ బాలుర హాస్టల్‌లో గదులన్నీ అధ్వాన్నంగా వున్నాయి. కిటికీలకు తలుపులు పూర్తిగా ఊడిపోవడంతో గోతాములు కట్టి మూసేశారు. వర్షానికి గదులు ఉరుస్తున్నాయని విద్యార్థులు చెప్పారు. బాత్‌రూమ్ దుర్వాసన వెదజల్లుతోంది.
అసంపూర్తి భవనంలో నాయుడుపేట కాలేజీ హాస్టల్
నాయుడుపేట బీసీ సంక్షేమ కళాశాల వసతి గృహం అద్దె భవనంలో నడుస్తోంది. భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఫ్లోరింగ్ పూర్తి కాలేదు. గోడలకు ప్లాస్టరింగ్ జరగలేదు. కిటికీలు, తలుపులు కూడా ఏర్పాటు కాలేదు. ఆ గదుల్లోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు.
హాజరు శాతం దారుణం
ఫ కేవీబీపురం ఎస్సీ బాలుర హాస్టల్‌లో 70 మంది పిల్లలు వుండాల్సి వుండగా సోమవారం రాత్రి 8 గంటల సమయంలో సందర్శిస్తే సగం మందే వున్నారు.
ఫ బీఎన్ కండ్రిగ ఎస్సీ బాలుర హాస్టల్‌లో 66 మందికి గానూ 20 మంది.. బీసీ బీసీ బాలుర హాస్టల్‌లో 115 మందికి 70 మంది.. ఎస్సీ బాలికల హాస్టల్‌లో 113 మందికి 50 మంది ఉన్నారు.
ఫ డక్కిలి బీసీ బాలుర హాస్టల్‌లో 17 మందికి గానూ 10 మందే వున్నారు.
ఫ కోట బీసీ బాలుర హాస్టల్‌లో 98 మందికి గానూ 48 మందే వున్నారు.
ఫ ఓజిలి బీసీ బాలుర హాస్టల్‌లో 40 మందికి గానూ సోమవారం 25 మంది హాజరైనట్టు రిజిస్టర్‌లో నమోదు చేశారు. కానీ, రాత్రి 8 గంటల సమయంలో సందర్శించినప్పుడు 19 మంది మాత్రమే ఉన్నారు.