వంటనూనెలు సలసల!
ABN , Publish Date - Sep 16 , 2024 | 01:10 AM
లీటరుపై రూ.25వరకు ధర పెంపు
చిత్తూరు కలెక్టరేట్, సెప్టెంబరు 15: వంట నూనెలపై దిగుమతి సుంకం పెంచినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించడమే తరువాయి. ధరలు అమాంతంగా పెరగడం ప్రారంభమయ్యాయి. శని, ఆదివారాలకే లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. వంట నూనె ధరల పెంపుతో గృహిణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొత్త సరుకులపై కాకుండా నిల్వవున్న సరుకును కూడా అధిక ధరలకు విక్రయించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎక్కువ మంది ఉపయోగించే పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. శని, ఆదివారాల్లో దుకాణాలకు వెళ్ళిన వినియోగదారులకు రిక్తహస్తాలు ఎదురయ్యాయి. ఇదే అదునుగా కొందరు వ్యాపారులు నోస్టాక్ బోర్డును పెట్టి డిమాండ్‌ను సృష్టిస్తున్నారు.
గాడితప్పనున్న బడ్జెట్
సన్‌ఫ్లవర్ నూనె 15 లీటర్ల డబ్బా ఖరీదు శుక్రవారం వరకు రూ.1730. శని, ఆదివారాలకంతా రూ.2000కు చేరింది. లీటరు ప్యాకెట్ ధర రూ.108 నుంచి రూ.125-130కి ఎగబాకింది. అంటే లీటరుపై రూ.17 నుంచి రూ.23 వరకు పెరిగింది. 15 లీటర్ల పామోలిన్ నూనె డబ్బా ధర మొన్నటి వరకు రూ.1530 ఉండగా, ఇప్పుడది రూ.1730 దాటింది. మొన్నటి వరకు లీటరు ధర రూ.95 ఉండగా, శనివారానికి రూ.115కు చేరగా లీటరుకు రూ.20 వరకు పెరిగింది. వంటనూనెలు లేకుండా ఆహారపదార్థాల తయారీని ఊహించలేము. ఇప్పుడా వంటనూనె ధరల పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతుల వంటింటి బడ్జెట్ ఒక్కసారిగా గాడితప్పే పరిస్థితి ఏర్పడింది. పూజలకు వినియోగించే వివిధ రకాల నూనెల ధరలు కూడా అమాంతం పెంచేశారు. మొన్నటి వరకు లీటరు ధర రూ.100 - 110 వరకు వుండగా, అవి ఇప్పుడు రూ.125-130కి చేరాయి.
బ్లాక్ మార్కెట్‌కు తరలింపు
కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచనుందన్న సమాచారంతో మిల్లుల యజమానులు, వ్యాపారులు వంట నూనెలను బ్లాక్ మార్కెట్‌కు తరలించేశారు. రెండ్రోజుల క్రితం డబ్బులు చెల్లించుకుని శనివారం డెలివరి ఇవ్వాల్సిన ట్యాంకర్లకు సంబంధించి మొత్తాన్ని వ్యాపారులకు వ్యాపారసంస్థలు వెనక్కి ఇచ్చేశాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డబ్బు చెల్లిస్తే సరఫరా చేస్తామని షరతు విధించాయి. దీంతో హోల్‌సేల్, రీటైల్ వ్యాపారులు పెరిగిన ధరల ప్రకారమే విక్రయాలు ప్రారంభించారు. పామాయిల్, సన్‌ఫ్లవర్ అయిల్ మలేసియా నుంచి మన దేశానికి ఎక్కువగా దిగుమతి అవుతుంది. శని, ఆదివారాలు సెలవులతోపాటు సోమవారం మలేసియా మార్కెట్‌కు సెలవుదినం కావడంతో మంగళవారం వరకు ఆ ధరల పెరుగుదలపై స్పష్టత వచ్చే ఆస్కారం లేదు. సుంకం 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
నెలకు రూ.5 కోట్ల అదనపు భారం
చిత్తూరు జిల్లాలో నెలకు సుమారు 30 నుంచి 40 లక్షల లీటర్ల వంటనూనెను వినియోగిస్తున్నట్లు హోల్‌సేల్ డీలర్లు అంచనా వేశారు. ఒక్కసారిగా లీటరుపై కనిష్టంగా రూ.15-20 పెరిగినందున నెలకు రూ.5 కోట్లు వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. దసరా, దీపావళి వంటి ముఖ్య పండుగలు వరుసగా ఉన్న నేపథ్యంలో నూనె వాడకం భారీగా పెరుగుతుంది.
కల్తీకి రెక్కలు
మార్కెట్‌లో వంటనూనె విడి విక్రయాల పేరుతో కల్తీకి అవకాశముంది. రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్లు, చిన్న హోటళ్ళు, మాంసాహార భోజనం తయారీ దారులు ఎక్కువగా విడినూనెనే కొనుగోలు చేస్తుంటారు. ఈ విడివిక్రయాలను అడ్డం పెట్టుకుని కొంతమంది కల్తీలు విక్రయించే అవకాశాలున్నాయి.