Share News

తుంగభద్ర బోర్డు ఖాతా ఫ్రీజ్‌ సడలింపు

ABN , Publish Date - Nov 30 , 2024 | 03:43 AM

తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ను తొలగిస్తూ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

తుంగభద్ర బోర్డు ఖాతా ఫ్రీజ్‌ సడలింపు

జీతాలు, పరిపాలన ఖర్చుల నిధుల డ్రాకు చాన్స్‌

కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులపై కొనసాగుతున్న ఫ్రీజ్‌

‘ఆంధ్రజ్యోతి’ కథనాల ఎఫెక్ట్‌

కర్నూలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ను తొలగిస్తూ ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 3 నెలలుగా జీతాలందక ఇబ్బందులు పడుతున్న బోర్డు ఉద్యోగులు, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం బోర్డు అకౌంట్‌ ఫ్రీజ్‌ చేయడం వల్ల జీతాలు అందక ఉద్యోగులు, కార్మికులు పడుతున్న ఆర్థిక అవస్థలపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించింది. ఈ నెల 22న జరిగిన టీబీపీ బోర్డు సమావేశంలో కూడా చర్చించారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పరిపాలన ఖర్చులకు నిధులు డ్రా చేసుకోవడానికి సడలింపు ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చేయవద్దని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తుంగభద్ర కాలువ ఆధునికీకరణ పేరిట రూ.919 కోట్లకు టెండర్లు పిలిచారు. తొలి దశలో రూ.519.80 కోట్లతో ఎల్లెల్సీ ఆర్‌సీసీ లైనింగ్‌ పనులు చేశారు. రూ.350 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలి. రెండో దశలో రూ.400 కోట్లకు కాంట్రాక్టర్లతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ పనుల్లో బళ్లారిలో స్థిరపడిన ఓ బడా కాంట్రాక్టర్‌ పెత్తనం చేశారు. వైసీపీ హయాంలో బోర్డులో పనిచేసిన ఇంజనీరింగ్‌ ఉన్నతాధికారులు, అప్పటి ఈఎన్‌సీ అండతో ఆ కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి.


మాజీ మంత్రి ఫిర్యాదుతో..

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.115 కోట్లు తుంగభద్ర బోర్డుకు కేటాయించారు. నిధులు రాగానే వైసీపీ రంగు పూసుకున్న ఓ కాంట్రాక్టర్‌కు మెజార్టీ బిల్లులు చెల్లించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే క్రమంలో టీబీపీ బోర్డు పరిధిలో జరిగిన కాలువల మరమ్మతులు, ఆధునికీకరణ పనుల్లో అక్రమాలు జరిగాయని, వాటిని నిగ్గు తేల్చాలని రాయదుర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ వెంటనే బోర్డు ఖాతాను ఫ్రీజ్‌ చేసింది. దీంతో 250 మందికిపైగా ఇంజనీర్లు, వర్క్‌ చార్జ్‌డ్‌ ఉద్యోగులు, సిబ్బంది సెప్టెంబరు నుంచి జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంపై వారంతా టీబీ బోర్డు వర్క్‌ చార్జ్‌డ్‌ ఎంప్లాయీస్‌ అండ్‌ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి టీకే గోపాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 30 , 2024 | 03:43 AM