cheeting: పెళ్లి చేసుకుని.. పారిపోయిన యువతి
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:47 AM
ఏళ్లు గడుస్తున్నా పెళ్లి కావడం లేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. తన పెళ్లి చూడాలన్న వారి కోరిక తీర్చాలని కొడుకు తపించాడు. డబ్బులు ఖర్చు చేసైనా పెళ్లి చేసుకోవాలని దూర ప్రాంత అమ్మాయిని బ్రోకర్ల సాయంతో వివాహం చేసుకున్నాడు. వారం రోజుల తరువాత ఆమె మస్కా కొట్టి వెళ్లిపోయింది. బ్రోకర్లు ఫోన ఎత్తడం మానేశారు.
పురం వరుడికి భీమవరం బ్రోకర్ల బురిడీ
హిందూపురం, అక్టోబరు 1: ఏళ్లు గడుస్తున్నా పెళ్లి కావడం లేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు. తన పెళ్లి చూడాలన్న వారి కోరిక తీర్చాలని కొడుకు తపించాడు. డబ్బులు ఖర్చు చేసైనా పెళ్లి చేసుకోవాలని దూర ప్రాంత అమ్మాయిని బ్రోకర్ల సాయంతో వివాహం చేసుకున్నాడు. వారం రోజుల తరువాత ఆమె మస్కా కొట్టి వెళ్లిపోయింది. బ్రోకర్లు ఫోన ఎత్తడం మానేశారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇలా మోసపోయాడు. ఆ వ్యక్తి నాలుగు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వారానికే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులు ఆగి కాపురానికి వస్తానన్న ఆమె.. తిరిగి రాకపోవడంతో బాధితుడు హిందూపురం అప్‌గ్రేడ్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. బాధితుడు వ్యవసాయం చేస్తున్నాడు.
రైతు కావడంతో నలభై ఏళ్లు గడిచినా పెళ్లి కాలేదు. దీంతో సోమందేపల్లి మండలానికి చెందిన స్నేహితుడితో కలిసి భీమవరంలో అమ్మాయిలను చూసేందుకు ఏప్రిల్‌లో వెళ్లారు. అక్కడ కొందరు పెళ్లిళ్ల బ్రోకర్లు అమ్మాయిలను చూపించారు. నీలపు బాల అనే అమ్మాయితో పెళ్లి కుదిర్చారు. బాధితుడి తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వీడియో కాల్ ద్వారా చూపించి, అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బ్రోకర్లకు రూ.4 లక్షలు ఇచ్చాడు. భార్యతో కలిసి స్వస్థలానికి చేరుకున్నాడు. వారం రోజుల తరువాత తన తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని నీలపు బాల భర్తకు చెప్పింది. ‘పెళ్లి సమయంలో తల్లిదండ్రులు లేరని చెప్పావు కదా?’ అని ఆమెను నిలదీయడంతో ‘ఎవరు చెప్పారు నాకు తల్లిదండ్రులు లేరని?’ అని ఆమె భర్తను ప్రశ్నించింది. పుట్టింటికి పంపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో చేసేది లేక ఆమెను భీమవరానికి తీసుకువెళ్లాడు. అక్కడ రైల్వేస్టేషనకు చేరుకోగానే ‘నువ్వు మా ఇంటికి రావద్దు. ఇంట్లో తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబ సభ్యులు గొడవపడతారు. నేనొక్కదాన్నే వెళతా..’ అని భర్తకు చెప్పింది. తన తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడగానే తిరిగి వస్తానని నమ్మించి, భర్తను వెనక్కు పంపించింది. కొన్ని రోజుల తరువాత ఫోన నంబర్‌ను బ్లాక్ చేసింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు.. మధ్యవర్తులను సంప్రదించాడు. మొదట్లో ఒకరిద్దరు స్పందించారు. ఆ తరువాత ఫోన లిఫ్ట్ చేయడం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తాడేపల్లి గూడెం వెళ్లాడు. అక్కడి పోలీసులు స్పందించలేదు. దీంతో మంగళవారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేస్తామని సీఐ ఆంజనేయులు తెలిపారు.