సెబ్ రద్దు
ABN , Publish Date - Sep 12 , 2024 | 03:38 AM
గత ప్రభుత్వంలోని పెద్దల కోసం సృష్టించిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) రద్దయిపోయింది.
పాత స్వరూపంలోకి ఎక్సైజ్.. ఉత్తర్వులు జారీ
సెబ్‌లో ఉన్న సిబ్బంది ఆ శాఖకు బదిలీ
ఆస్తులు, స్టేషన్లు, వాహనాలు కూడా..
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలోని పెద్దల కోసం సృష్టించిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) రద్దయిపోయింది. వారి అక్రమాలకు అనుకూలంగా వ్యవహరించిన ఈ ప్రత్యేక వ్యవస్థను కూటమి ప్రభుత్వం తుడిచిపెట్టింది. మద్యం సంబంధిత నేరాలకు పరిమితం కావాల్సిన ఎక్సైజ్ శాఖను వైసీపీ ప్రభుత్వం రెండు ముక్కలు చేసి సెబ్‌ను ఏర్పాటుచేసింది. ఎర్రచందనం, ఇసుక, గుట్కా, గ్యాంబ్లింగ్ లాంటి అదనపు బాధ్యతలను ఆ శాఖకు అప్పగించి ఏ పనీ చేయకుండా నిర్వీర్యం చేసింది. దీంతో ఇటు మద్యం అటు ఇసుక అక్రమ రవాణా నేరాలు భారీగా పెరిగాయి. మద్యం ద్వారా రావాల్సిన ఆదాయానికి గండి పడింది. సెబ్ వద్దంటూ ఆ శాఖ ఉద్యోగులు గగ్గోలు పెట్టినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం అక్రమాలకు కేంద్రంగా మారిన సెబ్‌ను రద్దుచేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బుధవారం సెబ్ ఏర్పాటుతో సహా సంబంధిత 12 జీవోలను రద్దుచేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఎక్సైజ్‌ను విభజించినప్పుడు 70శాతం అధికారులు, ఉద్యోగులను సెబ్‌కు కేటాయించారు. వారందరినీ తిరిగి ఎక్సైజ్ శాఖలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే సెబ్ కోసం పోలీసు, గనుల శాఖల నుంచి అధికారులను కేటాయించగా, వారిని మాతృశాఖల్లో రిపోర్టు చేయాలని స్పష్టంచేసింది. సెబ్ కార్యాలయాలు, స్టేషన్లను ఎక్సైజ్‌కు అప్పగించాలని తెలిపింది. చరాస్తులు, మౌలిక సదుపాయాలు, పెండింగ్ బిల్లులు, కంప్యూటర్లు, అద్దె వాహనాలు ఎక్సైజ్‌కు బదిలీ చేయాలని స్పష్టంచేసింది. సెబ్ సీజ్ చేసిన వాహనాలు, వస్తువులు కూడా ఎక్సైజ్‌కు బదిలీ చేయాలని ఆదేశించింది.సెబ్ రద్దు కావడంతో ఎక్సైజ్ శాఖ పూర్తిగా పాత స్వరూపంలోకి రానుంది. ఇందుకోసం శాఖ పునర్నిర్మాణంపై ఎక్సైజ్ ఉత్తర్వులు జారీచేయనుంది. గతంలో ప్రతి జిల్లాకు ఒక డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఉండగా, ఇప్పుడు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వారిని నియమించనుంది. అలాగే జిల్లాకో ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను కేటాయిస్తుంది. నేరాల నియంత్రణకు పాత విధానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఉంటారు. ఆయన పరిధిలో టాస్క్‌ఫోర్స్ విభాగాలు పనిచేస్తాయి.
భారీగా పెరిగిన నేరాలు
సెబ్ ఏర్పాటుచేశాక నేరాలన్నీ తగ్గిపోతాయని గత ప్రభుత్వం ప్రచారం చేయగా అందుకు విరుద్ధంగా మద్యం సంబంధిత నేరాలు భారీగా పెరిగాయి. ఎన్‌డీపీఎల్ పెద్ద్దఎత్తున వచ్చింది. గతంలో నాటుసారా రహిత జిల్లాలుగా ప్రకటించిన జిల్లాల్లో తిరిగి నాటుసారా ప్రారంభమైంది. గంజాయి వినియోగం ఎప్పుడూలేని విధంగా గ్రామస్థాయికి విస్తరించింది. ప్రభుత్వ మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బ్రాండ్లలో గోల్‌మాల్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ప్రభుత్వానికి మద్యంపై రావాల్సిన ఆదాయంలో భారీగా తగ్గింది. దాదాపు రూ.18వేల కోట్ల ఆదాయం కోల్పోయినట్లు ఈ ప్రభుత్వం అంచనా వేసింది. ఇసుక, ఎర్రచందనం, గుట్కా, గ్యాంబ్లింగ్ అక్రమాలపై సెబ్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.