Share News

క్లీన్‌ ఎనర్జీతో ముందడుగు

ABN , Publish Date - Oct 21 , 2024 | 03:40 AM

పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 అమలుతో రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు.

క్లీన్‌ ఎనర్జీతో ముందడుగు

పునరుత్పాదక ఇంధన రంగంలో క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 అమలు

ఐదేళ్లలో 67,000 కోట్ల ఆదాయం లక్ష్యం

7.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ విజయానంద్‌

అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 అమలుతో రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని 2029 వరకూ అమలు చేయడం ద్వారా పది లక్షల కోట్ల పెట్టుబడులు, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రణాళికలు అమలు చేయనున్నామని తెలిపారు. ఈ విధానంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు మానవ వనరుల అభివృద్ధిని కూడా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ విధానాలను అవలంభించడం ద్వారా 24 గంటలూ విద్యుత్‌ సరఫరాతో పాటు వచ్చే ఐదేళ్లలో రూ.67,000 కోట్ల ఆదాయాన్ని విద్యుత్‌ సంస్థలు ఆర్జిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా విద్యుత్‌ రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 16వ తేదీన కేబినెట్‌ సమావేశంలో క్లీన్‌ ఎనర్జీ-2024 పాలసీ ఆమోదం పొందిన నేపథ్యంలో ఆదివారం విజయవాడలోని విద్యుత్‌ సౌధలో జెన్కో ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌బాబు, ఏపీట్రాన్స్‌కో జేఎండీ కీర్తి చేకూరి, డిస్కమ్‌ల సీఎండీలు పట్టన్‌శెట్టి రవి, ఐ.పృథ్వితేజ్‌, సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఎండీ కమలాకరబాబుతో విజయానంద్‌ సమీక్ష నిర్వహించారు. సంప్రదాయేతర ఇంధన రంగంలో పోటీతత్వాన్ని పెంచేలా ప్రైవేటు భాగస్వామన్ని ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించే వీలుందని వెల్లడించారు. విద్యుత్‌ వాహనాలకు 5000 ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ కింద మూడు గిగావాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ సామర్థ్యంతో పది లక్షల గృహాలకు సౌర విద్యుత్‌, పీఎం కుసుమ్‌ పఽథకాలను అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. క్లీన్‌ ఎనర్జీలో భాగంగా పెట్టుబడులు పెట్టిన సంస్థలకు ప్రోత్సాహకాలు అందజేయనున్నామని విజయానంద్‌ చెప్పారు.

Updated Date - Oct 21 , 2024 | 03:40 AM