అతిసారం మరణాలపై సమగ్ర విచారణ
ABN , Publish Date - Oct 21 , 2024 | 03:31 AM
విజయనగరం జిల్లా గొర్లలో అతిసారం మరణాలపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు.
గొర్లలో వైద్యశిబిరాలను కొనసాగించాలి: సీఎం ఆదేశాలు
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా గొర్లలో అతిసారం మరణాలపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. గొర్లలో అతిసారంతో 8 మంది చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్ష చేశా రు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సాయం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి, సురక్షిత తాగునీరు అందిస్తున్నామని జిల్లా అధికారులు సీఎంకు తెలిపారు. అయితే, అసలు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని సీఎం నిర్ణయించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్‌తో విచారణ జరిపించాలని నిర్ణయించారు. మరణాలకు అసలు కారణం ఏంటీ? ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటీ? అనేది తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరపాలని సీఎం భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు తాగునీరు సరఫరా చేయాలని, వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ధైర్యం చెప్పి, సమస్య పరిష్కారమయ్యే వరకు వారికి అండగా ఉండాలని అధికారులకు సూచించారు.