రూ.46 లక్షల విలువైన173 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Feb 13 , 2024 | 02:24 AM
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, చేవెళ్ల ప్రాంతాల్లో గంజాయి ముఠాలు పట్టుబడ్డాయి. ఆ ముఠాల నుంచి రూ.46లక్షల విలువైన 173కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహేశ్వరం, చేవెళ్లలో స్వాధీనం
ఐదుగురి అరెస్టు, పరారీలో మరో ఆరుగురు
మహేశ్వరం/చేవెళ్ల, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, చేవెళ్ల ప్రాంతాల్లో గంజాయి ముఠాలు పట్టుబడ్డాయి. ఆ ముఠాల నుంచి రూ.46లక్షల విలువైన 173కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం పోలీసులు ఆదివారం శ్రీశైలం-హైదరాబాద్ రహదారిపై 109 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.30లక్షలు ఉంటుందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి సోమవారం తెలిపారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నుంచి మెదక్ జిల్లాకు ఆటోలో గంజాయిని తరలిస్తుండగా మహేశ్వరం గేటు వద్ద గంజాయిని పట్టుకున్నట్టు తెలిపారు. ఆటోలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపూర్ మండలం తుమ్మలచెరువుకు చెందిన సోమ రాకేశ్‌రెడ్డి, తాటి చంటిబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. ఇదే కేసులో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కోర లోకేశ్, మెదక్ జిల్లాకు చెందిన బాణావత్ రాహుల్ పరారీలో ఉన్నారని తెలిపారు. లోకేష్, రాహుల్ గంజాయి వ్యాపారం చేస్తుంటారని, రాకేశ్‌రెడ్డి, చంటిబాబు మధ్యవర్తులుగా ఉంటూ ఆటోలో గంజాయి తరలిస్తారన్నారు. మరో ఘటనలో సోమవారం చేవెళ్లలో పోలీసులు గంజాయి ముఠా నుంచి రూ.16 లక్షల విలువైన 64కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన చిత్ర కైలా్‌సమోహితి, నౌనాథ్ గణ్పత్‌చౌహన్, మాధన్ బాలసాహెబ్‌బయస్, రాజేష్ సుభాశ్‌మొహెతే, రేఖ, మనోజ్‌సింగ్‌వీ, లాము పాలాఠీ గంజాయిని ఒడిశాలోని బ్రహ్మపూర్ నుంచి తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తుంటారు. మహారాష్ట్రలో ఎక్కువ ధరకు గంజాయి అమ్మేందుకు నగరం నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో చేవెళ్లలోని శంకర్‌పల్లి చౌరస్తాలో మహారాష్ట్రకు వెళ్లే లారీల కోసం ఎదురుచూస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చౌరస్తాకు చేరుకొని గంజాయితో ముగ్గురు పట్టుకోగా నలుగురు పారిపోయారు. వారి నుంచి 64కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిత్రకైలాస్, నౌనాథ్ గణ్పత్, మాధన్‌లను రిమాండ్‌కు తరలించారు.