‘యాసంగి’ జోరు

ABN , First Publish Date - 2023-01-25T00:08:18+05:30 IST

హనుమకొండ జిల్లాలో యాసంగి జోరుగా సాగుతోంది. సాగు పనుల్లో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఈ యాసంగిలో అత్యధికంగా వరి 1010 (దొడ్డురకం) సాగు చేస్తున్నారు.

‘యాసంగి’ జోరు

సాగు పనుల్లో రైతులు బిజీబిజీ

జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు అంచనా..

96వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి

వెదజల్లు పద్ధతిలో 2వేల ఎకరాలకుపైగా వరిసాగు

కలిసొస్తున్న వరి 1010 రకం

పెరుగుతున్న మొక్కజొన్న సాగు విస్తీర్ణం

అందుబాటులో ఎరువులు, విత్తనాలు

హనుమకొండ అగ్రికల్చర్‌, జనవరి 24 : హనుమకొండ జిల్లాలో యాసంగి జోరుగా సాగుతోంది. సాగు పనుల్లో రైతులు బిజీబిజీగా ఉన్నారు. ఈ యాసంగిలో అత్యధికంగా వరి 1010 (దొడ్డురకం) సాగు చేస్తున్నారు. మొక్కజొన్న సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. ఇక జిల్లాలో నాలుగేళ్లలో వెదజల్లు పద్ధతిలో వరిసాగు విస్తీర్ణం కూడా పెరిగింది. దిగుబడులు పెరిగి ఖర్చులు తక్కువగా ఉండడంతో వెదజల్లే పద్ధతిలో సాగుచేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. హనుమకొండ జిల్లాలో దాదాపు రెండు వేల ఎకరాల్లో వెదజల్లు పద్ధతిలో రైతులు వరిసాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఇక దొడ్డురకం వరి సాగుకు 100 రోజులు కావడం, వరి ధాన్యానికి అధిక బరువు ఉండడం వల్ల లాభం కలుగుతుంది. దిగుబడైన వరిధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడంతో లాభసాటిగా మారింది. సన్నాలు పండించే రైతులు కూడా దొడ్డురకం వరిసాగువైపు మొగ్చుచూపుతున్నారు. వరి సాగు విస్తీర్ణం పెరుతుండటంతో వ్యవసాయ అధికారులు రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో పెట్టారు. క్షేత్రస్థాయిలో సందర్శించి పంటల వివరాలు సేకరించి రైతులకు తగుసూచనలు చేస్తున్నారు.

పెరిగిన వరిసాగు

రోజురోజుకు వరి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో 1,84,140 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. గత యాసంగిలో అంచనాలకు మించి లక్షకు పైగా ఎకరాల్లో వరిసాగవడంతో ఈ యాసంగిలో 1,20,500 ఎకరాల్లో వరి సాగవనున్నట్లు గతంలోకన్నా అధికంగా వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు వేశారు. అంతే కాకుండా 60,010 ఎకరాల్లో మొక్కజొన్న, 430 ఎకరాల్లో కంది, 1,050 ఎకరాల్లో చిరుధాన్యాలు, ఇతర పంటలు సాగవనున్నట్లు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో సబ్సిడీపై సరఫరా చేయాల్సిన ఎరువులు, విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 30,125 క్వింటాళ్ల వరి(ఎంటీయూ 1010, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, కేఎన్‌ఎం 118, ఎంటీయూ 1001 రకాలు) విత్తనాలు, మినుములు(పీయూ 31) 32, పెసర్లు 40(ఎంజీజీ 295, డబ్ల్యూజీజీ 42), కంది (జేజీ 11) 108, వేరుశనగ కేజీ రకం 1,290, నువ్వులు శ్వేతరకం 3 క్వింటాళ్లు పంపిణీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. యాసంగి ప్రారంభం నుంచి రైతులుకు కావాల్సిన విత్తనాలు పంపిణీ చేయగా ప్రస్తుతం వరి 2,902, మొక్కజొన్న 4,800, వేరుశనగ 63.75, కంది 131.25, మినుము 54.95, పెసర్లు 90.42, శనగ 17.72 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు.

అందుబాటులో ఎరువులు

వరిసాగుకు రైతులు అధిక మొత్తంలో ఎరువులను వినియోగిస్తుండటం, వరిసాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో అధికంగా తెప్పించే ఏర్పాటు చేస్తున్నారు. యూరియా 24,859 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 9,207 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్సు ఎరువులు 7,366 మెట్రిక్‌ టన్నులు, 23,018 మెట్రిక్‌ టన్నుల నత్రజని, పొటాషియం ఎరువుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అవసరం మేరకు విడతల వారీగా ఎరువులను రైతులకు పంపిణీ చేసేందుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

జోరుగా సాగు పనులు

జిల్లాలో ఇప్పటి వరకు 1,26,515.32 ఎకరాల్లో వరి నాట్లతో పాటు వివిధ పంటలు వేశారు. 96,716 ఎకరాల్లో వరి నాట్లు వేయగా దాదాపు 29 వేల ఎకరాలలో మొక్కజొన్న, జొన్న 6, సజ్జ 2, గోధుమ 3.2, పశువుగ్రాసం 35, నూనెగింజలు(వేరు శనగ, సోయ, నువ్వులు, పొద్దుతిరుగుడు) 351.31 ఎకరాల్లో వేశారు. కంది 43, మినుము 10.13, బొబ్బెర 23.01, పెసర 25.13, ఉలవలు 6.33, శనగ 3 ఎకరాల్లో వేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

రసాయనాల వాడకం తగ్గించాలి

- కె.దామోదర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు

రైతులు సాగులో రసాయనాల వాడకం తగ్గించాలి. వరిసాగు ఆరంభంలో రైతులు జీలుగ, జనుము పండించుకొని పొలంలోనే కలియదున్నుకుంటే ఎరువుల వాడకం తగ్గించుకోచ్చు. జిల్లాలో సాగునీటికి ఢోకా లేకపోవడం, దిగుబడైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడంతో రైతులు అధికశాతం వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులు నేల రకం ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవడం ముఖ్యం. నల్ల నేలల్లో జొన్న, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పైర్లను విత్తుకోవచ్చు. పట్టణానికి దగ్గరగా ఉన్న రైతులు కూరగాయలను సాగు చేయడం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఆరుతడి పంటలైన పప్పు దినుసులు, నూనె గింజలు వేరుశనగ, పెసర, నువ్వుల పంటలను ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఆరుతడి పంటలతో పాటు తడిపొడి, వెదజల్లే పద్ధతిలో వరిసాగుచేసుకుని అధిక దిగుబడులు సాధించాలి.

Updated Date - 2023-01-25T00:08:24+05:30 IST