Bayyaram Steel Plant: ‘కోట’లో ఖనిజాలున్నా!

ABN , First Publish Date - 2023-01-27T03:10:11+05:30 IST

అపార ఖనిజ సంపద ఉన్న ప్రాంతం. భూమి పొరల్లో అత్యంత విలువైన ఇనుప ఖనిజం, సున్నపురాయి నిక్షేపాలు, బెరైటీస్‌ గనులు. వాటిని వెలికితీసి పరిశ్రమలు నెలకొల్పితే.. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఖనిజ సంపద భూమి పొరల్లో మూలుగుతోంది. ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశానిస్పృహలకు లోనవుతోంది.

 Bayyaram Steel Plant: ‘కోట’లో ఖనిజాలున్నా!

వెలికితీతలో ప్రభుత్వాల నిర్లక్ష్యం..

మానుకోట జిల్లాలో అపార ఖనిజ సంపద

పరిశ్రమలు నెలకొల్పితే ఉపాధి అవకాశాలు

బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌పై నెరవేరని ఆశలు

మహబూబాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): అపార ఖనిజ సంపద ఉన్న ప్రాంతం. భూమి పొరల్లో అత్యంత విలువైన ఇనుప ఖనిజం, సున్నపురాయి నిక్షేపాలు, బెరైటీస్‌ గనులు. వాటిని వెలికితీసి పరిశ్రమలు నెలకొల్పితే.. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశం. కానీ, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఖనిజ సంపద భూమి పొరల్లో మూలుగుతోంది. ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశానిస్పృహలకు లోనవుతోంది. మహబూబాబాద్‌ జిల్లాలో ఈ పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఖనిజాలను వెలికితీద్దామని, పరిశ్రమలు నెలకొల్పి మన యువతకు ఉపాధి కల్పించుకుందామని చెప్పిన నేతలు.. పాలకులయ్యాక ఆ విషయాన్నే మరిచిపోయారు. దీంతో మానుకోట జిల్లా పరిస్థితి ‘అంగట్లో అన్నీ ఉన్నా...’ అన్నట్లు తయారైంది.

2iron-Ore.jpg

జిల్లాలోని గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల ఏజెన్సీ మండలాల్లో ఖనిజ నిక్షేపాలను వినియోగించుకుని పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించాల్సి ఉన్నా.. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ఉక్కు చుట్టే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కేంద్రం చేయడం లేదని రాష్ట్రం, రాష్ట్ర వైఫల్యమని కేంద్రం పరస్పర విమర్శలతో కాలం గడుపుతున్నాయే తప్ప.. ఉక్కు మినహా ఇతర వనరులను పట్టించుకునే దిశగా ప్రయత్నలేవీ చేయడంలేదు.

ఉక్కుకు సంకెళ్లు.. వీడేదెన్నడు?

తెలంగాణకు రావాల్సిన ఏకైక ఉక్కు పరిశ్రమ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరుగున పడేశాయి. బయ్యారం ఇనుప ఖనిజం నిక్షేపాల వెలికితీతకు ఆరు దశాబ్ధాల కిందటి చరిత్ర ఉంది. 1952లో తొలిసారిగా బయ్యారంలో మినీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి కొంతకాలంపాటు ఇనుప ఖనిజాన్ని వెలికితీశారు. ఆ ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలతోపాటు జపాన్‌కు ఎగుమతి చేసేవారు. అయితే ఏ కారణం వల్లనో గానీ ఇనుప ఖనిజం వెలికితీత పనులు నిలిచిపోయాయి. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004 నుంచి 2009 వరకు ఐదేళ్లపాటు ఖనిజాన్ని మళ్లీ వెలికితీసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు అంశం కీలకంగా మారడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం.. రాష్ట్ర విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో స్టీల్‌ పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని చేర్చింది. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్లు సర్వేలు నిర్వహించాయి. పలు సంస్థలు చేపట్టిన సర్వేల్లో కూడా స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు దిశగానే సానుకూల నివేదిక వచ్చినట్లు ప్రకటనలు వెలువడ్డాయి.

కానీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉక్కు ఫ్యాక్టరీపై నాన్చుతూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చివరికి ఏర్పాటు కుదరదని సుప్రీంకోర్టులో తేల్చిచెప్పింది. దీంతో సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. కేంద్రం ఒప్పుకోకపోయినా స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టి తీరతామని ప్రకటించారు. సింగరేణి సంస్థతోపాటు టీఎ్‌సఎండీసీతో ఖనిజ నాణ్యత, పరిమాణంపై సర్వేలు కూడా చేయించారు. ఇక్కడ సరిపడా ఖనిజం లేకపోయినా పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని బైలడిల్లా నుంచైనా ముడిసరుకును దిగుమతి చేసుకొని బయ్యారంలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఒకానొక సందర్భంలో హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర మంత్రి బీరేందర్‌సింగ్‌ కూడా తెలంగాణవాదులకు తీపి కబురంటూ ఖమ్మం జిల్లా స్టీల్‌ ఫ్యాక్టరీపై ఊరించేలా ప్రకటనలు చేశారు. అయితే ఆ తరువా త అదంతా వట్టిదే అయిపోయింది. బయ్యారంలో సుమారు 300 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల అపార ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయని జి యాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండి యా నివేదికలు చెబుతున్నా.. కేంద్రం నాణ్యమైన ఐరన్‌ ఓర్‌ బయ్యారంలో లేదని చెప్పడంతో ఉక్కు సంకల్పం ఉట్టికెక్కింది.

గార్ల ఏజెన్సీలో బెరైటీస్‌..

జిల్లాలోని గార్ల మండలం శేరిపురం, పోచారం అటవీ ప్రాంతాల్లోని సుమారు 1300 హెక్టార్లలో బెరైటీస్‌ గనులు విస్తరించి ఉన్నాయి. ఈ ఖనిజ సంపదపై కన్నేసిన కొందరు పెద్దలు దశాబ్దాలుగా తవ్వకాలు జరుపుతూ తరలించుకుపోయి రూ.కోట్లు గడించారు. శేరిపురం, పోచారం రిజర్వు ఫారె్‌స్టలోని కంపార్ట్‌మెంట్‌ 42, 43, 44లలో సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో బెరైటీస్‌ ఖనిజం నిక్షిప్తమై ఉంది. సర్వే నెంబరు 76లో 300 ఎకరాలు, సర్వే నెం.57, 58లో మరో 300 ఎకరాల్లో అధికారికంగా తవ్వకాలకు అనుమతులుండగా, కొందరు పెద్దలు అనుమతులు లేని వందలాది ఎకరాల్లోనూ అనేక ఏళ్లపాటు అక్రమ మైనింగ్‌లు జరిపారు. 1965 నుంచి ఈ గనుల లీజు పొందిన ఓ ప్రైవేటు కంపెనీ.. సదరు ప్రాం తంలో 1/70 చట్టం నుంచి అప్పటి ప్రభుత్వం ద్వారా మినహాయింపు అనుమతులు పొంది 2009 వరకు తవ్వకాలు సాగించింది. గార్ల ఏజెన్సీలో 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే ఆదివాసీ గిరిజన సంఘాల ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని వనరులపై గిరిజనులకు సర్వహక్కులను కల్పిస్తూ 1977లో స్పష్టమైన ఆదేశాలు లభించాయి. ఆ క్రమంలోనే గార్ల బెరైటీస్‌ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం రిజర్వు ఫారెస్ట్‌ పరిధిలో ఉందని, అందుకు అనుమతులను రద్దు చేయాలనే అటవీశాఖ విజ్ఞప్తి మేరకు సుప్రీంకోర్టు 2008లో జాయింట్‌ సర్వేకు ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. దీంతో అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఉషారాణి బెరైటీస్‌ గనులపై ప్రత్యేక దృష్టి సారించారు. 2009లో తవ్వకాలను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాం వరకు తవ్వకాలు లేకున్నా.. అంతకు పూర్వం వరకు తవ్వి నిల్వఉంచిన గనుల తరలింపు కొనసాగింది.

బెరైటీస్‌కు భారీ డిమాండ్‌..

ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన గార్ల ఏజెన్సీ బెరైటీస్‌ ఖనిజానికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. టన్నుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతోంది. పెట్రోల్‌ ట్యాంకుల నిర్మా ణం, గ్యాస్‌ పైపుల తయారీలో బెరైటీస్‌ ను ఉపయోగిస్తారు. దీంతోపాటు ఔషధాల తయారీ, రాతి కళాఖండా లు పెయింటింగ్‌ తయారీలోనూ వాడుతారు. ఆయుధ మందుగుండు తయారీలోనూ బెరైటీస్‌ పొడిని ఉపయోగిస్తారనే ప్రచారం ఉంది. బెరైటీస్‌ పరిశ్రమ నెలకొల్పితే జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బెరైటీస్‌ పరిశ్రమకు కావాల్సిన నీటి సౌకర్యం కూడా ఈ ప్రాంతంలో ఉంది. మున్నేరు ప్రాజెక్టుతో నీటి కొరతను అధిగమించే అవకాశంతోపాటు రవాణా సౌకర్యానికి రైలుమార్గం కూడా అందుబాటులో ఉంది.

గంగారం ఏజెన్సీలో సున్నపురాయి..

జిల్లాలోని మారుమూల గంగారం ఏజెన్సీ మడగూడెం శివారులోని కణుజువాగు ప్రాంతంలో రూ.లక్షల విలువ చేసే అపార సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడి గిరిజనులు సున్నపురాయిని ముద్దలుగా చేసి సిమెంటు సంచుల్లో నింపి తమ వద్దకు వచ్చే దళారులకు నామమాత్రపు ధరకు విక్రయిస్తుంటారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన దళారులు వీటిని నర్సంపేట, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి నగరాలకు తీసుకువెళ్లి అధిక ధరలకు విక్రయిస్తారు. ఈ ఖనిజంతో శానిటరీ వస్తువులు, తెల్లని వస్తువులు, కప్పులు, సాసర్లు, పింగాణి పాత్రలు, చాక్‌పీ్‌సలు తయారు చేయవచ్చని చెబుతున్నారు. పాలకులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం, గూడూరులో ఇనుప ఖనిజ నిక్షేపాలు, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గార్ల ఏజెన్సీలోని బెరైటీస్‌ ఖనిజం, గంగారం ఏజెన్సీలోని కణుజువాగు సున్నపురాయి నిక్షేపాల ఆధారిత పరిశ్రమ ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిరుద్యోగులు ఆశిస్తున్నారు.

Updated Date - 2023-01-27T03:39:14+05:30 IST