రైతు‘బందు’..!

ABN , First Publish Date - 2023-01-25T00:11:53+05:30 IST

కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతుల్లో ఆందోళన నెలకొంది. వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఇటు డబ్బులు రాక.. రాష్ట్రవ్యవసాయ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందకపోవడంతో వారిలో నిరుత్సాహం నెలకొంది. గతనెల 28 నుంచి రైతులకు బ్యాంకుల్లో డబ్బులు పడుతున్నాయి. అయితే జిల్లాలో కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతుల వివరాలను డేటాలో పొందుపరుచకపోవడంతో, నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

రైతు‘బందు’..!
మహబూబాబాద్‌లో వరినాట్లు వేస్తున్న కూలీలు

కొత్తగా దరఖాస్తు చేసుకున్న 5,491 మందికి మొండిచెయ్యి

పెట్టుబడి సాయం ఇవ్వని రాష్ట్రప్రభుత్వం

ఇంకా రైతుల ఖాతాల్లో జమకాని డబ్బులు

జిల్లా వ్యాప్తంగా మొత్తం కర్షకులు 1,79,780

ఇప్పటి వరకు 1,76,592 మంది అన్నదాతలకు నిధుల చెల్లింపు

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జనవరి 24 : కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతుల్లో ఆందోళన నెలకొంది. వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఇటు డబ్బులు రాక.. రాష్ట్రవ్యవసాయ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందకపోవడంతో వారిలో నిరుత్సాహం నెలకొంది. గతనెల 28 నుంచి రైతులకు బ్యాంకుల్లో డబ్బులు పడుతున్నాయి. అయితే జిల్లాలో కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతుల వివరాలను డేటాలో పొందుపరుచకపోవడంతో, నిధులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది.

మహబూబాబాద్‌ జిల్లాలో 1,79,780 మంది రైతులకు గాను రూ.196 కోట్ల 54 లక్షల 52 వేల 317లు పెట్టుబడి సాయం అందించారు. ఇప్పటి వరకు 1,76,592 మందికి రూ.179 కోట్ల 94 లక్షల 15 వేల 590 వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యాయి. అయితే గత మూడు రోజుల నుంచి మిగతా 3,188 మంది రైతులకు గాను రూ.16 కోట్ల 60 లక్షల 36 వేల 722లు పెట్టుబడి సాయం అందకుండా నిలిచిపోయాయి. కొత్తగా రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్న 5,491 మంది రైతుల పెట్టుబడి సాయం హైదరాబాద్‌ కమిషనరేట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి.

కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన వారిలో నిరాశ..

కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఖాతాల్లోకి నిధులు మళ్లించకపోవడంతో రైతులు నిరాశకు లోనవుతున్నారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు రైతుబంధు నిధుల విడుదలపై నేటి వరకు స్పష్టమైన ఆదేశాలు అందకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

జిల్లాలోని 18 మండలాల్లో 5,491 మంది రైతులు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందారు. బయ్యారంలో 129, చిన్నగూడూరు 133, దంతాలపల్లిలో 266, డోర్నకల్‌లో 360, గంగారంలో 47, గార్లలో 113, గూడూరులో 226, కేసముద్రంలో 686, కొత్తగూడలో 110, కురవిలో 585, మహబూబాబాద్‌లో 442, మరిపెడలో 714, నర్సింహులపేటలో 269, నెల్లికుదురులో 479, పెద్దవంగరలో 276, తొర్రూరులో 656 దరఖాస్తులు ఉన్నాయి.

అయితే కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు వచ్చిన రైతులకు రైతుబంధు, రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. దీంతో గ్రామాలకు వెళ్లి సమావేశాలు పెట్టి, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వ్యవసాయశాఖ ముఖ్య కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నుంచి వచ్చిన డేటాలో పాత రైతుల రైతుబంధు వివరాలు మాత్రమే ఉన్నాయే తప్ప.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు లేవు. గత 9 విడతలో దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతుబంధు అందగా ఈ సారి మాత్రం ఇంత వరకు ఆదేశాలు రాకపోవడంతో రైతులు పరేషాన్‌కు గురవుతున్నారు. పాత రైతులకు మరో రెండు, మూడు రోజుల్లో సాయం పూర్తవుతోండగా కొత్త దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతుబంధు సాయం అందుతుందా..! లేదా అనేది వేచి చూడాల్సిందే. కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు రైతుబంధు పథకం రావడం లేదని, డేటాలో వారి వివరాలు లేవని సంబంధిత అధికారులను వివరణ కోరగా ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందలేదని సమాధానం ఇచ్చారు.

పదో విడత రైతుబంధు ఇలా..

మహబూబాబాద్‌ జిల్లాలో పదో విడత 2022-23 రైతుబంధు పథకం అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా 1,79,780 మంది రైతులు ఉండగా, వారికిగాను ఇప్పటి వరకు 1,76,592 మంది రైతులకు గాను రూ.179 కోట్ల 94 లక్షల 15 వేల 590 పెట్టుబడి సాయం అందించారు. సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు పథకం పూర్తి చేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించి.. గతనెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు మళ్లిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ మూడు రోజుల పాటు రైతుబంధు ఖాతాలు ఎక్కడికక్కడ నిలిచిపోయినప్పటికి మళ్లీ సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లోకి రెండ్రోజుల పాటు నిధులు విడుదల చేసింది. అయితే గత మూడ్రోజుల నుంచి మళ్లీ రైతుబంధు పథకం నిధులు ఆగిపోయాయి.

కొత్త వారికి రైతుబంధు సాయం అందించాలి : పల్లా సుమలత మహిళారైతు, చిన్నముప్పారం, ఇనుగుర్తి మండలం

నాకు 1.10 ఎకరాల భూమికి కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకం వచ్చింది. వ్యవసాయాధికారులు రైతుబంధు, రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో దరఖాస్తు చేసుకున్నాను. తోటి రైతులకు రైతుబంధు సాయం అందుతున్నా.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న నాకు రాలేదు. పెట్టుబడి సాయం, లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా.

Updated Date - 2023-01-25T00:11:53+05:30 IST