తారుమారేనా..?!

ABN , First Publish Date - 2023-09-19T23:53:00+05:30 IST

మహిళా బిల్లుతో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. రిజర్వేషన్లతో తమ స్థానాలు తారుమారవుతాయనే టెన్షన్‌ పలువురు నేతల్లో నెలకొంది. మరికొందరు తమ రాజకీయ భవిష్యత్తు గల్లంతవుతుందని బెంగపడుతున్నారు.

 తారుమారేనా..?!

మహిళా బిల్లుతో పురుష నేతల్లో ఉత్కంఠ

2011 జనాభా ఆధారంగా రిజర్వేషన్లు

2027 తర్వాతే అమలయ్యే అవకాశం

అసెంబ్లీ సెగ్మెంట్లలో పెను మార్పు

భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంథనిలో సగానికి పైగా మహిళలే..

భూపాలపల్లి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లుతో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. రిజర్వేషన్లతో తమ స్థానాలు తారుమారవుతాయనే టెన్షన్‌ పలువురు నేతల్లో నెలకొంది. మరికొందరు తమ రాజకీయ భవిష్యత్తు గల్లంతవుతుందని బెంగపడుతున్నారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లను కల్పించే 128వ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నా పలువురిలో టెన్షన్‌ మొదలైంది. ఈ బిల్లుతో తెలంగాణలో సుమారు 40 అసెంబ్లీ సీట్లు మహిళలకు కేటాయించే అవకాశం ఉంది. దీంతో తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందననే ఆందోళన నెలకొంది. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో పురుష నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. అయితే.. ఈ బిల్లుతో ఇప్పట్లో వచ్చే ఇబ్బందేమీ లేదని, 2027 తర్వాతే చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడికావడం కాస్త ఊరట కలిగిస్తోంది.

ఎలా అమలు చేస్తారు..?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుతో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఎలా అమలు చేస్తారోననే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఆయా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా రిజర్వేషన్‌ కల్పిస్తారా.. లేక రాష్ట్రం మొత్తంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలు అత్యధికంగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లను రిజర్వ్‌ చేస్తారా..? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి భూపాలపల్లి జిల్లా పరిధిలోని భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, మంథని నియోజకవర్గాల్లో మహిళలే అధికంగా ఉన్నారు. మంథని మినహా మిగతా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు టాప్‌ 40లోనే ఉండటంతో ఇవి భవిష్యత్తులో మహిళలకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయని నేతలు లెక్కలు వేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భూపాలపల్లి నియోజకవర్గంలో మొత్తం 3,23,775 జనాభా ఉన్నారు. ఇందులో పురుషలు 1,61,663 మంది, మహిళలు 1,62,112 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో మహిళలు 50.07శాతం ఉండగా, రాష్ట్ర స్థాయి మహిళా జనాభాలో 37వ స్థానంలో భూపాలపల్లి ఉంది. అలాగే ములుగు సెగ్మెంటులో మొత్తం జనాభా 2,83,466 మంది ఉంది. 1,41,220 మంది పురుషులు, 1,42,246 మంది మహిళలు ఉన్నారు. మొత్తం జనాభాలో 50.18 శాతం మహిళలు అధికంగా ఉండగా రాష్ట్రస్థాయిలో ములుగు నియోజకవర్గం మహిళా జనాభాలో 27 స్థానంలో ఉంది. భద్రాచలం సెగ్మెంటులో మొత్తం 1,96,417 జనాభా ఉంది. 96,414 మంది పురుషులు, 1,00,003 మంది మహిళలు ఉన్నారు. మొత్తం జనాభాలో 50.91శాతం మహిళలతో రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో స్థానంలో ఈ సెగ్మెంటు ఉంది. మంథని నియోజకవర్గంలో మొత్తం 2,88,788 మంది జనాభా ఉంది. 1,44,345 మంది పురుషులు, 1,44,443 మంది మహిళలు ఉన్నారు. మొత్తం జనాభాలో 50.02 శాతంతో రాష్ట్ర స్థాయి మహిళా జనాభాలో 43 స్థానంలో ఈ నియోజకవర్గం ఉంది. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా 33 శాతం మహిళలకు రిజర్వు చేయాల్సి ఉంటుంది. దీంతో 40 సీట్లు మహిళలకే కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో 2011 జనాభా పరంగా చూస్తే మహిళలు అత్యధికంగా ఉన్న టాప్‌40 అసెంబ్లీ సీట్లలో భూపాలపల్లి, ములుగు, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు సెగ్మెంట్లు మహిళలకు రిజర్వేషన్‌ కావటం పక్కా అనే టాక్‌ ఉంది. ఏదైనా రిజర్వుషన్లు, ఇతర సర్దుబాట్లు ఏమైనా ఉంటే తప్ప మంథని సెగ్మెంటు మహిళా రిజర్వేషన్‌లోకి రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఎన్నికల్లో కూడా పాత పద్ధతే..

మహిళా రిజర్వేషన్‌ అనేది రాజ్యంగ సవరణ బిల్లు కావటంతో పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత 50శాతం రాష్ట్ర శాసన సభలు కూడా ఆమోదించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు అమల్లోకి వస్తుందని అంటున్నారు. దీంతో ఈ బిల్లు పార్లమెం టులో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటికిప్పుడే ఆమల్లోకి రావడం అసాధ్యమనే టాక్‌ వినిపిస్తోంది. దీంతో 2027 నుంచి ఈ బిల్లు చట్టరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే.. తెలంగాణలో డిసెంబరులో జరిగే ఎన్నికలు పాత పద్ధతినే సాగుతాయని అంటున్నారు. 2028లో జరిగే ఎన్నికల నాటికి ఈ మహిళా రిజర్వేషన్‌ అమలయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తమకు ఇదే చివరి ఎన్నికలని పలువురు పురుష నేతలు భావిస్తున్నారు.

మహిళా నేతలు రెడీ

పురుష నేతలకు దీటుగా మహిళా నేతలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా, వరంగల్‌ జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ఒకదశలో ఈసారి ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డికి బదులుగా గండ్ర జ్యోతినే బరిలో నిలుస్తారనే ప్రచారం జరిగింది. ఇక బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి సైతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అలాగే టీపీసీసీ సభ్యుడు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు సతీమణి గండ్ర పద్మ కూడా రాజకీయాల్లో ఉన్నారు. 2019లో జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికల్లో గణపురం జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. మూడు ప్రధాన పార్టీల నుంచి మహిళలే బలమైనే నేతలు ఉండటంతో భవిష్యత్తులో వీరే ప్రత్యార్థులుగా తలపడే అవకాశాలు లేకపోలేదనే టాక్‌ ఉంది. భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎస్టీ రిజర్వు నియోజకవర్గమైన ములుగులో మహిళల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతుంది. కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే సీతక్క రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈసారి కూడా సీతక్క బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్‌ జాతీయ నేతల్లోనూ సీతక్కకు గుర్తింపు ఉంది. ములుగు జడ్పీ చైర్‌పర్సన్‌ నాగజ్యోతి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారయ్యారు. 2019లో తాడ్వాయి జడ్పీటీసీగా గెలిచిన నాగజ్యోతి జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఏప్రిల్‌లో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ మృతితో నాగజ్యోతి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ ములుగు అభ్యర్థిగా కూడా అధిష్ఠానం ఆమెను ఎంపిక చేసింది. ఇక బీజేపీ నుంచి కృష్ణవేణి నాయక్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వీరే కాకుండా మంథిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సతీమణి శైలజ సైతం రాజకీయాల్లో కీలకం వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మంథని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరిస్తున్నారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతితోపాటు అనేక మంది మహిళలు రాజకీయాల్లో ఉన్నారు. అవకాశం వస్తే తమ సత్తాను చాటేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఈ బిల్లుతో భవిష్యత్తులో చాలా మంది మహిళలకు చట్ట సభల్లో అడుగు పెట్టే అవకాశం లభించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-09-19T23:53:00+05:30 IST