‘చింతలగట్టు’లో మండమెలిగె పండుగ

ABN , First Publish Date - 2023-01-26T00:44:55+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు మం డలం మచ్చర్ల-దామరవంచ-జగన్నాయకుల గూడెం సరిహద్దు అటవీ ప్రాంతంలో చింతలగట్టు వట్టెవాగు మినీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతరకు సర్వం సిద్ధమైంది.

‘చింతలగట్టు’లో మండమెలిగె పండుగ
ఆదివాసీ పూజా విధానం

గూడూరు, జనవరి 25 : మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు మం డలం మచ్చర్ల-దామరవంచ-జగన్నాయకుల గూడెం సరిహద్దు అటవీ ప్రాంతంలో చింతలగట్టు వట్టెవాగు మినీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహాజాతరకు సర్వం సిద్ధమైంది. చింతలగట్టు మేడారంలో బుధవారం వనదేవతల ఆలయాలను శుద్ధిచేసి, మండమెలిగే పండుగను నిర్వహించారు. అడవి నుంచి తెచ్చిన పూలతో సమ్మక్క-సారలమ్మ గద్దెలను అలంకరించారు. అమ్మవార్లకు పూజాసామగ్రి, వస్త్రాలు, పసుపు కుంకుమలను పూజారులు సమర్పించారు. మహిళలు పుట్టమట్టితో దేవాలయంలో ఉన్న శక్తి పీఠానికి పసుపు, కుంకుమలు పెట్టి పూజలు నిర్వహించారు. అడవి పొలిమేరల్లో నీళ్లకుండాలను ఆరగించారు. దృష్టశక్తులు రాకుండా ధ్వజస్తంభం ఏర్పాటు చేసి, కోడిపిల్లను కట్టారు. ప్రధాన పూజారి దారం సిద్ధు అమ్మవార్లకు వస్త్రాలతో అలంకరించారు. గుడికి మామిడి ఆకుల తోరణా లు కట్టించారు. పూజారులు గద్దెల పైకి చేరుకొని పూజలు నిర్వహించి మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. మండమెలిగే మొదలు జాతర పూర్తియ్యే వరకు పూజారులు ఉపవాసాలు ఉంటారు. మండ మెలిగే కార్యక్రమంలో పూజారుల కమిటీ అధ్యక్షుడు దారం సిద్దు, ఆలయ కమిటీ అధ్యక్షుడు పెనుక నాగయ్య, జాతర నిర్వహకులు, పూజారులు సహదేవులు, భద్రయ్య, సనుప వీరస్వామి, లక్షయ్య, నరేష్‌, సుధాకర్‌, బుచ్చిరాములు, వీరస్వామి, వెంకన్న, సారయ్య, ఆదివాసీ ఉద్యోగులు నాగయ్య, స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌ దంపతులు కార్యక్రమానికి హాజరయ్యారు. వనదేవతలను దర్మించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతర నిర్వాహకులకు రూ.5 వేల విరాళం అందించారు.

1వ తేదీ నుంచి జాతర ప్రారంభం..

చింతలగట్టు సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే నాలుగు రోజులు సందడిగా ఉంటుంది. జనపూనకాలతో వనస్తలిని ఊపేస్తాయి. సుమారు రెండు లక్షల మందిని ఆ తల్లిచెంతకు చేరుస్తాయి. గూడెపు సంప్రదాయానికి, ఆదివాసీ ఆచారాల్ని ప్రపంచానికి చాటుతాయి. ఆదివాసీ బిడ్డలు సమ్మక్క-సారలమ్మలకు ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు జాతర జరుగుతుంది. అత్యంత గోప్యంగా నిర్వహించే ఆదివాసీ పూజా విధానం, చింతలగట్టు మేడారంలో జరిగే తీరూ ఆద్యంతం ఆసక్తికరం.

Updated Date - 2023-01-26T00:44:55+05:30 IST