సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో... దోపిడీ ప్రభుత్వంపై యుద్ధం

ABN , First Publish Date - 2023-02-07T00:12:00+05:30 IST

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే మేడారం నుంచి తొలి అడుగు వేశానని, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో దోపిడీ స ర్కారుపై యుద్ధం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో... దోపిడీ ప్రభుత్వంపై యుద్ధం
మేడారం నుంచి పాదయాత్రగా వస్తున్న టీపీసీసీ అఽధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు

తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పు రావాలంటే కేసీఆర్‌ పోవాలి

రూ.25 వేల కోట్లను రాబందుల సమితి దోచుకుంది

కేసీఆర్‌ పాలన రజాకార్ల రాజ్యాన్ని తలపిస్తోంది

దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న ప్రధాని మోదీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

మేడారంలో ‘హాత్‌ సే హాత్‌ జోడో’ యాత్రకు శ్రీకారం

పస్రాలో రోడ్‌ షో.. పాలంపేటలో రాత్రి బస

ములుగు/గోవిందరావుపేట, ఫిబ్రవరి 6: కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే మేడారం నుంచి తొలి అడుగు వేశానని, రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తితో దోపిడీ స ర్కారుపై యుద్ధం చేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘హాత్‌సేహాత్‌ జోడో’ పేరుతో రేవంత్‌రెడ్డి సోమవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడా రం వనదేవతల సన్నిధి నుంచి యాత్రకు శ్రీకారం చుట్టా రు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లురవి, బలరాంనాయక్‌, సిరిసిల్ల రాజయ్య, ఏఐసీసీ ప్రతినిధులు బోసురాజ్‌, నవీన్‌ జావిద్‌, రోహిత్‌చౌదరి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, మాజీ ఎమ్మెల్యేలు అద్దంకి దయాకర్‌, విజయరమణారావు, చిన్నారెడ్డి, రా మ్మోహన్‌రెడ్డి, రంగారెడ్డి, పుష్పలీల, సీనియర్‌ నాయకుడు బెల్లయ్యనాయక్‌ సంఘీభావం తెలుపుతూ వెంట పాల్గొన్నారు.

తొలుత వనదేవతల గద్దెలను దర్శించుకున్న రేవంత్‌రెడ్డికి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క తిలకం దిద్ది మంగళహారతి ఇచ్చి యాత్రను ప్రారంభించారు. అశేష కార్యకర్తలు, అభిమానుల కేరింతల నడుమ యాత్రను మొదలుపెట్టిన రేవంత్‌రెడ్డి గోవిందరావుపేట మండలం టప్పామంచా నుంచి పస్రా వరకు పాదయాత్రగా వచ్చారు. అనంతరం పస్రాలో రాత్రి జరిగిన రోడ్‌షోలో రేవంత్‌రెడ్డి ప్రజలనుద్ధేశించి మాట్లాడారు. తెల్లదొరల నుంచి కాంగ్రె్‌సపార్టీ స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తే ప్రధాని మోదీ తన అధికారాన్ని పదిలం చేసుకునేందుకు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ ఎండ, వాన, చలికి బెదరకుండా కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు పాదయాత్ర చేసి దేశానికి ఏకం చేశారని, ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ చైతన్యవంతులను చేసేందుకు తాను హాత్‌సేహాత్‌ యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు.

సీతక్క మా ఇంటి ఆడబిడ్డ

సీతక్క తమ ఇంటి ఆడబిడ్డ అని, వీరతిలకందిద్ది నన్ను సాగనంపారని, ఇక యాత్ర విజయవంతం అయినట్టేనని రేవంత్‌రెడ్డి అన్నారు. 2003లో దివంగత ముఖ్యమంత్రి వైఎ్‌స.రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేసి సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అదేవిధంగా సీతక్క నియోజకవర్గమైన ములుగు నుంచి చేపట్టిన ఈయాత్ర ద్వారా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అన్నారు.

రజాకార్ల రాజ్యం తిరిగొచ్చినట్లుంది..

కేసీఆర్‌ పాలన విధానాలను చూస్తుంటే ఆనాడు బొందపెట్టిన రజాకార్ల రాజ్యం తిరిగివచ్చినట్లుందని అన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది బలిదానాలు చేసి తెలంగాణను సాధించుకున్నారని, నేటికీ అమరుల తల్లిదండ్రుల రోదనలు వినిపిస్తూనే ఉన్నాయని అన్నారు. వారి త్యాగాలపై మట్టి కప్పాలని చూస్తే మౌనంగా ఉండలేనని అన్నారు. కేసీఆర్‌ దోపిడీని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సంక్షేమమంటే పింఛన్లలో కోత పెట్టడం, రుణమాఫీ చేయకపోవడం, ఉద్యోగాలను భర్తీ చే యకపోవడం, ఆరోగ్యశ్రీని బొందపెట్టడం, రూ.5వేలకోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎగ్గొట్టడం, 6వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్‌ పాలన మొదలైన తర్వాత ప్రవేశపెట్టిన పది బడ్జెట్‌లలో రూ.25లక్షల కోట్లను ప్రకటించారని తెలిపారు. ఈ లెక్కన చూస్తే ప్రతి నియోజకవర్గానికి రూ.20వేల కోట్ల నిధులు రావాలని, ఆలెక్కన ఎంతో అభివృద్ధి జరగాలన్నారు. వేలకోట్ల నిధులను రాబందుల సమితి దోచుకుందని, పదిశాతం పెత్తందారుల కోసం, 90శాతంమంది ప్రజలను మోసం చేసిన కేసీఆర్‌ తెలంగాణను బొందలగడ్డగా మార్చారని అన్నారు. మార్పు రావాలంటే కేసీఆర్‌ పాలన పోవాలని, ఎన్నికలప్పుడు ఇచ్చే మద్యం, డబ్బుకు ఆశపడకుండా కొట్లాడాలని ప్రజలను కోరారు. ఈసందర్భంగా ఓ పిట్టకథను చెప్పిన రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు ఏమీ తెలియదని, చెప్పినా వినడని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో అధికారం ఖాయం : మాణిక్‌రావ్‌ ఠాక్రే

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రె్‌సపార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే అన్నారు. చారిత్రాత్మక భారత్‌జోడో ద్వారా రాహుల్‌గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు వివరిస్తూ భరోసా కల్పించేందుకు రేవంత్‌రెడ్డి హాత్‌సేహాత్‌ యాత్ర చేపట్టారని అన్నారు. ప్రజలనుంచి వస్తున్న స్పందన చూస్తుంటే కాంగ్రె్‌సకు బలం రెట్టింపు అవుతుందని అన్నారు.

మీరే కుటుంబంగా బతుకుతున్నా : ఎమ్మెల్యే సీతక్క

నియోజకవర్గ ప్రజలే కుటుంబంగా బతుకుతున్నానని, మూడు తరాలవారు అప్యాయంగా అక్కా అని పిలుచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. ప్రజాసంక్షేమ రాజ్యస్థాపనే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారని, మేడారం వనదేవతల సన్నిధి నుంచి ప్రారంభించడం గర్వంగా ఉందని అన్నారు. యాత్రను అడ్డుకునేందుకు ఇప్పటికప్పుడు ఆంక్షలు పెడుతున్నారని, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోడుభూములకు పట్టాలిస్తామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే పేదలకు భూములు పంచి పట్టాలిచ్చామని, ఉపాధిహామీ పథకం కూడా అమలు అయిందని అన్నారు. పస్రాలో రోడ్‌షో కోసం తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు తర్వాత ఆంక్షలు పెట్టడం, యాత్రకు తరలివస్తున్న కార్యకర్తల వాహనాలను అడ్డుకోవడం సరికాదని అన్నారు.

రాహుల్‌గాంధీ మొనగాడు... : షబ్బీర్‌అలీ

కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు భారత్‌జోడో యాత్ర చేపట్టి దేశ ప్రజలందరిని ఐక్యం చేసిన రాహుల్‌గాంధీ మొనగాడు అని మాజీమంత్రి షబ్బీర్‌అలీ అన్నారు. రేవంత్‌రెడ్డి హాత్‌సేహాత్‌జోడో యాత్ర చేపట్టడం శుభసూచకమని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్‌సపార్టీ అధికారంలోకి వచ్చితీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, నిత్యావసరాల ధరలు పెంచుతూ అప్పులపాలు చేస్తున్నాయని అన్నారు. కాంగ్రె్‌సతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు.

కవితకు సిగ్గులేదు : మధుయాష్కీగౌడ్‌

కేసీఆర్‌ కుమార్తె కవితకు సిగ్గూశరం లేదని, మహిళా అయి ఉండి వందలకోట్ల లిక్కర్‌స్కాం చేస్తున్నారని మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు సీతక్క ధైర్యంగా ముందుకు వచ్చి గడపగడపకు తిరిగారని, ఎమ్మెల్సీ కవిత మాత్రం స్కాంలు చేస్తున్నారని అన్నారు.

శ్రేణులు తరలిరాగా... నేతలు వెంటరాగా...

తొలిరోజు రేవంత్‌ పది కి.మీ. యాత్ర

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తొలిరోజు పది కిలోమీటర్ల మేర యాత్ర చేశారు. ములుగు సమీపంలోని గట్టమ్మతల్లికి ఆయన తొలిపూజ చేసి మేడారానికి పయనమయ్యారు. ములుగు, భద్రాచలం ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, పొదెం వీరయ్య, మాజీ ఎంపీ బలరాంనాయక్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు వందలాదిమంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. మేడారంలో సమ్మక్క-సారలమ్మలు, వనదేవతల గద్దెలను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి మొక్కులు సమర్పించారు. స్థానిక ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈసందర్భంగా రేవంత్‌రెడ్డిని పలు కుల, ప్రజాసంఘాల ప్రతినిధులు కలిసి తమ సంఘీభావం తెలిపారు. వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం గోవిందరావుపేట మండలం టప్పామంచా వద్ద గల క్యాంపుకు చేరుకున్నారు. అక్కడ భోజనం అనంతరం అక్కడి నుంచి పస్రాకు పాదయాత్రకు బయల్దేరారు. వందలాది మంది కార్యకర్తలు వెంట నడుస్తుండగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు నడిచారు. పస్రాలో రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అక్కడి నుంచి గోవిందరావుపేట వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అక్కడ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి నేరుగా వెంకటాపూర్‌(రామప్ప) మండలం పాలంపేటకు వచ్చి రాత్రి బస చేశారు.

నేటి పర్యటన షెడ్యూల్‌..

రేవంత్‌రెడ్డి యాత్ర ములుగు నియోజకవర్గంలో మంగళవారం కూడా కొనసాగనుంది. రామప్ప దేవాలయాన్ని సందర్శించి రుద్రేశ్వరుడికి పూజల అనంతరం పాదయాత్రగా రామాంజాపురం, వెల్తుర్లపల్లి క్రాస్‌రోడ్డు, బుద్దారం, కేశవాపురం, నర్సాపురం, బండారుపల్లి మీదుగా ములుగు వస్తారు. సాయంత్రం జిల్లాకేంద్రంలో జరిగే రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.

మార్మోగిన సీఎం నినాదం

రేవంత్‌రెడ్డిని చూసిన ఆనందంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు. ‘కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. గట్టమ్మ, సమ్మక్క-సారలమ్మల దర్శనం సమయంలో, పస్రా రోడ్‌షో సందర్భంగా కార్యకర్తలు ‘సీఎం..సీఎం..’ అంటూ స్లొగన్స్‌ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ ప్రసంగిస్తుండగా మధ్యలో కలుగజేసుకున్న కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌ సీఎం అని ప్రకటించాల్సిందిగా కోరారు. దానికి స్పందించిన బలరాంనాయక్‌ ‘జై సీఎం..’ అంటూ నినాదం చేశారు.

Updated Date - 2023-02-07T00:12:02+05:30 IST