ఈ-నామ్‌లో మిర్చి కొనుగోళ్లు షురూ..

ABN , First Publish Date - 2023-01-31T00:16:32+05:30 IST

మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఈ-నామ్‌ పద్ధతిలో ప్రారంభమైన మిర్చి, అపరాల కొనుగోళ్లను మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అజ్మీర రాజు పరిశీలించారు.

ఈ-నామ్‌లో మిర్చి కొనుగోళ్లు షురూ..
మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన మిర్చి

పరిశీలించిన మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజు

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, జనవరి 30: మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఈ-నామ్‌ పద్ధతిలో ప్రారంభమైన మిర్చి, అపరాల కొనుగోళ్లను మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అజ్మీర రాజు పరిశీలించారు. ఈ మార్కెట్‌లో అపరాలకు మాత్రమే ఈ నామ్‌ పద్ధతిలో కొనుగోళ్లు జరిగేవి. మిర్చికి మాత్రం వ్యాపారుల మధ్య బహిరంగ వేలం జరిగేది. గత కొన్నేళ్లుగా మిర్చి ఈ నామ్‌లో ప్రవేశ పెట్టాలని మార్కెట్‌ అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సోమవారం నుంచి మార్కెట్‌లో ఈ-నామ్‌ పద్ధతి ద్వారానే అన్ని సరుకులకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విజయవంతంగా కొనుగోళ్లు పూర్తి చేశారు. సుమారు 5వేల మిర్చి బస్తాల వరకు రాగా, 4వేల బస్తాల వరకు ఈ-నామ్‌ పద్ధతిలో వ్యాపారులు కొనుగోలు చేశారు. మిగిలిన వెయ్యి బస్తాలు మంగళవారం ఖరీదు చేయనున్నారు. మిర్చి క్వింటాల్‌కు రూ.15,200 నుంచి రూ.18,859 ధర పలికింది. సగటున మిర్చి రూ.17,250 ధర పలికింది. అలాగే పత్తి క్వింటాల్‌కు రూ.5,200 నుంచి రూ.7,937 వరకు ధర పలుకుగా, సగటున రూ.7,933 ధర పలికింది. డిప్యూటీ డైరెక్టర్‌ వెంట జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఎం.వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కార్యదర్శి జి.రాజేందర్‌, సహాయ కార్యదర్శి ఖాజాపాషా, సూపర్‌వైజర్‌ రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-31T00:16:35+05:30 IST