టైగర్‌ జోన్‌తో అడవి బిడ్డలకు కష్టం..?!

ABN , First Publish Date - 2023-02-01T00:27:11+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో టైగర్‌జోన్‌ల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెద్ద పులుల మనుగడకు ఆటంకంగా మారుతున్న జనసంచారాన్ని తగ్గించేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. అభయారణ్యంలో ఉన్న జనవాసాలను మైదాన ప్రాంతంలోకి తరలించాలన్న ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం మొదటిసారిగా 2012లో తీసుకువచ్చింది. టైగర్‌జోన్‌ ప్రాంతాల్లో జనసంచారం లేకుంటేనే, ఇతర వన్య ప్రాణుల సంతతి వృద్ధి చెందుతుందని, అక్కడ నివసిస్తున్న వారిని మైదాన ప్రాంతాల్లోకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

టైగర్‌ జోన్‌తో అడవి బిడ్డలకు కష్టం..?!

మొదటి దశలో దొరవారితిమ్మాపురంను ఖాళీ చేయించనున్న అధికారులు

ఇప్పటికేస్థానికులతో మూడుసార్లు చర్చలు

గ్రామానికి విద్యుత్‌ సరఫరా కట్‌

ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తున్న ఆదివాసీలు, ఆదివాసీ సంఘాలు

గూడూరు, జనవరి 31 : తెలంగాణ రాష్ట్రంలో టైగర్‌జోన్‌ల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెద్ద పులుల మనుగడకు ఆటంకంగా మారుతున్న జనసంచారాన్ని తగ్గించేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. అభయారణ్యంలో ఉన్న జనవాసాలను మైదాన ప్రాంతంలోకి తరలించాలన్న ప్రతిపాదనలను కేంద్రప్రభుత్వం మొదటిసారిగా 2012లో తీసుకువచ్చింది. టైగర్‌జోన్‌ ప్రాంతాల్లో జనసంచారం లేకుంటేనే, ఇతర వన్య ప్రాణుల సంతతి వృద్ధి చెందుతుందని, అక్కడ నివసిస్తున్న వారిని మైదాన ప్రాంతాల్లోకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

పాకాల, ఏటూరునాగారంలతో ఏర్పాటు?

ఇందులో భాగంగానే వరంగల్‌ జిల్లా పాకాల అభయారణ్యం, ములుగు జిల్లాలో ఏటూరునాగారం అభయారణ్యాలను కలిపి టైగర్‌ జోన్‌గా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. పాకాల అభయారణ్యం కింద మహబూబాబాద్‌ జిల్లాలోని బయ్యారం, గూడూరు, కొత్తగూడ, గంగారం రేంజ్‌లు ఉన్నాయి. ఏటూరు నాగారం అభయారణ్యం కింద ములుగు, ఏటూరునాగారం, తాడ్వాయి, పస్త్రా తదితర రేంజ్‌లు ఉన్నాయి.

ఈ అభయారణ్యాల కింద 45 లక్షల హెక్టార్ల అటవీ విస్తరించి ఉంది. ఇందులో 30 శాతం పోడుకు గురైంది. ఈ ప్రాంతంలో పులులు, వన్యప్రాణుల సంచారం ఎక్కువగానే ఉంటుంది. 2018లో టైగర్‌ జోన్‌ చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించాయి. అందులో భాగంగానే మొదటి దశలో గూడూరు రేంజ్‌ పరిధిలో ఉన్న దొరవారి తిమ్మాపురంను గ్రామప్రజల ఆమోదంతో ఖాళీ చేయించి, అక్కడున్న ఆదివాసీలకు మరోచోట అవాసం కల్పించేందుకు కలెక్టర్‌ శశాంకతో పాటు, సంబంధిత జిల్లా అధికారులు ఇప్పటికే యుద్ద ప్రాతిపదికన మూడుసార్లు ఆదివాసీలతో చర్చలు జరిపారు.

వెంగంపేటలో పునరావాసం..

వీరికి గూడూరు రేంజ్‌ పరిధిలోని మర్రిమిట్ట బీట్‌ శివారులో ఉన్న వెంగంపేట సమీపంలో ఉన్న అటవీ భూమిలో ఆవాసం, సాగు కోసం భూమిని కేటాయించినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే దొరవారి తిమ్మాపురానికి త్రీఫెజ్‌ కరెంట్‌ను అభయారణ్యంలో అనుమతి లేదనే సాకుతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఈ క్రమంలో కేవలం సింగిల్‌ఫెస్‌ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఆదివాసీ గూడాలను ఖాళీ చేయించాలనే ఆలోచనను వెంటనే విరమించుకోవాలని ఆదివాసీ సంఘాలైన తుడుందెబ్బ నాయకులు డిమాం డ్‌ చేస్తున్నారు. దొరవారి తిమ్మాపురానికి చెందిన ఆదివాసీలు సైతం స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే మా పూర్వీకులు ఇక్కడే ఉండేవారని, మా వ్యవసాయ జీవనోపాధి ఇక్కడే ఉందని, ఎట్టి పరిస్థితుల్లో గ్రామాన్ని విడిచిపోయేది లేదని ఆరోపిస్తున్నారు.

పునరావాసంపై భిన్నాభిప్రాయాలు..

ప్రభుత్వ జీవో ప్రకారం.. పరిహారం కింద ఒక్కొ కుటుంబానికి రూ.15 లక్షలు లేదా అటవీశాఖ కల్పించే పునరావాస గ్రామానికి వెళ్లడం. ఈ రెండింటిలో ఏదైనా ఒక్కటి ఎంపిక చేసుకోవాలని దొరవారి తిమ్మాపురం ఆదివాసీలను కోరారు. అయితే పరిహారానికి కొందరు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తం గా వారిలో అవగాహన కల్పించడం కోసం ప్రయత్నిస్తున్నారు.

మానిటరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో సర్వే..

జిల్లా కలెక్టర్‌ శశాంక నేతృత్వంలో జిల్లాస్థాయి అధికారులతో మానిటరింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో దొరవారితిమ్మాపురం ఆదివాసీలకు పునరావాసం, పరిహారం ప్రక్రియలపై చర్చలు కొనసాగిస్తున్నారు. దొరవారి తిమ్మాపురంలో 22 కుటుంబాల కోసం పునరావాస ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ములుగు, భూపాలపల్లి జిల్లాలల పరిధిలో ఉన్న రేంజ్‌లలో పదుల సంఖ్యలో గ్రామాలను తరలించేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది.

దొరవారి తిమ్మాపురం తరలింపును అడ్డుకుంటాం

తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఈసం సుధాకర్‌

గూడూరు, జనవరి 31 : టైగర్‌ జోన్‌ పేరుతో దొరవారి తిమ్మాపురంను తరలించే యోచనను ప్రభుత్వా లు విరమించుకోవాలని తుడుందెబ్బ రాష్ట్ర అద్యక్షులు ఈసం సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గూడూరు మండలం మట్టేవాడ శివారు దొరవారి తిమ్మాపురంను మంగళవారం తుడుందెబ్బ ప్రతినిధుల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా ఈసం సుధాకర్‌ మాట్లాడుతూ... స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే దొరవారి తిమ్మాపురంలో ఆదివాసీలు జీవిస్తున్నారన్నారు. టైగర్‌జోన్‌, ఖనిజ సంపద పేరుతో దొరవారితిమ్మాపురంను తరలించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. దొరవారి తిమ్మాపురం గ్రామాన్ని తరలింపును భేషరతుగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే గ్రామంలో 3ఫేజ్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే గ్రామానికి విద్యుత్‌ సరఫరా అందించాలని లేని పక్షంలో ఆదివాసీలను ఐక్యం చేసి ఉద్యమిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెనక నాగేశ్వర్‌రావు, సమ్మయ్య, తిమ్మాపురం ఆదివాసీలు వీరస్వామి, లక్ష్మయ్య, రమేష్‌, మహేందర్‌, ఎల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - 2023-02-01T00:27:13+05:30 IST