అమ్మాలా.. ఆగాలా..?

ABN , First Publish Date - 2023-01-24T23:52:16+05:30 IST

మార్కెట్‌లో రోజురోజుకూ పడిపోతున్న రేటు అడుగంటుతున్న అన్నదాతల ఆశలు గత సంవత్సరం రూ.11వేలు.. ఈసారి రూ.7,800లు మాత్రమే సీసీఐ మద్దతు ధర 6,380 రూపాయలే రూ.12వేలు ప్రకటించాలని డిమాండ్‌

అమ్మాలా.. ఆగాలా..?

బచ్చన్నపేట, జనవరి 24: జిల్లాలో పత్తిరైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు సరైన ధర వస్తుందని ఆశపడితే ఆ ఆశలు నెరవేరేలా కనిపించడంలేదు. గత సంవత్సరం నవంబర్‌ ఆరంభంలో క్వింటా పత్తికి రూ. 9 వేలకు పైగా పలికింది. ఈసారి రూ.11 వేలకు పెరుగుతుందని ఆశించి పత్తిని ఇళ్లల్లో, వ్యవవసాయ బావుల వద్ద చేలల్లో భద్రపర్చుకున్నారు. కాని ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి రేటు రోజురోజుకూ పడిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. భారత పత్తి సంస్థ (సీసీఐ) ఇచ్చే మద్దతు ధరకన్నా, మార్కెట్‌లో ఎక్కువ వస్తుండటంతో సీసీఐకి ఎవకూ అమ్ముకోవటం లేదు. సీసీఐ రూ. 6380 మద్దతు ధర నిర్ణయించగా, బహిరంగ మార్కెట్‌లో ఆరంభంలో రూ.9వేలు పలికింది. ప్రస్తుతం రూ.7800లకు జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులు కేవలం 80 వేల క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. ఈ యేడాది జిల్లా వ్యాప్తంగా 1,39,009 ఎకరాల లో పత్తిని సాగు చేసినట్టు వ్యవసాయా ధికారులు చెబుతున్నారు. చిల్పూరు మండలంలో 4174 ఎకరాలు, స్టేషన్‌ఘ న్‌పూర్‌ 7176, లింగాలఘణపురం 17,909, రఘునాథపల్లి 22,450, జఫర్‌గడ్‌ 14,152, బచ్చన్నపేట 3011, జనగామ 3050, నర్మెట 7435, తరిగొప్పుల 9216, దేవరుప్పుల 17,946, కొడకండ్ల 9335, పాలకుర్తిలో 23,150 ఎకరాల్లో సాగు చేసినట్టు చెబుతున్నారు. కాగా వానకాలంలో అధికంగా వర్షాలు కురియడం, వాతావరణం అనుకూలిం చకపోవటంతో పత్తి దిగుబడులు ఆశించిన మేర రాలేదు. ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి రావల్సి ఉండగా, సగటున 5 నుంచి 6 క్వింటాళ్లకు మించి రావటం లేదు. ఇప్పటికే 80 శాతం మేర రైతులు పత్తిని ఏరగా, ధర పెరుగుదల కోసం మిగతా రైతులు చేనుపైనే ఉంచారు.

ధర పెరుగుతుందనే ఆశతో చూస్తున్నాం..

- మాల్ల అయిలయ్య, రైతు, కట్కూరు

నాలుగు ఎకరాల్లో పత్తి పండించా. దిగుబ డి సరిగా రాలేదు. ఎకరా కు నాలుగు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. రూ. 25 వేల వరకు ఎకరాకు పెట్టుబడి పెట్టా. ధర పెరుగుతుందనే ఆశతో రెండు నెలల నుంచి నిలువ చేశాం. ప్రస్తుతం ఉన్న రేటుకు అమ్ముకుంటే వచ్చే లాభం ఏమాత్రం ఉండదు. ఆరు నెలలు చేసిన కష్టం బూడిదలో పోసినట్టే. రూ. 10 వేల పైచిలుకు పలికితేనే ఎంతోకొంత మిగులుతుంది.

రైతులు అమ్ముకోగానే ధరలు పెంచుతారు

- గొల్లపల్లి బాపురెడ్డి, జిల్లా రైతుసంఘం ఉపాధ్యక్షుడు

రైతులు ఆరు నెలలు కష్టపడి పంట పండించి అమ్ముకునేందుకు సిద్దపడగా, ఆరంభంలో కొంత మేర మంచిరేటుకు కొనుగోలు చేసి అనంతరం సిండికేటుగా మారి దోచుకోవటం పరిపాటిగా మారింది. రైతులు పత్తి అమ్ముకోగానే ధరలు పెరగటం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. సీసీఐ మద్దతు ధర రూ. 12 వేలుగా నిర్ణయించాలి. అప్పుడే రైతుకు లాభం చేకూరుతుంది.

దిగుబడితో పాటు ధర కూడా తగ్గింది..

- వినోద్‌కుమార్‌, జిల్లా వ్యవసాయాధికారి

ఈ దఫా జిల్లాలో 9 లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తి వస్తుందని ఆశించాం. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావాలి. కాని రైతుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 4 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం మూలంగానే దిగుబడి తగ్గిందని చెప్పవచ్చు. రేటు పెరగవచ్చని రైతులు ఇళ్ల వద్దే పత్తి నిలువలు చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. భవిష్యత్‌లో ధర పెరుగుతుందో.. తగ్గుతుందో చెప్పలేం.

Updated Date - 2023-01-24T23:52:26+05:30 IST