ఇల్లు వదలని పత్తి

ABN , First Publish Date - 2023-01-25T00:09:53+05:30 IST

పత్తి అమ్మకాలు మార్కె ట్లో పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో కార్మికులకు చేతినిం డా పని లేకుండా పోయింది. అడ్తిదారులు, ఖరీదుదారు లు వ్యాపారం లేక ఇబ్బందిపడుతున్నారు.

ఇల్లు వదలని పత్తి

ఏనుమాముల మార్కెట్‌లో పడిపోయిన ధర

గిట్టుబాటు ధర కోసం ఇంటివద్దే నిల్వ

వెలవెలబోతున్న మార్కెట్‌

నడవని జిన్నింగ్‌ మిల్లులు

అల్లాడుతున్న కార్మికులు

వరంగల్‌టౌన్‌, జనవరి 24: పత్తి అమ్మకాలు మార్కె ట్లో పూర్తిగా తగ్గిపోయాయి. దీంతో కార్మికులకు చేతినిం డా పని లేకుండా పోయింది. అడ్తిదారులు, ఖరీదుదారు లు వ్యాపారం లేక ఇబ్బందిపడుతున్నారు. చాలా వరకు జిన్నింగ్‌ మిల్లులు నడవక తుప్పుపట్టిపోతున్నాయి. పత్తి గిట్టుబాటు ధర పలకడం లేదని రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. ఏనుమాముల మార్కెట్లో పత్తి క్వింటా రూ.7,500 నుంచి రూ.8వేల వరకే ధర పలుకు తోంది. రైతులు మాత్రం ధర పెరిగితేనే అమ్ముతామని భీష్మించుకుని కూర్చున్నారు. గత ఏడాది కంటే పత్తి దిగుబడి తగ్గినా ధర పెరగడం లేదని రైతులు వాపో తున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు కు మేలు జరగడం లేదని రైతులు పేర్కొంటున్నారు. క్వింటా రూ.15వేలకు పైగా ధర వచ్చినప్పుడే అమ్ముతా మని కొందరు రైతులు పేర్కొంటున్నట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

తగ్గిన పత్తి అమ్మకాలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ సంవత్సరం సుమారు 5 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు సమాచా రం. ఈలెక్కన ఇప్పటికే ఏనుమాముల మార్కెట్‌కు సు మారు 4 లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రావాల్సింది. కానీ ఇప్పటి వరకు కేవలం లక్షా 80వేల క్వింటాళ్ల పత్తి మాత్రమే అమ్మకానికి వచ్చిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 2021లోఅక్టోబరులో లక్ష10 వేల701 క్వింటాళ్లు, నవంబరులో లక్ష7వేల 452 క్వింటాళ్లు, డిసెంబ రులో లక్ష 20వేల 178 క్వింటాళ్లు కలిపి 3లక్షల38వేల 331 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. అదే 2022లో అక్టోబరులో 39వేల 219 క్వింటాళ్లు, నవంబరులో 82వేల 770 క్వింటాళ్లు, డిసెంబరులో56వేల370 క్వింటాళ్లు కలిపి లక్ష 78వేల359 క్వింటాళ్లు అమ్మకానికి వచ్చింది. అంటే దాదాపుగా సగం పత్తి మాత్రమే అమ్మకానికి వచ్చిం దన్నమాట.

ధరలు తగ్గడమే కారణమా..

అంతర్జాతీయ మార్కెట్లో పత్తి (లింట్‌/దూది)కి, సీడ్‌ (గింజలు)కు డిమాండ్‌ పడిపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. సీజన్‌ ప్రారంభమైనప్పటి నుం చి పత్తి ధరలు పరిశీలిస్తే క్వింటాకు ధరలు రూ.7,200 నుంచి రూ.9,500 వరకు ఉన్నాయి. గతేడాదిలో సీజన్‌ ప్రారంభమై నుంచి నెమ్మదిగా పెరుగుతూ రూ.14,700 లకు చేరింది. అప్పటికే రైతుల వద్ద నుంచి 10-15 శాతం పత్తి మినహా మిగతాదంతా దాదాపుగా ఖరీదు దారులు కొనుగోలు చేసిన తర్వాత ధర పెరిగింది. దీంతో లాభపడింది వ్యాపారులు అన్నభావం రైతుల్లో నెలకొంది. ఈసారి వాతావరణం అనుకూలించక పత్తి దిగుబడి సగానికి తగ్గింది. ఎకరానికి పది క్వింటాళ్ల ప త్తి దిగుబడి రావాల్సింది. ఐదు క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. అలాంటప్పుడు ధర గత ఏడాది కంటే మరిం త పెరగాలి కానీ తగ్గడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే ధర వచ్చినప్పుడే అమ్మకానికి పెడతామని రైతులు చెబుతున్నారు.

బోసిబోయిన జిన్నింగ్‌ మిల్లులు

ఏనుమాముల పరిధిలోని పత్తి జిన్నింగ్‌ మిల్లులు మొత్తం 24 ఉండగా 20 రన్నింగ్‌ కండీషన్‌లో ఉన్నాయి. సీజన్‌ ప్రారంభమై 90 రోజులు గడుస్తున్నా ఒక్కొక్క మిల్లు నాలుగు రోజులు, వారం రోజులు మాత్రమే నడిచాయి. మార్కెట్‌ వచ్చే పత్తి ఒకటి, రెండు మిల్లులకే సరిపోతుంది. మిగితా మిల్లులు నడవడం లేదు. మిల్లు నడవకపోయినా కరెంట్‌ బిల్లు, టెక్నిషియన్‌, ఇతర ఖర్చులు నెలకు సుమారు నాలుగు లక్షల వరకు వస్తుంది. దీంతో మిల్లర్లు నష్టాల బారిన పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డున పడుతున్న కార్మికులు

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ పరిధిలోని జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి సీజన్‌లో పనిచేసే కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10వేల మంది వరకు ఉంటారు. వీరంతా మార్కెట్లో, జిన్నింగ్‌ మిల్లుల్లో తగినంత పని దొరక్క రోడ్డున పడుతున్నారు. చాలా మంది మిల్లు వద్ద పనికోసం పడిగాపులు కాస్తున్నారు.

ధర పెరిగితేనే అమ్ముతాం..

- పుచ్చ వీరస్వామి, మొగిలిచర్ల

ఈ యేడు వాతావరణం అనుకూలించక పత్తిపంట చాలా వరకు దెబ్బతిన్నది. కార్మికులు, మందుల ఖర్చులు, పెట్టు బడి పెరిగింది. అయినా మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. అత్య వసరం ఉంటే తప్ప పత్తిని అమ్మడం లేదు. క్వింటాకు పది వేల ధర దాటితేనే అమ్ముతామని రైతులు అంటున్నరు. చాలా మంది రైతులు తమ ఇళ్లలో పత్తిని నిల్వ చేసుకున్నారు.

రైతుల ఇళ్లలో పత్తి నిల్వలున్నాయి..

- బీవీ రాహుల్‌, ఏనుమాముల మార్కెట్‌ కార్యదర్శి

గత సంవత్సరం పత్తి ధర ఊహించని విధంగా ధర పెరిగింది. ఆధర తో పోలిస్తే ఇప్పుడున్న ధర తక్కువే. దీంతో రైతులు తమ వద్ద ఉన్న పత్తిని ధర పెరిగినప్పుడే అమ్ముదామని నిల్వ చేసుకున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం డబ్బులు అవసరం ఉన్న రైతులు మార్కెట్లో అమ్ముకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్‌ పెరిగితే ధరలు పెరుగుతాయి.

Updated Date - 2023-01-25T00:09:55+05:30 IST