మినీ జాతరకు అంకురార్పణ

ABN , First Publish Date - 2023-01-26T00:38:44+05:30 IST

మేడారం మినీ జాతరకు అంకురార్పణ జరిగింది. బుధవారం గుడిశుద్ధి (గుడి మెలిగె) కార్యక్రమాన్ని ఆదివాసీ పూజారులు నిర్వహించారు.

మినీ జాతరకు అంకురార్పణ

మేడారం, కన్నెపల్లిలో గుళ్లను శుభ్రపరిచిన పూజారులు

బయ్యక్కపేట సమ్మక్క తల్లి పుట్టింట జాతర సందడి

మేడారం, జనవరి 25: మేడారం మినీ జాతరకు అంకురార్పణ జరిగింది. బుధవారం గుడిశుద్ధి (గుడి మెలిగె) కార్యక్రమాన్ని ఆదివాసీ పూజారులు నిర్వహించారు. మినీ జాతర ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరగనుండగా తాడ్వాయి మండలం మేడారం, కన్నెపల్లిలో సమక్క, సారలమ్మల గుళ్లను పూజారులు శుద్ధి చేశారు. మినీ జాతరకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఘట్టంతోనే ప్రారంభించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మేడారంలో సమ్మక్క పూజారులు కొక్కేర కృష్ణయ్య, సిద్ధబోయిన మునీందర్‌, బుక్కయ్య, నాగేశ్వరరావు, లక్ష్మణ్‌రావు, అరుణ్‌ ఆధ్వర్యంలో సమ్మక్క గుడిని శుభ్ర పరిచారు. అనంతరం అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గుట్ట గడ్డిని గుడిపై కప్పారు. మహిళలు అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన పుట్ట మట్టితో గుడిని అలికి ముగ్గులు వేశారు. పూజారులు డోలు వాయిద్యాల నడుమ సమ్మక్క దేవతకు పూజలు నిర్వహించి దీప దూప నైవేద్యాలు సమర్పించారు. అదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ గుడిలో పూజారులు కాక సారయ్య, కిరణ్‌ ఆధ్వర్యంలో గుడి శుద్ధి పండుగను నిర్వహంచారు.

సమ్మక్క పుట్టింట జాతర సందడి

తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో సమ్మక్క పుట్టింట జాతర సందడి నెలకొంది. మేడారం మినీజాతర ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు జరిగే సమయంలోనే బయ్యక్కపేటలో జాతర జరగనుంది. ఈ నేపఽథ్యంలో చందా వంశీయులు గుడిమెలిగె పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామునే ఇంటిల్లిపాది తలస్నానాలు ఆచరించారు. చందా వంశీయులు రఘుపతిరావు, గోపాల్‌రావు, పరమేశ్వర్‌రావు, లక్ష్మణ్‌రావు, బాబురావుతోపాటు వారి కుటుంబ సభ్యులు, ఆడపడుచులు అటవీ ప్రాంతానికి వెళ్లి గుట్ట గడ్డిని తీసుకొచ్చారు. పుట్ట మట్టిని కూడా తెచ్చారు. రోజంతా చందా వంశీయులు ఉపవాసం ఉండి గుడిపై ఉన్న పాత గడ్డిని తొలగించి కొత్త గడ్డిని కప్పారు. అనంతరం మహిళలు పుట్ట మట్టితో గుడిని అలికి ముగ్గులు వేశారు. డోలు వాయిద్యాల నడుమ గుడిమెలిగె కార్యక్రమాన్ని నిర్వహించారు. సమ్మక్క తల్లికి రహస్య పూజలు చేసి దీప దూప నైవేద్యాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మినీజాతర జరిగే రోజు వరకు గుడిలో నిత్య పూజలు నిర్వహిస్తూనే ఉంటారు.

Updated Date - 2023-01-26T00:38:49+05:30 IST