ఎన్నికల వేళ.. ఎందుకీ తలనొప్పి!

ABN , First Publish Date - 2023-01-25T03:06:01+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పలు మునిసిపాలిటీలకు ప్రకటించిన మాస్టర్‌ ప్లాన్ల రూపకల్పన వ్యవహారం వికటించి, చుట్టు పక్కల గ్రామాల రైతుల ఆగ్రహాన్ని మూట గట్టుకొనే పరిస్థితి ఏర్పడంతో కేసీఆర్‌ సర్కారు మొత్తం మాస్టర్‌ ప్లాన్ల వ్యవహారాన్నే పక్కన పెట్టేసింది.

ఎన్నికల వేళ.. ఎందుకీ తలనొప్పి!

మునిసిపాలిటీల మాస్టర్‌ ప్లాన్లకు సర్కారు బ్రేక్‌

రైతుల ఆగ్రహావేశాలపై అధికార పార్టీలో ఆందోళన

కామారెడ్డి ఘటనతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి

23 పురపాలికల్లో నిలిచిన మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పలు మునిసిపాలిటీలకు ప్రకటించిన మాస్టర్‌ ప్లాన్ల రూపకల్పన వ్యవహారం వికటించి, చుట్టు పక్కల గ్రామాల రైతుల ఆగ్రహాన్ని మూట గట్టుకొనే పరిస్థితి ఏర్పడంతో కేసీఆర్‌ సర్కారు మొత్తం మాస్టర్‌ ప్లాన్ల వ్యవహారాన్నే పక్కన పెట్టేసింది. ఏడాది చివరిలోగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే పరిస్థితుల్లో ఎన్నికల వేళ ఎందుకొచ్చిన తలనొప్పి అంటూ మునిసిపాలిటీల మాస్టర్‌ప్లాన్ల రూపకల్పనకు, ప్రతిపాదించిన వాటి ఆమోదాలకు బ్రేక్‌ వేసింది. కామారెడ్డిలో రైతు ఆత్మహత్య సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఈ మాస్టర్‌ ప్లాన్లపై రైతుల నుంచి వ్యతిరేకత మొదలైంది. అందుకే, ఎన్నికలయ్యే వరకు మాస్టర్‌ ప్లాన్ల ఊసు తీయొద్దని సీఎం కేసీఆర్‌ సంబంధిత విభాగాలను ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే మాస్టర్‌ ప్లాన్ల పేరిట జరుగుతున్న భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నిరసన కార్యక్రమాల్లో స్థానిక రైతులు పెద్దఎత్తున హాజరవుతుండటంతో ప్రస్తుతం పరిస్థితుల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీలు, కార్పోరేషన్ల పరిధిలో కొత్తగా మాస్టర్‌ ప్లాన్లను రూపొందిస్తోందని రైతుల్లో ఆగ్రహం, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తీరును పార్టీ ఎమ్మెల్యేలు అధిష్ఠానం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. కామారెడ్డి, జగిత్యాల మునిసిపాలిటీల పరిధిలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా.. అక్కడి పాలక మండళ్లు స్వయంగా ముసాయిదా మాస్టర్‌ ప్లాన్లను తిరస్కరిస్తూ తీర్మానాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపాయి. ఆ మునిసిపాలిటీలే కాకుండా రాష్ట్రమంతటా మాస్టర్‌ ప్లాన్ల వ్యవహారాన్ని నిరవధికంగా పెండింగ్‌లో ఉంచాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. నూతన మునిసిపల్‌ చట్టం ద్వారా అనేక గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ కాగా, మరికొన్ని గ్రామాలు సమీప మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో విలీనం అయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, ఆయా పట్టణాల్లో తగిన సౌకర్యాలు కల్పించడంలో భాగంగా పురపాలికల్లో మాస్టర్‌ ప్లాన్లను రూపొందించే ప్రక్రియను చేపట్టారు. తెలంగాణలో 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. 74 మునిసిపాలిటీల మాస్టర్‌ప్లాన్లు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం పొందాయి. మిగిలిన 68లో 45కు సంబంధించి ముసాయిదా మాస్టర్‌ ప్లాన్లను సిద్ధం చేశారు.

గతనెల మహబూబాబాద్‌, ఆందోల్‌, జోగిపేట్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట్‌, సత్తుపల్లి, భూపాలపల్లి, దేవరకొండ మునిసిపాలిటీలతోపాటు మరో 15 పట్టణాల మాస్టర్‌ ప్లాన్లను ప్రభుత్వ ఆమోదంకోసం పంపారు. వాటితోపాటు, సిద్ధం చేసిన మాస్టర్‌ ప్లాన్లు కలిపి మొత్తం 23 పురపాలికల్లో మాస్టర్‌ ప్లాన్ల రూపకల్పన పూర్తిగా నిలిచిపోయింది. విలీన గ్రామ పంచాయతీలను కలుపుకొని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి కొత్త మాస్టర్‌ ప్లాన్లను నేషనల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌, గ్రామీణ, పట్టణ ప్రణాళికా శాఖ డైరెక్టరేట్‌(డీటీసీపి)లు సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే, మునిసిపల్‌, కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పాలకమండలి సమావేశంలో చర్చించి, అక్కడ తీర్మానించిన తర్వాతనే ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపుతారు. మాస్టర్‌ ప్లాన్ల తయారీలో ప్రజల ప్రతిపాదనలను, అభ్యంతరాలను పట్టించుకోవడం లేదని పలు చోట్ల ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2023-01-25T03:06:01+05:30 IST