కేసీఆర్‌ వల్ల తెలంగాణ పరువు పోతోంది

ABN , First Publish Date - 2023-01-26T01:03:16+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌ వల్ల తెలంగాణ పరువు పోతోంది

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సీఎం కేసీఆర్‌ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం కిషన్‌రెడ్డి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం జరపాలంటూ తెలంగాణలో ప్రజలు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. కేసీఆర్‌, కల్వకుంట్ల కుటుంబం వల్ల తెలంగాణ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో రిపబ్లిక్‌ వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోందని, అలాంటి వేడుకలను సైతం రద్దు చేసే పరిస్థితికి కేసీఆర్‌ సర్కారు దిగజారిందని విమర్శించారు. రాజ్‌భవన్‌లోనే వేడుకలు జరుపుకోవాలంటూ గవర్నర్‌కు లేఖ రాసి.. దిగజారుడు రాజకీయాలతో అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానించారని దుయ్యబట్టారు. గణతంత్ర వేడుకల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. కేంద్రం నిర్వహించే సమావేశాలకు కేసీఆర్‌ హాజరు కారని.. రాష్ట్రపతి, గవర్నర్‌ను అవమానిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శించకపోవడంపై స్పందిస్తూ.. శకటం పెడితే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల ఫోటోలు పెట్టాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. అంతకు ముందు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌లో కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లతో కలిసి కిషన్‌రెడ్డి జగన్నాథ్‌ యాత్ర రైలును జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర రైల్వే, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో ‘భారత్‌ గౌరవ్‌’ పేరుతో ఈ రైలును నడుపుతున్నారు.

ఉత్తర్వులను అమలు చేయాలి: సంజయ్‌

పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర వేడుకలను నిర్వహించాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పరేడ్‌ గ్రౌండ్‌లోనే గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని.. అలా చేయకపోతే రాజ్యాంగ, ప్రజాస్వామ్య ద్రోహిగా మిగిలిపోతారని హెచ్చరించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, చట్టాన్ని పట్టించుకోనంటే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు.

తీర్పును స్వాగతిస్తున్నాం: కాంగ్రెస్‌

రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలను నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ స్వాగతిస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, జి.నిరంజన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ వల్ల గణతంత్ర వేడుకలను జరుపుకోవడం లేదంటూ కోర్టుకు కుంటిసాకులు చెప్పిన ప్రభుత్వానికి ఖమ్మం సభకు కొవిడ్‌ గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. సర్కార్‌ తీరు రాజ్యాంగాన్ని అవమానించేలా ఉందని ఆరోపించారు.

Updated Date - 2023-01-26T01:03:16+05:30 IST