ఏఐతో స్మార్ట్‌గా హెచ్‌టీ మీటర్‌ రీడింగ్‌

ABN , First Publish Date - 2023-09-18T04:04:58+05:30 IST

కృత్రిమమేధ(ఏఐ)తో ‘స్మార్ట్‌’గా హైటెన్షన్‌(హెచ్‌టీ) విద్యుత్తు కనెక్షన్ల మీటర్‌ రీడింగ్‌ చేయించాలని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) నిర్ణయించింది.

ఏఐతో స్మార్ట్‌గా హెచ్‌టీ మీటర్‌ రీడింగ్‌

10 వేల కనెక్షన్లకు అమలు

దక్షిణ డిస్కమ్‌ నిర్ణయం

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కృత్రిమమేధ(ఏఐ)తో ‘స్మార్ట్‌’గా హైటెన్షన్‌(హెచ్‌టీ) విద్యుత్తు కనెక్షన్ల మీటర్‌ రీడింగ్‌ చేయించాలని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విధానం అమలైతే.. మీటర్‌ రీడింగ్‌ సాంతం కృత్రిమ మేధ ఆధారంగా జరుగుతుంది. ఎస్సీడీసీఎల్‌ పరిధిలో ప్రస్తుతం 10 వేలకు పైగా హెచ్‌టీ కనెక్షన్లున్నాయి. వీటి మీటర్ల రీడింగ్‌ బాధ్యతలను అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌(ఏడీఈ) స్థాయి అధికారులు చేపడతారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లో ఒక్కో ఏడీఈ రోజుకు 100 మీటర్ల దాకా రీడింగ్‌ తీయాల్సి ఉంటుంది. ఇది అధికారులకు ఇబ్బందికరంగా మారింది. గతంలో ప్రతీనెల 15న రీడింగ్‌ తీస్తుండగా.. ఇప్పుడు దాన్ని ఒకటో తేదీకి మార్చారు.

ఏఐతో మీటర్‌ రీడింగ్‌ విధానంలో టెండర్లు దక్కించుకునే సంస్థ.. ప్రతీ హెచ్‌టీ మీటర్‌ వద్ద ఒక మోడెం, సిమ్‌తో పనిచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ మీటర్‌లో నెలలో జరిగే వినియోగమే కాకుండా.. విద్యుత్తు సరఫరా తీరు, లోటుపాట్లు, అంతరాయాలు, సాంకేతిక ఇబ్బందులు రికార్డవుతాయి. ఆ వివరాలు వెంటనే ఎస్పీడీసీఎల్‌కు చేరుతుంది. ప్రతీనెల 1వ తేదీన మీటర్‌ రీడింగ్‌ను పూర్తిచేసే ఏఐ వ్యవస్థ, ఆ వివరాలను ఎస్పీడీసీఎల్‌కు అందజేస్తుంది. ఆ వెంటనే బిల్‌ జనరేట్‌ అవుతుంది. వినియోగదారుడికి ఈ-మెయిల్‌, ఎస్‌ఎంఎస్‌ రూపంలో బిల్లు చేరుతుంది. ఈ విధానంలో పరికరాల అమరిక, వనరుల కల్పన వంటి వాటికి వ్యయాన్ని టెండర్‌ దక్కించుకున్న సదరు సంస్థ భరించాల్సి ఉంటుంది. ఇందు కు గాను ఒక్కో మీటర్‌కు ధరను ఖరారు చేయాల్సి ఉంది.

Updated Date - 2023-09-18T04:04:58+05:30 IST