Telangana : మాజీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్.. త్వరలో బీజేపీలోకి కీలక నేత తమ్ముడు..

ABN , First Publish Date - 2023-01-26T19:15:20+05:30 IST

వారం కిందటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానిక్‌రావు థాక్రేతో ఆయన భేటీ అయ్యారు. మునుపటిలా పార్టీలో బాగా యాక్టివ్‌గా ఉండాలని అధ్యక్షుడు కూడా సూచించారు..

Telangana : మాజీ డిప్యూటీ సీఎంకు ఊహించని షాక్.. త్వరలో బీజేపీలోకి కీలక నేత తమ్ముడు..

హైదరాబాద్ : వారం కిందటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానిక్‌రావు థాక్రేతో ఆయన భేటీ అయ్యారు. మునుపటిలా పార్టీలో బాగా యాక్టివ్‌గా ఉండాలని అధ్యక్షుడు కూడా సూచించారు. అన్నింటికి ఓకే అని చెప్పి విజయవంతంగా మీటింగ్ ముగించుకుని బయటికొచ్చారు. మరోవైపు.. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నేతలంతా వ్యూహ రచనలో మునిగి తేలుతున్నారు. ఇంతలోనే.. మాజీ సీఎంకు ఊహించని షాక్ తగిలింది. సోదరుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న వార్త.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరాయన..? ఆయన సోదరుడు బీజేపీలోకి చేరాలని ఎందుకు నిర్ణయించుకున్నారన్న విషయాలపై ప్రత్యేక కథనం.

ఇంతలోనే షాక్..!

దామోదర రాజనర్సింహా.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి పదవులు లేకపోవడంతో.. ఈయన అంతంత మాత్రమే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎన్నికల హడావుడి మొదలవ్వడంతో మళ్లీ నియోజకవర్గంలో తిరుగుతూ.. ప్రజల్లో కనిపిస్తున్నారు. అటు పార్టీ బలోపేతానికి తనకు తోచిన సూచనలు చేస్తూ.. ఇటు నియోజకవర్గంలోనూ పట్టుసాధించి రానున్న ఎన్నికల్లో గెలవడానికి వ్యూహాలు రచించుకుంటున్నారు. పార్టీలో కోవర్టులు కూడా ఉన్నారని హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. ఇంతలో.. ఈయనకు ఊహించని రీతిలో షాక్ తగిలింది.

Damodar.jpg

ఇదే నిజమైతే..!

దామోదర తమ్ముడు రాంచందరాం బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలవడంతో ఇప్పుడీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఆయన ఒక్కరే కాదు.. సంగారెడ్డికి జిల్లా నేతలతో వచ్చి మరీ అధ్యక్షుడ్ని కలిశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. రెండు మూడు రోజుల్లో రాంచందరాం బీజేపీలో చేరబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇదే జరిగితే దామోదరకు పెద్ద షాకేనని చెప్పుకోవచ్చు. కుటుంబంలోని వ్యక్తే ఇలా పార్టీ మారబోతున్నారన్న వార్త.. ఎవరికీ రుచించట్లేదు. ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో ఇలా రాంచందరాం ఇలా చేయడం ఎంతవరకు సబబు అని కార్యకర్తలు, ముఖ్య అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

అప్పుడలా..!

ఎన్నికల సమయంలో సొంత ఫ్యామిలీ నుంచి ఇలాంటి షాక్‌లు రావడం ఇది మొదటిసారేం కాదు. గత ఎన్నికల్లో రాజనర్సింహా సతీమణి పద్మిని రెడ్డి కాంగ్రెస్‌కు టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీచేయాలని రెండు, మూడు దఫాలుగా పద్మిని ప్లాన్ చేసినా అసలు వర్కవుట్ కాలేదు. దీంతో బీజేపీలో చేరితే టికెట్ దక్కుతుందని కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఒక్కటంటే ఒక్కరోజు కూడా బీజేపీలో ఉండలేదామె. ఉదయం కాషాయ కండువా కప్పుకోవడం.. సాయంత్రానికి తిరిగి సొంత గూడు కాంగ్రెస్‌లోకే వచ్చేశారు. ఇలా జరిగినప్పటికీ గత ఎన్నికల్లో దామోదర రాజనర్సింహాను విజయం వరించలేదు.

ఏం జరుగుతుందో..!

అప్పుడు సతీమణి.. ఇప్పుడు సొంత తమ్ముడు దామోదర్ ఫ్యామిలీకి షాకిచ్చారనే చెప్పుకోవచ్చు. తమ్ముడు బీజేపీలో చేరి అన్నపైనే పోటీచేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే పరిస్థితులు మాత్రం పూర్తిగా పరిస్థితులు మారిపోతాయ్. అన్న-తమ్ముడు ఎన్నికల యుద్ధంలో దిగితే మళ్లీ మూడో వ్యక్తికే ప్లస్ అవుతుందని కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటున్నారు. మరి పద్మినీరెడ్డి లాగా.. ఈయన కూడా మూడ్నాళ్ల ముచ్చటలాగా బీజేపీలో అలా చేరి.. ఇలా వస్తారేమో వేచి చూడాలి మరి.

Updated Date - 2023-01-26T20:58:51+05:30 IST