ఒడిసా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా శిశిర్గమాంగ్?
ABN , First Publish Date - 2023-01-26T00:59:06+05:30 IST
జాతీయ రాజకీయాలు లక్ష్యంగా బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. తమ పార్టీని రాష్ట్రాల వారీగా విస్తరించేందుకు

హైదరాబాద్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జాతీయ రాజకీయాలు లక్ష్యంగా బీఆర్ఎస్ను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. తమ పార్టీని రాష్ట్రాల వారీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అక్కడి అనుకూల పరిస్థితులను ఎంచుకుంటూ ఆయా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు ఆయన కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒడిసా రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షుడిగా శిశిర్ గమాంగ్ను నియమించేందుకు సమాలోచన జరుపుతున్నట్లు సమాచారం. ఒడిసా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, ఆయన తనయుడు శిశిర్ గమాంగ్ బుధవారం బీజేపీకి రాజీనామా లేఖలు సమర్పించడంతో ఈ ప్రక్రియపై సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. కాగా ఒడిసా రాష్ట్రంలో బీఆర్ఎస్కు బలం చేకూరాలంటే మాజీ సీఎం గిరిధర్ సహకారం ఎంతో అవసరమని, అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయనను జాతీయ రాజకీయాల్లో వినియోగించుకోవాలని గులాబీ బాస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఒడిశా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని పటిష్ఠంగా నడిపేందుకు ఆయన తనయుడు శిశిర్ గమాంగ్ను అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు ఆ రాష్ట్రంలో నివసించే తెలుగువారు, తెలంగాణ మూలాలున్న వారిలో రాజకీయ నేపథ్యం ఉన్న వారిని ఎంపిక చేసుకుని, పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
గిరిధర్ గమాంగ్ రాజీనామా
ఒడిశా రాష్ట్ర మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈమేరకు బుధవారం ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు. కాగా సీఎం కేసీఆర్తో ఇటీవలే గిరిధర్, ఆయన తనయుడు శిశిర్లు భేటీ అయిన విషయం విదితమే. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురూ చర్చించుకున్నట్లు తెలిసింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పనితీరు, జాతీయ పార్టీగా బీఆర్ఎస్ విధానాలు వంటి అంశాలపై వారు ముచ్చటించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన గిరిధర్, ఆయన తనయుడు త్వరలోనే భారత్ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.