ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం

ABN , First Publish Date - 2023-02-02T00:10:02+05:30 IST

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిరంతరం కృషిచేస్తున్నామని బీఆర్‌ఎస్‌ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం
ప్రగతి నివేదన యాత్రలో భాగంగా ఇంటింటికీ తిరిగి ఓ వృద్ధురాలితో మాట్లాడుతున్న మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి

మంచాల, ఫిబ్రవరి 1: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిరంతరం కృషిచేస్తున్నామని బీఆర్‌ఎస్‌ రాష్ట్రనాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్ర బుధవారం మంచాల మండలంలోకి ప్రవేశించింది. రంగాపూర్‌, చీదేడ్‌లలో పార్టీశ్రేణులు, ప్రజలు పాల్గొని ప్రశాంత్‌కుమార్‌రెడ్డికి స్వాగతం పలికారు. ఆయన ఇంటింటికీ తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. రైతుబంధు, పింఛన్లు వస్తున్నాయా? అని అడిగారు. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రెయిన్ల సమస్యలపై ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి నివేదించి నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్‌నర్మద, ఎంపీటీసీలు నర్సింగ్‌అనితవెంకటేష్‌, పి.సుకన్యశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ బాల్‌రాజ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు రమేష్‌, బహదూర్‌, ఏఎంసీ చైర్మన్‌ చంద్రయ్య, నాయకులు డి.రవి, ఎం.సికిందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, వెంకటే్‌షయాదవ్‌, బద్రీనాథ్‌గుప్తా జానీపాషా, వీరేశ్‌, జంగారెడ్డి, రాము, ప్రశాంత్‌కుమార్‌, విజయ్‌, చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

‘రోడ్డు ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్న మల్‌రెడ్డి’

ఓ రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి బఫూన్‌ అని ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గడ్డమల్లయ్యగూడలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. చీదేడ్‌లో మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో గడ్డమల్లయ్యగూడలో ట్రాక్టర్‌ అదుపుతప్పి అక్కడి జనంపైకి దూసుకెళ్లి ఒకరు మృతిచెంది, కొం దరు గాయపడడం బాధాకరం అన్నారు. ప్రమాదంలో తమ పార్టీ నాయకులు సైతం గాయపడ్డారన్నారు. బాధితులందరినీ తాము ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా ఆదుకుంటామన్నారు. కొందరు దీనిపై ప్రేలాపనలు పేలుతూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పుట్టుకే ప్రశ్నార్థకమన్నారు. ఆయనకు వసూళ్ల సంస్కృతి ఇంకా పోలేదని, తన పార్టీ కార్యకర్తలకు కూడా పది రూపాయలు దానం చేసినవాడు కాదన్నారు. ప్రజల్లో తిరిగితేనే వారి కష్టసుఖాలు తెలుస్తాయని, ఐదేళ్లకోసారి కేవలం ఓట్ల కోసమే వచ్చే మల్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఓటమి తప్పదన్నారు. అనవసర మాటలు మానుకోకుంటే మల్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తిరగనివ్వరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

=========

Updated Date - 2023-02-02T00:10:03+05:30 IST