అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2023-01-26T00:06:37+05:30 IST

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ఒక్క తెలంగాణ ప్రజలే కాదు దేశంలోని అన్నిరాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని విద్యాశాఖమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శం
తుమ్మలూరులో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, జనవరి 25 : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని ఒక్క తెలంగాణ ప్రజలే కాదు దేశంలోని అన్నిరాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారని విద్యాశాఖమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తుమ్మలూరు గ్రామంలో రూ.15కోట్ల 24 లక్షల వ్యయంతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డితో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందరర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్‌ రాష్ట్రంలోని అన్ని రోడ్ల అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేశారన్నారు. ముఖ్యంగా తుమ్మలూరు నుంచి ఇటు శ్రీశైలం హైవే అటు బెంగళూరు హైవేలకు అనుసంధానంగా ఉన్న రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. రూ.14కోట్ల 20 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని చెప్పారు. అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 9 వేల పాఠశాలలకు మొదటి విడత రూ. 3500 కోట్లు విడుదల అయ్యాయన్నారు. అంతేకాకుండా జిల్లాలో 464 పాఠశాలలకు రూ.200కోట్ల నిధులను వెచ్చించామన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నాయకులు పనిగట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా తెలంగాణ తరహా పథకాలను అమలు చేయాలన్నారు. కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో రాష్ర్టానికి వేల కోట్ల పెట్టుబడులతో అనేక పరిశ్రమలు వస్తున్నాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అదేవిధంగా మండలంలోని కేసీ తండా చెరువుకట్టపై నిర్మిస్తున్న భారీ శివుని విగ్రహ పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె. రఘుమారెడ్డి, వైస్‌ ఎంపీపీ సునితఅంద్యానాయక్‌, తుమ్మలూరు గ్రామ సర్పంచ్‌ మద్దిసురేఖకరుణాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ కె. శ్రీహరిముదిరాజ్‌, ఎంపీటీసీ రాంరెడ్డి, మార్కెట్‌కమిటి చైర్మన్‌ సురసాని సురేందర్‌రెడ్డి, ఆంగోత్‌ రాజునాయక్‌, మర్యాద రాఘవేందర్‌రెడ్డి, చంద్రయ్య, అంబయ్య, నవీన్‌, రాజు, వెంకట్‌రెడ్డి, గంట నర్సిరెడ్డి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:06:38+05:30 IST