నత్తనడక!

ABN , First Publish Date - 2023-01-25T00:16:43+05:30 IST

షాద్‌నగర్‌ నియోజవర్గం ఫరూఖ్‌నగర్‌ మండలం కాంసాన్‌పల్లిలో నిర్మిస్తున్న ఘనీకృత పశువీర్య ఉత్పత్తి కేంద్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడేళ్లవుతున్నా పనులు పూర్తికావడం లేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా నిర్మాణంలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్థానిక పాడి రైతులు కోరుతున్నారు

నత్తనడక!

ఏడేళ్లుగా సాగుతున్న పశువీర్య ఉత్పత్తి కేంద్రం పనులు

వినియోగంలోకి వస్తే రైతులకు మేలు

బిల్లుల ఆలస్యంతో పనులకు బ్రేక్‌

పట్టించుకోని అధికారులు

షాద్‌నగర్‌ నియోజవర్గం ఫరూఖ్‌నగర్‌ మండలం కాంసాన్‌పల్లిలో నిర్మిస్తున్న ఘనీకృత పశువీర్య ఉత్పత్తి కేంద్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏడేళ్లవుతున్నా పనులు పూర్తికావడం లేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా నిర్మాణంలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని స్థానిక పాడి రైతులు కోరుతున్నారు.

షాద్‌నగర్‌ రూరల్‌, జనవరి 24: రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఘనీకృత పశువీర్య ఉత్పత్తి కేంద్రం పనులు ఏడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. మొదటిది ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్‌లో ఉండగా, రెండోది దక్షిణ తెలంగాణలోని షాద్‌నగర్‌ నియోజవర్గం ఫరూఖ్‌నగర్‌ మండలం కాంసాన్‌పల్లిలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. దీని నిర్మాణానికి రూ.16కోట్లు విడుదల చేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటి పశు సంవర్ధక శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మే 12, 2015లో భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏడేళ్లవుతున్నా నేటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు కూడా పనుల జాప్యంపై పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

వినియోగంలోకి వస్తే రైతులకు మేలు

పశువీర్య ఉత్పత్తి కేంద్రం అందుబాటులోకి వస్తే షాద్‌నగర్‌ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండి ఎలాంటి సాగు నీటి వనరులు లేని ఈ ప్రాంత రైతులు కేవలం వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. దానికి అనుబంధంగా పాడిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. మేలైన పాడి జాతి ఆవులు లేక పాల దిగుబడి ఆశించిన మేరకు రావడం లేదు. కష్టానికి ప్రతిఫలం అంతగా రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మేలైన పశువులు వస్తే రైతులు లాభ పడే అవకాశం ఉంటుంది.

పాడి ఆవులకు వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది

దేశవాళీ ఆవులతోపాటు ఉండే బుల్స్‌ చాలా ఆవులకు పారుతుంది. దానివల్ల పాడి ఆవులకు వ్యాధుల తీవ్రత అధికంగా ఉంది. తద్వారా పాల దిగుబడి కూడ తగ్గుతుంది. పశువీర్య ఉత్పత్తి కేంద్రం వినియోగంలోని వస్తే మేలు జాతి బుల్స్‌ను పెంచుతారు. ఒక్క బుల్‌ నుంచి సేకరించిన వీర్యాన్ని సుమారు వేయి స్ట్రాలు చేసి నిల్వ ఉంచుతారు. వాటిని పశువైద్య కేంద్రాలకు సరఫరా చేయడంతోపాటు గోపాల మిత్రల ద్వారా పశువులకు ఇస్తారు. దాంతో మేలుజాతి పశువులు ఉత్పత్తి అవుతాయి. అయితే చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల పశువీర్య ఉత్పత్తి కేంద్రం పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని పనులు త్వరగా పూర్తిచేయాలని రైతులు కోరుతున్నారు.

కేంద్రాన్ని అందుబాటులోకి తేవాలి: మల్లారెడ్డి, పాడి రైతు, కిషన్‌నగర్‌

మేలైన పాడి ఆవులు లేకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. కాంసాన్‌పల్లి శివారులో నిర్మాణంలో ఉన్న పశువీర్య ఉత్పత్తి కేంద్రాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకోవాలి.

Updated Date - 2023-01-25T00:16:43+05:30 IST