ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2023-01-25T00:28:30+05:30 IST

ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా పోలీస్‌ అభ్యర్థులు కావడం గమనార్హం.

ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకరు మృతి

  • ఐదుగురికి తీవ్ర గాయాలు

  • బాధితులంతా పోలీస్‌ అభ్యర్థులు

ఆమనగల్లు, జనవరి 24: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా పోలీస్‌ అభ్యర్థులు కావడం గమనార్హం. ఈ ఘటన ఆమనగల్లు పట్టణ సమీపంలోని కాటన్‌మిల్‌ వద్ద ముర్తోజుపల్లి రోడ్డు ఎదుట హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల, భువనగిరి, హైదరాబాద్‌కు చెందిన యువకులు వినోద్‌కుమార్‌, వీరేష్‌, పవన్‌కళ్యాణ్‌, సుధాకర్‌, భరత్‌లు ఎస్‌ఐ ఉద్యోగాలకు శిక్షణలో భాగంగా హైదరాబాద్‌లోని నల్లకుంటలో అద్దెకు ఉంటున్నారు. ప్రిలిమినరీ, ఈవెంట్స్‌లో అర్హత సాధించిన యువకులు మెయిన్స్‌ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఈవెంట్స్‌ పూర్తి కావడంతో ఐదుగురు స్నేహితులు కలిసి దైవ దర్శనానికి కారులో శ్రీశైలం దేవస్థానానికి వెళ్ళారు. తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరగా మార్గమధ్యలో ఆమనగల్లు సమీపంలోని ముర్తోజుపల్లి గేటు వద్ద ఎదురుగా హైదరాబాద్‌ నుంచి అచ్చంపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారు నడుపుతున్న మృతుడు భువనగిరి జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌(25) అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న వీరేష్‌, పవన్‌ కళ్యాణ్‌, సుధాకర్‌, భరత్‌లు గాయాలపాలయ్యారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం గాయపడ్డ నలుగురిని హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న కొనెటిపురం గ్రామానికి చెందిన సుంకేశ్వరం తిరుపుతమ్మ గాయపడింది. వినోద్‌కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్తం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని ఎస్‌ఐ సుందరయ్య సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-25T00:28:30+05:30 IST