రసాభాసగా ఎదులాబాద్‌ గ్రామసభ

ABN , First Publish Date - 2023-01-25T00:24:00+05:30 IST

ఇంటి పన్ను సక్రమంగా చెల్లించాలని ఆదేశించిన గ్రామ కార్యదర్శిపై ఓ మహిళ దాడికి యత్నించిన ఘటన ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో చోటుచేసుకుంది.

 రసాభాసగా ఎదులాబాద్‌ గ్రామసభ
పాలకవర్గాన్ని నిలదీస్తున్న గ్రామస్తులు

పన్ను చెల్లింపు విషయంలో కార్యదర్శిపై దాడికి యత్నించిన మహిళ

పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్యదర్శి ఉష

అవినీతి, ఆక్రమాలపై పాలకవర్గాన్ని నిలదీసిన గ్రామస్తులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి) : ఇంటి పన్ను సక్రమంగా చెల్లించాలని ఆదేశించిన గ్రామ కార్యదర్శిపై ఓ మహిళ దాడికి యత్నించిన ఘటన ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లో చోటుచేసుకుంది. గ్రామసభ జరుగుతుండగానే కార్యదర్శిని బూతుమాటలు తిడుతూ ఆమె చీరను లాగడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధి ఎదులాబాద్‌లో సర్పంచ్‌ కాలేరు సురేష్‌ ఆధ్యక్షతన మంగళవారం గ్రామపంచాయతీ ఆవరణలో ఉదయం గ్రామసభ ప్రారంభమైంది. మొదట పంచాయతీ కార్యదర్శి ఉష ఆదాయ-వ్యయాలను చదివి వినిపించారు. కాగా, రెండు వారాలుగా పంచాయతీలో జరుగుతున్న ఆవినీతి ఆరోపణలపై ఉపసర్పంచ్‌, వార్డుసభ్యులు అదనపు కలెక్టర్‌, డీపీవోకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బిల్‌ కలెక్టర్‌ రజినీకర్‌రెడ్డి నకిలీ రశీదు పుస్తకాలు తయారుచేసి ఇంటి నిర్మాణదారులకు నకిలీ రశీదులు ఇచ్చి పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నా సర్పంచ్‌, కార్యదర్శి, వార్డుసభ్యులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు వాదనకు దిగారు. దీంతో కార్యదర్శి, సర్పంచ్‌ కనుసన్ననల్లోనే ఆవినీతి, ఆక్రమాలు జరుగుతున్నాయని.. ఈవిషయంలో తమకు సంబందం లేదని వార్డుసభ్యులు తెలిపారు. కార్యదర్శి ఏకపక్ష నిర్ణయాలతో పంచాయతీకి ఇబ్బందులు కలుగుతున్నాయని, ఇంటి పన్ను వసూళ్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందంటూ గ్రామస్తులు ఆరోపించారు. లక్షల రూపాయల కుంభకోణం జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో పూస లక్ష్మిబాయి అనే మహిళ గ్రామసభ జరుగుతుండగానే.. మైక్‌ తీసుకొని పన్నులు చెల్లించకపోతే కార్యదర్శి బూతులు తిడుతూ నల్లా కనెక్షన్‌ కట్‌ చేస్తున్నారని వాపోయారు. ఉద్రేకానికి లోనైనా లక్ష్మిబాయి కార్యదర్శి ఉషపై దాడికి యత్నించింది. అసభ్యకర మాటలతో కార్యదర్శి చీరను లాగింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, పాలకవర్గం సభ్యులు ఆమెను అక్కడి నుంచి పంపించారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ లింగేశ్వర్‌రావు, వార్డుసభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తనపై దాడికి పాల్పడిన పూస లక్ష్మిబాయి, ఆమెను ప్రోత్సహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కార్యదర్శి ఉష ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో లక్ష్మిబాయిని దాడికి ప్రోత్సహించిన ఉపసర్పంచ్‌ లింగేశ్వర్‌రావు, వార్డుసభ్యులు ఆంజనేయులు, శ్రీనివాస్‌, నాయకుడు బాల్‌రాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు సీఐ అశోక్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-01-25T00:24:02+05:30 IST