బషీరాబాద్‌ మండలంలో భగ్గుమన్న రాజకీయ విభేదాలు

ABN , First Publish Date - 2023-01-25T00:11:54+05:30 IST

బషీరాబాద్‌ మండలంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల్లో రాజకీయం రోజురోజుకూ ముదురుతోంది.

బషీరాబాద్‌ మండలంలో భగ్గుమన్న రాజకీయ విభేదాలు
హైదరాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కలిసిన ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల్లో వేడెక్కిన రాజకీయం

ఎమ్మెల్యేతో జతకట్టిన వైస్‌ఎంపీపీ, మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు

ఎంపీపీ వ్యవహారశైలిపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఫిర్యాదు

బషీరాబాద్‌, జనవరి 24: బషీరాబాద్‌ మండలంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వర్గీయుల్లో రాజకీయం రోజురోజుకూ ముదురుతోంది. ఎమ్మెల్సీ వర్గంలో ఉన్న ఎంపీపీ కరుణ అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని కొంతకాలంగా వైస్‌ ఎంపీపీ జడల అన్నపూర్ణతో పాటు మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు గుర్రుగా ఉన్నారు. ఈక్రమంలోనే మంగళవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశానికి హజరుకాకుండా మెజారిటీ ఎంపీటీసీలు ముందస్తూ వ్యూహంతో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిని కలిసేందుకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లిపోయారు. మండలంలో ఎంపీపీ కరుణ, జడల అన్నపూర్ణతో పాటు 9 మంది ఎంపీటీసీలుండగా సర్వసభ్య సమావేశానికి ఇద్దరు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. దీంతో సమావేశానికి వస్తారనుకున్న మెజారిటీ ఎంపీటీసీలు గైర్హాజరవడంతో కోరం లేక సమావేశం వాయిదా వేశారు. దీంతో ఎంపీపీ కరుణ, అధికారులకు మెజారిటీ ఎంపీటీసీలు షాక్‌ ఇచ్చేంత పనిచేశారు. గతంలో ఎప్పుడూ లేని విధాంగా మెజారిటీ ఎంపీటీసీలు సమావేశానికి డుమ్మా కొట్టి ఎమ్మెల్యే వర్గీయులతో కలిసి హైదరాబాద్‌లో ప్రత్యక్షం కావడం స్థానికంగా చర్చనీయంశమైంది. ఇదిలా ఉండగా, గత కొంత కాలంగా వైస్‌ ఎంపీపీ, మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీపై అవిశ్వాసం పెట్టేందుకు యోచిస్తుండటంతోనే ఎమ్మెల్యేను కలిసేందుకు వెళ్లారనే గుసగుసలు వినిపించాయి. ఈ విషయమై ఎమ్మెల్యేతో ఎంపీటీసీలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.వీరివెంట వెళ్లిన ఓ నాయకుడిని అరా తీయగా ఎంపీటీసీలకు గ్రామాలభివృద్ధికి నిధులు రాకపోవడంతో ఎమ్మెల్యేను కలిసి చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఎంపీటీసీ సభ్యులు ఒక్కసారిగా ఎమ్మెల్యేతో జత కట్టడంపై మండలంలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

కోరం లేక సర్వసభ్య సమావేశం వాయిదా

కోరం లేక బషీరాబాద్‌ మండల సర్వసభ్య సమావేశం మంగళవారం వాయిదా పడింది. మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీపీతో పాటుగా ఇద్దరు ఎంపీటీసీలు మైల్వార్‌ షాహదాజీబేగం, జీవన్గి పూర్మ సునీత మాత్రమే హాజరయ్యారు. 11 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం కోరం లేక మధ్యాహ్నం 1.30 గంటల వరకు సమావేశం వాయిదా వేసిన మిగతా సభ్యులు ఎవరూ రాలేదు. 1/3 లెక్కన కనీసం 4గురు సభ్యులు హజరైతే సమావేశం నిర్వహించే వీలుండేదని ఎంపీడీవో వివరించారు. దీంతో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ కరుణ, ఎంపీడీవో రమేష్‌ తెలిపారు. త్వరలో సమావేశం తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

Updated Date - 2023-01-25T00:11:55+05:30 IST