టీచర్లకు స్థానచలనం!

ABN , First Publish Date - 2023-01-26T00:42:26+05:30 IST

వికారాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కసరత్తు ప్రారంభమైంది. కేటగిరీల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాలను జిల్లా విద్యా శాఖ రూపొందించింది. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు, ఆపైగా పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, భాషా పండితులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న జీహెచ్‌ఎంలు, మూడేళ్ల లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించింది. జిల్లాకు మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సిద్ధం చేసుకుంది.

 టీచర్లకు స్థానచలనం!

వికారాబాద్‌ జిల్లాలో1500 మంది ఉపాధ్యాయుల బదిలీ?

వారిలో 845 మందికి తప్పనిసరి..

272 మందికి పదోన్నతులు ?

రేపటి నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం

ఆన్‌లైన్‌లోనే బదిలీలు, పదోన్నతులు

పకడ్బందీ నిర్వహణకు విద్యా శాఖ అఽధికారుల కసరత్తు

వికారాబాద్‌ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కసరత్తు ప్రారంభమైంది. కేటగిరీల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాలను జిల్లా విద్యా శాఖ రూపొందించింది. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు, ఆపైగా పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, భాషా పండితులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న జీహెచ్‌ఎంలు, మూడేళ్ల లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలను సేకరించింది. జిల్లాకు మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సిద్ధం చేసుకుంది.

వికారాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి) : వికారాబాద్‌ జిల్లాలో 1031 ప్రభుత్వ, పరిషత్తు పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు 716, ప్రాథమికొన్నత పాఠశాలలు 114, ఉన్నత పాఠశాలలు 180 ఉండగా, ఈ పాఠశాలల్లో 4616 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 3971 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. పదోన్నతులు ఇచ్చేందుకు కేటగిరీల వారీగా జిల్లా విద్యా శాఖ సీనియార్టీ జాబితాలు రూపొందించింది. పదోన్నతులకు సంబంధించి ఒక్కో పోస్టుకు ముగ్గురు వంతున ఎన్ని ఖాళీలు ఉంటే ఆ మేర మూడింతల సంఖ్యతో జాబితాలు రూపొందించారు. సర్వీస్‌ రిజిష్టర్లు, సర్టిఫికేట్ల పరిశీలనకు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో అయిదు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రెండు నుంచి ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశారు. బుధవారం ప్రభుత్వ డైట్‌ కళాశాల, జడ్పీ బాలుర, జడ్పీ బాలికలు, శివారెడ్డిపేట, ఆలంపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలకు తమ సర్వీసు రిజిష్టర్లు, విద్యార్హతల సర్టిఫికేట్లతో సీనియార్టీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమించారు. ఈ కేంద్రాలను డీఈవో రేణుకాదేవి సందర్శించి పరిశీలనా ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. అయితే పదోన్నతులకు అర్హత ఉన్నా వివిధ కారణాలతో ఈ జాబితాల్లో లేని వారి కోసం ఎస్‌ఆర్‌, సర్టిఫికెట్ల పరిశీలన గురువారం మధ్యాహ్నం నిర్వహించాలనే యోచనలో జిల్లా విద్యాశాఖ ఉంది. ఈనెల 27న జిల్లాలో కేటగిరీల వారీగా ఖాళీలు, హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్ల పదోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు.

28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఉపాధ్యాయ బదిలీలకు పచ్చజెండా ఊపిన రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్‌ కూడా విడుదల చేసింది. బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జిల్లాలో నిర్ణీత గడువు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అన్ని కేటగిరీల్లో కలిపి 845 మంది ఉన్నారు. వీరిలో పీజీహెచ్‌ఎంలు 44, స్కూల్‌ అసిస్టెంట్లు 221, ఎస్జీటీలు 487, ఎల్‌పీటీలు 93 మంది ఉన్నారు. కాగా, జిల్లాలో ఈ బదిలీల్లో 2,500 మంది ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండగా, వారిలో 1200 నుంచి 1500 మంది వరకు బదిలీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2015, జూలై నెలలో పదోన్నతులు, బదిలీలు ఒకేసారి నిర్వహించగా, 2018లో కేవలం బదిలీలు మాత్రమే నిర్వహించారు. ఏడున్నరేళ్ల తరువాత ఇప్పుడే బదిలీలు, పదోన్నతులు రెండూ ఒకేసారి నిర్వహిస్తున్నారు. జిల్లాలో పీజీహెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్ల కేటగిరీల్లో 350 పోస్టులు ఖాళీగా ఉండగా, ఈ పోస్టుల్లో 70 శాతం పదోన్నతులు, 30 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పదోన్నతుల్లో 272 మంది వరకు ఉపాధ్యాయులకు తదుపరి పదోన్నతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే జిల్లా వ్యాప్తంగా ఏయే కేటగిరీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయమై స్పష్టత రానుంది.

పొరపాట్లు చోటు చేసుకోకుండా..

సీనియార్టీ జాబితాల్లో ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా విద్యా శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. పదోన్నతుల కోసం విద్యా శాఖ రూపొందించిన జాబితాల్లో అర్హుల పేర్లు లేకపోతే తన దృష్టికి తీసుకు రావాలంటూ డీఈవో రేణుకాదేవి స్పష్టం చేశారు. పదోన్నతికి అర్హత కలిగిన ఉపాధ్యాయుల్లో ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె మంగళవారం నిర్వహించిన ఉపాధ్యాయ సంఘాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆమె తెలిపారు. ఎక్కడైనా అలాంటి తప్పిదాలు చోటు చేసుకుంటే... అలాంటి వారు దరఖాస్తు చేసుకుంటే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. పీజీ హెచ్‌ఎంలు, స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులకు అర్హులైన ఉపాధ్యాయుల వివరాలు రోస్టర్‌ ప్రకారం విద్యా శాఖ సిద్ధం చేస్తోంది. జాబితాలు రూపొందించడం పూర్తి కాగానే వాటిపై అభ్యంతరాలు స్వీకరించి అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టనున్నారు. మల్టీ జోనల్‌ విధానంలో జరగనున్న పీజీహెచ్‌ఎంల బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల ఆధారంగా స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించనున్నారు. అనంతరం ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తారు. కాగా, బదిలీల్లో పండితులు, పీఈటీలకు అవకాశం ఉన్నా ... పదోన్నతుల అంశం ఉన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. వారి పోస్టుల అప్‌గ్రేడేషన్‌ సమస్య పరిష్కారమైతేనే వారికి ఈ పదోన్నతుల్లో అవకాశం లభించనున్నట్లు చెబుతున్నారు. కాగా, తమకూ ఈ పదోన్నతుల్లో అవకాశం కల్పించాలంటూ భాషా పండితులు, పీఈటీలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు.

బదిలీలు.. పదోన్నతులూ ఆన్‌లైన్‌లోనే....

గతంలో ఉపాధ్యాయ బదిలీలు అన్నీ ఆఫ్‌లైన్‌లోనే జరిగేవి. ఆఫ్‌లైన్‌లో నిర్వహించే సమయంలో ఉపాధ్యాయ సంఘాల జోక్యం ఉండేది. ఖాళీల విషయంలోనూ వివాదాలు చెలరేగేవి. కౌన్సెలింగ్‌ నిర్వహించినా... కొన్ని విషయాల్లో కొందరి మాటలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం బదిలీలకు ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి తీసుకు వచ్చింది. ఇంతకు ముందు జరిగిన ఉపాధ్యాయ బదిలీలను ఆన్‌లైన్‌ విధానం ద్వారా నిర్వహించారు. ఈసారి నిర్వహించే బదిలీలు, పదోన్నతులు ఆన్‌లైన్‌ ద్వారానే నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకోవడం, ఆప్షన్లు ఇచ్చుకోవడం వరకు ఉపాఽధ్యాయుల బాధ్యత కాగా, బదిలీ జరిగిన, పదోన్నతి లభించిన స్థానాల కేటాయింపు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. కేటాయించిన కొత్త స్థానాలకు సంబంధించిన ఉత్తర్వులను కూడా ఆన్‌లైన్‌ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకుని కొత్తగా కేటాయించిన పాఠశాలలో చేరాల్సి ఉంటుంది. ఈసారి పదోన్నతులు, బదిలీలు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఇదే అంశంపై చర్చ కొనసాగుతోంది.

ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ..

ఆన్‌లైన్‌ ప్రక్రియలో బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తుండడంతో ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఎక్కడకు బదిలీ జరుగుతుందనేది చివరి వరకు తెలిసే అవకాశం లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో టెన్షన్‌ వ్యక్తమవుతోంది. ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు ఎక్కడ కలిసినా ఇదే అంశంపై చర్చ కొనసాగుతోంది. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు తమకు ఏ పాఠశాలలో అవకాశం దక్కనుందోనని ఒత్తిడికి గురవుతున్నారు. పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి కూడా అలాగే ఉంది.

Updated Date - 2023-01-26T00:42:28+05:30 IST