నిరాశే!

ABN , First Publish Date - 2023-02-07T00:18:37+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిరాశే!

కొత్త సీసాలో పాత సారాలా రాష్ట్ర బడ్జెట్‌

పాలమూరు- రంగారెడ్డిపై మళ్లీ అదేమాట

ఫార్మాసిటీ ఊసే లేదు

వ్యవసాయానికి తగ్గిన కేటాయింపులు

రుణమాఫీకి అత్తెసరు నిధులు

వడ్డీమాఫీ ఈ ఏడాదీ లేనట్లే

ఎయిర్‌పోర్టు మెట్రోకు రూ.500కోట్ల నిధులు

స్థానిక సంస్థలకు నేరుగా నిధులు

కాంట్రాక్టు ఉద్యోగులకు తీపి కబురు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు సరిగా జరగలేదు. తెలంగాణకే తలమానికం అనే ఫార్మాసిటీ ఊసే లేదు. నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి ఆశగా ఎదురు చూస్తున్న భృతి గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. రైతు రుణమాఫీకి కూడా అరకొరగానే నిధులు కేటాయించారు. ఉమ్మడి జిల్లావాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే చూపారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 6)

ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ ఉమ్మడి జిల్లా ప్రజలకు నిరాశనే మిగిల్చింది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ సారి బడ్జెట్‌ ప్రజారంజకంగా, పెండింగ్‌ సమస్యల పరిష్కార దిశగా ఉంటుందని అందరూ భావించారు. అయితే రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు రంగాలకు చేసిన కేటాయింపులు తీవ్ర నిరాశ పరిచాయి. ముఖ్యంగా పలు ధీర్ఘకాలిక పెండింగ్‌ ప్రాజెక్టులు, కీలక పథకాలకు కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ్యవసాయ రంగానికి నిధులు కొంత పెంచినప్పటికీ రైతుల రుణమాఫీకి కొంతమేర నిఽధులు విడుదల చేశారు. ఇక ఉమ్మడి జిల్లావాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు అంతంత మాత్రంగానే చూపారు. అయితే మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో ఉమ్మడి పాలమూరు., రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 60శాతం పూర్తయినట్లు వెల్లడించారు. అయితే కొన్ని వ్యతిరేక శక్తులు కుట్రపూరిత కేసులు వేసి అడ్డుకుంటున్నాయని, పర్యావరణ అనుమతులు తీసుకువచ్చి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం కింద 60శాతం పనులు పూర్తయినట్లు చెబుతున్నా ఉమ్మడి జిల్లాలో వీటికి సంబంధించిన ఒక్క పనీ ఇంత వరకు పూర్తి కాకపోవడం గమనార్హం. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రాజెక్టుకు రూ.1,184 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే వ్యవసాయ శాఖకు ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు కాస్త తగ్గాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది వ్యవసాయ, అనుబంధశాఖలకు బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని అందరూ భావించారు. రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ యాంత్రీకరణ, విత్తనాల సబ్సిడీ, పావలా వడ్డీ, పంటల బీమా తదితర పథకాలకు నిధులు పెంచవచ్చని ఆశించారు. గతేడాదితో పోలిస్తే రుణమాఫీకి నిధులు కొంతమేర పెంచినా రుణమాఫీ పథకం పూర్తి చేయటానికి అవసరమైన నిధులు కేటాయించ లేదు. ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోయే రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న పంటల బీమా పథకానికి కేటాయింపులపై స్పష్టత లేదు. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీమాఫీ పథకం అమలు చేసే విషయంలో ఈ ఏడాది కూడా సర్కార్‌ కప్పదాటుగానే వ్యవహరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌హెచ్‌జీలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీమాఫీ కింద రూ. 4వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా బడ్జెట్‌లో వడ్డీలేని రుణ పథకం అమలుకు కేవలం రూ.849 కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో సగం కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో ఆసరా పెన్షన్‌లకు మరింత నిఽధులు కేటాయించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పింఛన్‌దారులకు కొంత ఊరట కలగనుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు 57ఏళ్ల నుంచి వృద్ధాప్య పెన్షన్‌ ఇచ్చేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వాస్తవానికి గత ఏడాది బడ్జెట్‌లో కూడా దీనిపై ప్రకటన చేసినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఇదిలా ఉంటే దళితబంఽధు పథకానికి భారీగా నిధులు కేటాయించారు. ప్రతి నియోజకవర్గంలో రెండువేల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించినప్పటికీ బీసీలపై చిన్నచూపు చూశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త

కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వెల్లడించింది. గతంలో హామీ ఇచ్చిన మేర కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపింది. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఈహెచ్‌ఎస్‌ విధానం అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో వందల మందికి లబ్ధి చేకూరనుంది.

స్థానిక సంస్థలకు ఊరట

ఈ బడ్జెట్‌లో స్థానిక సంస్థలకు భారీ ఊరట కల్పించారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం విడుదల చేసే పల్లె, పట్టణ ప్రగతి నిధులతో పాటు ఆర్ధిక సంఘ నిధులు నేరుగా పంచాయతీ, మున్సిపాలిటీల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి హరీష్‌ వెల్లడించారు. దీనివల్ల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫైనాన్స్‌, ట్రెజరీ ఆమోదం కోసం వేచి చూసే పరిస్థితి లేకుండా సొంతంగా తమ ప్రాంతంలో నిధులు వినియోగించుకునే అవకాశం కలిగింది. ఈ విధానం వల్ల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,199 గ్రామ పంచాయతీలు, 25 మున్సిపాలిటీలు, ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లకు లబ్ధి చేకూరనుంది. ఏప్రిల్‌ నుంచి సెర్ఫ్‌ ఉద్యోగులకు పేస్కేల్‌ ఇవ్వడంతో పాటు అంగన్‌వాడీ, ఆశా, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ అందజేస్తామని తెలిపింది.

సొంతింటి కలకు రూ. 3లక్షలు

పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కల నెరవేర్చడంలో అపసోపాలు పడుతున్న ప్రభుత్వం గతంలో చేపట్టిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఇందులో ఎన్ని సకాలంలో పూర్తి చేస్తారో తెలియదు కానీ గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈ ఏడాది కూడా సొంత స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 3లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామని వెల్లడించింది. ప్రతి నియోజకవర్గానికి 2వేల ఇళ్లు మంజూరు చేయనున్నారు.

జూన్‌లో ఎయిర్‌పోర్టు విస్తరణ పూర్తి

విమాన ప్రయాణీకుల రద్దీ రీత్యా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నట్లు మంత్రి హరీష్‌ వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌కు ఇది సంబంధం లేనప్పటికీ హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి గురించి మాట్లాడుతూ రూ.7500 కోట్లతో జరుగుతున్న విస్తరణ పనులు ఈ ఏడాది జూన్‌లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు.

మెట్రో విస్తరణకు అత్తెసర నిధులు

మెట్రో రైలును ఎయిర్‌పోర్టు వరకు పొడిగించేందుకు చేపట్టిన నిర్మాణ పనులకు ఈ ఏడాది రూ. 500 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌కు 31 కి.మీ మేర సాగే ఈనిర్మాణ పనులకు ప్రభుత్వం సొంత నిధులు రూ. 6,250 కోట్లు సమకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. మూడేళ్లలో ఈ పనులు పూర్తవుతాయని దీంతో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తక్కువ సమయంలో నేరుగా మెట్రోలో విమానాశ్రయానికి చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే మూడేళ్లలో ఈ పనులు పూర్తిచేస్తామని చెప్పినప్పటికీ ఈ ఏడాది బడ్జెట్‌లో కనీసం పదో వంతు కూడా నిధులు కేటాయించకపోవడం గమనార్హం.

ఫార్మాసిటీ ఊసే లేదు

హైదరాబాద్‌ నగర శివార్లలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ విషయం ఎక్కడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. ఫార్మాసిటీ నిర్మాణం కోసం దాదాపు 20వేల ఎకరాల భూసేకరణ చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం గతంలో నిధులు కేటాయించి ఇందులో కొన్ని పనులు పూర్తి చేశారు. ఎన్నికలలోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రచారం సాగుతున్నా ఈ బడ్జెట్‌లో దీని ప్రస్తావన ఎక్కడా ప్రభుత్వం చేయలేదు.

మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట

పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికులకు మాత్రం కొంత ఊరట కల్పించారు. ఇప్పటి వరకు వారికి నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనం ఇచ్చేవారు. ఇప్పుడు దానిని రూ.3వేలకు పెంచారు. దీంతో ఉమ్మడి జిల్లాలో 5,361మంది మధ్యాహ్న భోజన కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

================

మధ్యాహ్న భోజన కార్మికులు

జిల్లా కార్మికులు

రంగారెడ్డి 2561

వికారాబాద్‌ 1641

మేడ్చల్‌ 1159

==================

స్థానిక సంస్థలు

జిల్లా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్‌

రంగారెడ్డి 558 12 03

వికారాబాద్‌ 580 04 00

మేడ్చల్‌ 61 09 04

============================

ప్రాజెక్టు కేటాయింపులు (రూ.కోట్లలో)

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 1,184

ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం 6,250

ఫార్మాసిటీ 00

=========================

తెలంగాణ కలల సాకార బడ్జెట్‌: విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీ్‌షరావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజా బడ్జెట్‌. అభివృద్ధి సంక్షేమ, సీఎం కేసీఆర్‌ తెలంగాణ కలల సాకార బడ్జెట్‌. రైతులు, మహిళలు, విద్యార్థులు తదితర అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉంది. విద్యారంగానికి రూ.19,093కోట్ల కేటాయింపు హర్శనీయం. విశ్వవిద్యాలయాల్లో సదుపాయాల కల్పనకు ఎన్నడూ లేని విధంగా రూ.500కోట్లు, నియామకం అవుతున్న ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించడం గొప్ప విషయం.

నిరుద్యోగ భృతి ఊసే లేదు: పాలమాకుల జంగయ్య, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధుల కేటాయించలేదు. ప్రాజెక్టులకు అరకొర నిధులు కేటాయించారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు కేటాయించిన నిధులు అంతంత మాత్రమే. ఈ బడ్జెట్‌తో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు.

అంకెల గారడీ బడ్జెట్‌ ఇది: - టి.రామ్మోహన్‌రెడ్డి, వికారాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు

ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంకెలగారడీల ఉంది. సీఎం కేసీఆర్‌ చెబుతున్నదానికి, చేస్తున్నదానికి పొంతన లేదు. పాలమూరు ఎత్తిపోతల గురించి ప్రస్తావనే లేదు. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును దారిమళ్లించారు. ఉమ్మడి జిల్లా ఎడారిగా మారింది. నిరుద్యోగ భృతి, 1.7లక్షల ఉద్యోగాల భర్తీ ఊసే లేదు. రైతులకు లక్ష రుణమాఫీ ఏమైంది. శాఖలకు కేటాయింపులూ కంటి తుడుపుగా ఉన్నాయి.

కేటాయింపులు, వెచ్చింపులకు పొంతన లేదు: ఎం.మల్లేశ్‌, సీపీఎం వికారాబాద్‌ జిల్లా కార్యదర్శి

రాష్ట్ర బడ్జెట్‌ అంకెల గారడీలా ఉంది. కేటాయించిన నిధులకు, ఖర్చు చేసే డబ్బుకు పొంతన లేదు. రైతులకు రూ.లక్ష పంట రుణమాఫీ ఈసారి కూడా అమలయ్యేలా కన్పించడం లేదు. బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులు, పర్యాటక కేంద్రాల ప్రస్తావన లేదు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై భరోసా ఇవ్వలేదు.

ప్రజలను మోసంచేయ చూస్తున్నారు: విక్రంరెడ్డి, బీజేపీ మేడ్చల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసంచేయ చూస్తోంది. హామీలతోనే కేసీఆర్‌ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. గత బడ్జెట్‌ హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు. స్వయం ఉపాధిపై భరోసా ఇవ్వలేదు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై ప్రస్తావనే లేదు.

ఇది సంక్షేమ బడ్జెట్‌ : మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి

2023-24 రాష్ట్ర బడ్జెట్‌ పేదప్రజల సంక్షేమానికి ఊతమిచ్చేదిలా ఉంది. కేంద్ర సర్కార్‌ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నా రూ.2.9లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. ప్రాజెక్టులకు 27వేల కోట్లు, విద్యుత్‌కు 12వేల కోట్లు, వ్యవసాయానికి 26వేల కోట్లు, రుణమాఫీకి 6,385కోట్లు ప్రతిపాదించి కేసీఆర్‌ ప్రభుత్వం సాగురంగానికి పెద్దపీట వేసింది. కల్యాణలక్ష్మి, ఫించన్లు, రైతుబంధు పథకాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షనీయం. ఒక్కో డబుల్‌ బెడ్‌రూంకు రూ.3లక్షల ఇస్తామనడం సంతోషకరం.

చేవెళ్ల లోక్‌సభ స్థానానికి రూ.13,645కోట్లు : రంజిత్‌రెడ్డి, ఎంపీ, చేవెళ్ల

రాష్ట్ర బడ్జెట్‌లో చేవెళ్ల లోక్‌సభ స్థానానికి రూ.13,645కోట్లు కేటాయించడం హర్శనీయం. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌ను త్వరలో పూర్తిచేస్తామని మంత్రి హరీ్‌షరావు ప్రకటించడం శుభపరిణామం. శంషాబాద్‌ విమానాశ్రయ విస్తరణకు రూ.7,500 కోట్లు, రాయదుర్గం-శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెట్రో రైల్‌ పనులకు రూ.6,250కోట్లు, కోకాపేట్‌ ఔటర్‌లో సోలార్‌ రూఫ్‌ సైకిల్‌ట్రాక్‌ నిర్మాణానికి రూ.95కోట్లు కేటాయించడం ఆనందదాయకం.

విద్యా రంగానికి అరకొర నిధులే : గాలయ్య, టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

విద్యారంగానికి చాలా తక్కవ నిధులు కేటాయించారు. 2022లో రూ.16,043కోట్లు కేటాయించగా 2023లో 19,093కోట్లు కేటాయించారు. పెంపు 6.57 శాతానికి మించలేదు. గత బడ్జెట్‌ నిధులు ఖర్చే చేయలేదు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి గతంలో రూ.349.62కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 10శాతమైనా ఖర్చు చేయలేదు. టీచర్‌ పోస్టుల భర్తీపై ప్రస్తావన లేదు.

అంకెలు, సంఖ్యలు తప్ప ఏమీ లేదు : చల్లా నర్సింహారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, రంగారెడ్డి

ఆర్థిక మంత్రి హరీ్‌షరావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంకెలు, సంఖ్యలు తప్ప పెద్దగా ఏమీ లేదు. ప్రజలకు మేలుచేసేలా కనిపించలేదు. ఎన్నికల దృష్ట్యా ప్రజలను ఆకర్శించే బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రుణమాఫీకి నిధులు చాలా తక్కువ కేటాయించారు.

బడ్జెట్‌ కేటాయింపులో జిల్లాకు అన్యాయం : బొక్క నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి

బడ్జెట్‌లో జిల్లాకు కేటాయించింది ఏమీ లేదు. రంగారెడ్డి జిల్లా నుంచే రాష్ర్టానికి అత్యధిక ఆదాయం వస్తోంది. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలా బడ్జెట్‌ కేటాయింపులు లేవు. ఇప్పటి వరకూ ఒక్క డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా పంపిణీ చేయలేదు. బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం యువత నాలుగేళ్ల కింద దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నా నిధులు కేటాయించలేదు.

సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట : ఆనంద్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్‌

బడ్జెట్‌లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. సమగ్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున ఇవ్వాలనుకోవడం అభినందనీయం. పంచాయతీరాజ్‌, ఎస్సీ సంక్షేమ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు.

ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్‌ : టి.సదానందరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్‌

బడ్జెట్‌ ప్రజలను మభ్యపెట్టేలా ఉంది. ఎన్నికలు రానున్న నేపథ్యంలో మాయ మాటలు చెప్పి మరోసారి బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. హామీలను అమలు చేయడంలేదు. సాధ్యం కాని హామీలను బడ్జెట్‌లో పెడుతున్నారు. బడ్జెట్‌లో జిల్లా అభివృద్ధి అంశాలేవీ లేకపోవడం శోచనీయం.

బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదు : నందికంటి శ్రీధర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్‌

రాష్ట్ర బడ్జెట్‌తో బలహీనవర్గాలకు ఒరిగిందేమీ లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ చేయడంలేదు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రుణ మాఫీ ఏమైంది? అంకెల గారడీ, మాయమాటలు తప్ప బడ్జెట్‌లో ఏమీలేదు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్‌ : శంభీపూర్‌ రాజు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మేడ్చల్‌

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ బడ్జెట్‌ ఉంది. కేంద్రం సహకరించకపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్‌ను రూపొందించారు. తెలంగాణ బడ్జెట్‌ దేశానికే మోడల్‌గా నిలుస్తుంది.

ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతున్న బడ్జెట్‌ : గుర్కా జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్యే, కల్వకుర్తి

రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజామోదయోగ్యంగా ఉంది. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్‌ రూపకల్పన చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో రాష్ట్రంపై వివక్ష చూపుతున్నా సీఎం కేసీఆర్‌ అంచెలంచెలుగా బడ్జెట్‌ను రూ.2.90లక్షల కోట్ల పెంచడం అసాధారణ విషయం.

ఇది ప్రజారంజక బడ్జెట్‌ : కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ

మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాల ప్రజల కలలను సాకారం చేసేలా, రాష్ట్రాభివృద్ధికి దోహద పడేలా ఉంది. అభివృద్ధి, వ్యవసాయం, విద్య, వైద్యం, పేదల సంక్షేమం, సాగునీటి రంగానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రైతు రుణమాఫీకి రూ.6,385కోట్లు కేటాయించడం ఆనందదాయకం.

దివ్యాంగుల సంక్షేమానికి నిధులేవీ?: భుజంగరెడ్డి, ఎన్‌పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు, రంగారెడ్డి

రాష్ట్ర బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపుల్లో తీవ్ర నిర్లక్ష్య చేశారు. 2016 ఆర్పీడీ చట్ట ప్రకారం రెవెన్యూ వ్యయంలో 5శాతం నిధులు కేటాయించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్‌ను సవరించి దివ్యాంగులకు కేటాయింపులు పెంచాలి.

Updated Date - 2023-02-07T00:18:38+05:30 IST