హోం వర్కు చేయలేదని చిన్నారిపై దాష్టీకం

ABN , First Publish Date - 2023-02-01T23:44:20+05:30 IST

హోం వర్కు చేయలేదని ఓ చిన్నారిని ఉపాధ్యాయురాలు కర్రతో వాతలొచ్చేలా బాదిన సంఘటన చేవెళ్లలోని కృష్ణవేణి పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది.

హోం వర్కు చేయలేదని చిన్నారిపై దాష్టీకం
విద్యార్థిని అభినయశ్రీ చేయిపై పడిన వాతలు

కర్రతో వాతలొచ్చేలా బాదిన ఉపాధ్యాయురాలు

చేవెళ్ల, ఫిబ్రవరి 1 : హోం వర్కు చేయలేదని ఓ చిన్నారిని ఉపాధ్యాయురాలు కర్రతో వాతలొచ్చేలా బాదిన సంఘటన చేవెళ్లలోని కృష్ణవేణి పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధి రామన్నగూడకు చెందిన సీహెచ్‌.అభినయశ్రీ.. కృష్ణవేణి ప్రైవేట్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. బుధవారం విద్యార్థిని స్కూలుకు వెళ్లింది. తరగతి టీచర్‌ సోని విద్యార్థినిని.. ‘హోం వర్కు ఎందుకు చేయలేదు? వారం పది రోజులు స్కూల్‌కు ఎందుకు రాలేదు?’ అంటూ కర్రతో చేతులపై వాతలొచ్చేలా కొట్టింది. దీంతో బాలిక ఇంటి నుంచి తెచ్చుకున్న లంచ్‌ బాక్స్‌ కూడా తినలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో ఇతర ఉపాధ్యాయులు గమనించి టీచర్‌ కొట్టిన విషయం ఎక్కడా చెప్పొద్దని చెప్పి బస్సెక్కించి పంపించారు. చిన్నారి ఒంటిపై వాతలను చూసిన తల్లిదండ్రులు ఏమైందని బాలికను అడగగా.. టీచర్‌ కొట్టిందని రోదిస్తూ చెప్పింది. దీంతో పాఠశాలకు ఫోన్‌ చేసి ఘటనపై తల్లిదండ్రులు ప్రశ్నించగా.. పొరపాటు జరిగిందని టీచర్లు చెబుతున్నారని తెలిపారు. తమ పాపకు జ్వరం రావడంతో వారం రోజులుగా ఆసుపత్రిలో ఉందని, రెండు రోజుల నుంచే స్కూల్‌కు వెళ్తోందన్నారు. ఈ విషయం టీచర్‌కు సమాచారం ఇచ్చినా కొట్టడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికను బాదిన టీచర్‌పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-02-01T23:44:21+05:30 IST