వికారాబాద్‌ కలెక్టర్‌కు ఘన సన్మానం

ABN , First Publish Date - 2023-02-07T00:09:50+05:30 IST

వికారాబాద్‌ జిల్లాకు నూతన కలెక్టర్‌గా వచ్చిన నారాయణరెడ్డిని జిల్లా వీఆర్‌ఏ జేఏసీ నాయకులు శాలువాతో సత్కరించారు.

వికారాబాద్‌ కలెక్టర్‌కు ఘన సన్మానం
వికారాబాద్‌ : కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌లను సన్మానిస్తున్న టీఎన్జీవో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు

వికారాబాద్‌/కొడంగల్‌/పరిగి, ఫిబ్రవరి 6: వికారాబాద్‌ జిల్లాకు నూతన కలెక్టర్‌గా వచ్చిన నారాయణరెడ్డిని జిల్లా వీఆర్‌ఏ జేఏసీ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నైట్‌, అటెండర్‌ డ్యూటీలు, ఇసుక దిబ్బల వద్ద పనులు చేయించరాదని కోరారు. కలెక్టర్‌ కార్యాలయాల్లో వీఆర్‌ఏలతో అదనపు పనులు చేయింయకూడదని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మలను టీఎన్‌జీవోస్‌ రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌, వికారాబాద్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివకుమార్‌, అజ్మత్‌పాషా, అసోసియేట్‌ అధ్యక్షుడు నర్సిములు, కోశాధికారి రమేష్‌, కార్యవర్గ సభ్యులతో కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అదేవిధంగా కలెక్టర్‌ నారాయణరెడ్డిని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్‌ కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌ను లాల్‌కృష్ణ శాలువాతో సన్మానించారు.

అనంతపద్మ స్వామి సేవలో కలెక్టర్‌

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన నారాయణరెడ్డి సోమవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో శ్రీ అనంతపద్మనాభ స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తెల్లవారు జామునే ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌ దంపతులకు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆలయ విశిష్టతను కలెక్టర్‌కు తెలియజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో కలెక్టర్‌ దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

భాషా పండితుల సమస్యను పరిష్కరించాలి

వికారాబాద్‌, ఫిబ్రవరి 06: జిల్లాలో ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న భాషా పండితులకు ప్రభుత్వం పదోన్నతులు ఇవ్వక పోవడాన్ని నిరసిస్తూ సోమవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద బాషా పండితులు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ బాషా పండితుల వద్ద చేరుకొని వారి సమస్యలను విని పై స్థాయికి చేరవేస్తానని హామి ఇచ్చారు. జిల్లా విద్యాధికారి రేణుకాదేవి సైతం వీలైనంత త్వరగా భాషా పండితుల సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీటీఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు మానుపూరి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎజాస్‌ అహ్మద్‌, రఘునాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

భూములకు పట్టాలివ్వాలి : రైతులు

బొంరాస్‌పేట్‌, ఫిబ్రవరి 6: మండల కేంద్రంలోని సర్వే నెం.760లో గల ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని పలువురు దళిత రైతులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. సోమవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తమ ఆధీనంలో ఉన్న భూములకు పట్టాలు అందించకపోవడంతో రుణాల కోసం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. ఇప్పటికే రెండుసార్లు అధికారులు సర్వే చేసినా.. నేటికీ పట్టా పాస్‌బుక్‌లు ఇవ్వలేదని కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.

Updated Date - 2023-02-07T00:09:50+05:30 IST