రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ కాదు: ఎమ్మెల్యే రాజ్‌

ABN , First Publish Date - 2023-01-26T00:48:03+05:30 IST

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. పంచాయతీ రాజ్‌ స్థానంలో ఎమ్మెల్యే రాజ్‌ కనిపిస్తోంది

రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ కాదు: ఎమ్మెల్యే రాజ్‌

పంజాగుట్ట, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. పంచాయతీ రాజ్‌ స్థానంలో ఎమ్మెల్యే రాజ్‌ కనిపిస్తోంది. మొక్క ఎండితే సర్పంచ్‌లను సస్పెండ్‌ చేస్తున్నపుడు.. సీఎం నాటిన మొక్క విషయంలో ఏం చేయాలో ఆయనే చెప్పాలి’’ అని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకోవడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం-2018ని రద్దు చేయాలని, 11వ షెడ్యూల్‌లో ఉన్న 29 అధికారాలను వెంటనే బదలాయించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌ చాంబర్‌, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్‌ల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ రాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. బలమైన ఉద్యమంతోనే గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడుకోగలమని, ఆ దిశగా సర్పంచ్‌లు పోరాటానికి సిద్ధం కావాలని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. తెలంగాణలో పంచాయితీ రాజ్‌ కాకుండా ఎమ్మెల్యే రాజ్‌గా కనిపిస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేసిన చట్టం చెల్లదని అన్నారు. పంచాయతీల ఖాతాల్లో కేంద్రం నిధులు వేస్తే.. వాటిని సీఎం దొంగతనం చేశారని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దుయ్యబట్టారు. నిధులు కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన దుస్థితి సర్పంచ్‌లకు ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అన్నారు. నిధులు నేరుగా రాకుంటే పంచాయతీలు బతకవన్నారు. ఇంతమంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క అన్నారు. అనుమతి లేకుండా పంచాయతీ డబ్బులు తీసుకున్నందుకు ప్రభుత్వంపై 420 కేసు పెట్టాలని ఎంపీపీల సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు శ్రీశైలం డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-01-26T00:48:03+05:30 IST