అందరూ ఇన్‌చార్జీలే..!

ABN , First Publish Date - 2023-02-01T23:49:22+05:30 IST

ఎంతో ప్రాధాన్యమున్న విద్యాశాఖను నడిపేందుకు జిల్లాలో మండల విద్యాశాఖధికారులే కరువయ్యారు.

అందరూ ఇన్‌చార్జీలే..!
మండల విద్యాశాఽఖధికారి కార్యాలయం

- ఎంఈవో పోస్టులన్నీ ఖాళీ

- జిల్లాలో ఒకే ఒక రెగ్యులర్‌ ఎంఈవో

- 8 మంది ప్రధానోపాధ్యాయులకు ఇన్‌చార్జ్‌ ఎంఈవోలుగా బాధ్యతలు

- ఒక్కొక్కరికి నాలుగైదు మండలాలు

- పాఠశాలలపై కొరవడిన పర్యవేక్షణ

- టీచర్ల బదిలీలు, పదోన్నతుల తర్వాతనైన రెగ్యులర్‌ ఎంఈవోలు వచ్చేనా?

కామారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 1: ఎంతో ప్రాధాన్యమున్న విద్యాశాఖను నడిపేందుకు జిల్లాలో మండల విద్యాశాఖధికారులే కరువయ్యారు. జిల్లాలో మొత్తం 22 మండలాలకు కేవలం 8 మంది ఎంఈవోలు మాత్రమే ఉన్నారు. ఇందులో గాంధారి ఎంఈవో ఒక్కరే రెగ్యులర్‌ కాగా మిగిలిన వారంతా పీజీ హెచ్‌ఎంలే ఉన్నారు. వారు సైతం ఇన్‌చార్జీ ఎంఈవోలుగా కొనసాగుతుండగా ఇటు పాఠశాల విధులతో పాటు ఒక్కొక్కరికి నాలుగైదు మండలాలు కేటాయించడంతో పని భారంతో సతమతమవుతున్నారు. దీంతో పాఠశాలలపై సరైన పర్యవేక్షణ లేక ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రైవేట్‌ పాఠశాల దోపిడీపై నియంత్రణ కరువైంది. ఈ పరిస్థితి సంవత్సరాల కొద్ది కొనసాగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకవడంపై విద్యాశాఖపై ఏ మాత్రం దృష్టి సారిస్తున్నారనే దానిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా రెగ్యులర్‌ ఎంఈవోలు వచ్చేనా?

మండలంలో జరిగే ప్రతీ విద్యా సంబంధిత విషయం ఎంఆర్‌సీ నుంచి మానిటరింగ్‌ జరుగుతుంది. మండల విద్యావ్యవస్థను మానిటరింగ్‌ చేసేందుకు రెగ్యులర్‌ ఎంఈవోలు లేరు. గాంధారి మండలంలో మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవో ఉండగా మిగిలిన అన్నిచోట్ల పీజీ హెచ్‌ఎంలే బాధ్యతలు చూస్తున్నారు. ఈ ఇన్‌చార్జ్‌ ఎంఈవోలకు సైతం నాలుగైదు మండలాలు ఉండడంతో వారు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడల్లా వివిధ అవసరాల నిమిత్తం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సంతకాల కోసం వెళ్లాలన్నా వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. విద్యార్థుల వివిధ సర్టిఫికెట్లు, ఇతర అవసరాల నిమిత్తం ఎంఈవో ధ్రువీకరణ కోసం అవస్థలు పడుతున్నారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్‌ ఎంఈవోలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం టీచర్ల బదిలీలు, పదోన్నతులు జరుగుతున్నందున వచ్చే విద్యా సంవత్సరం నుంచైనా రెగ్యులర్‌ ఎంఈవోలను సైతం భర్తీ చేస్తేనే ఇన్‌చార్జీ ఎంఈవోలకు భారం తీరనుంది.

మీటింగ్‌లు, పర్యటనలతోనే సరి

నెలలో సుమారు 24 పని దినాలు ఉండగా ఒక్క ఇన్‌చార్జీ ఎంఈవోకు నాలుగైదు మండలాల బాధ్యతలు ఉన్నాయి. వీరు ప్రతినెల జరిగే జిల్లా, మండల, స్కూల్‌ కాంప్లెక్స్‌ సమావేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. మండల ప్రజాపరిషత్‌ సమావేశాలు, జిల్లా స్థాయి అధికారుల పర్యటనలకు హాజరుకావాలి. ఈ విధంగా నెలలో ఆరు నుంచి ఎనిమిది రోజులు సమావేశాలు, పర్యటనలకే పోతున్నాయి. అంటే ప్రతీ మండలానికి వారంలో ఒకరోజు మాత్రమే అందుబాటులో ఉంటారు. పాఠశాలల బిల్లులకు సంబంధించి సుమారు 8 సంతకాలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నభోజన బిల్లులు, ప్రభుత్వ నుంచి ఆదేశాలు, ప్రభుత్వ పథకాల అమలు, పాఠ్యపుస్తకాలు, పరీక్ష పత్రాలు పంపిణి ఉంటాయి. వీటన్నింటిలో వేటికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు.

ప్రతీ పాఠశాలను నెలకు ఒక్కసారి కూడా సందర్శించలేని పరిస్థితి

ఎంఈవోల కొరతతో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలపై పర్యవేక్షణ కరువైంది. ప్రతీ పాఠశాలను నెలకు ఒక్కసారైన సందర్శించాలి. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రగతి, మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరుతో పాటు రికార్డులను పరిశీలించాలి. అదేవిధంగా ఉపాధ్యాయుల సెలవులు, అవసరమైన చోట ఉపాఽధ్యాయుల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ పాఠశాలలను నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఎంఈవోలదే. పాఠశాలలను తనిఖీ చేస్తూ లోటుపాట్లను పరిశీలించాలి. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ అమ్మకం చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్లపై చర్యలు తీసుకునేది కూడా ఎంఈవోలే. కానీ ఎంఈవోల కొరత వల్ల నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్‌ పాఠశాలల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.

Updated Date - 2023-02-01T23:49:28+05:30 IST