ఇంటింటికీ కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2023-01-26T01:48:23+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాత్‌సే హాత్‌ జోడో యాత్రను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

ఇంటింటికీ కాంగ్రెస్‌

- నేటి నుంచి హాత్‌సే హాత్‌ జోడో యాత్ర ప్రారంభం

- జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ప్రారంభించనున్న కాంగ్రెస్‌

- జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ జెండాల ఆవిష్కరణ

- కామారెడ్డిలో ప్రారంభించనున్న సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ

- హాత్‌సే హాత్‌ జోడోతో ఎల్లారెడ్డి కాంగ్రెస్‌లో సమన్వయం కుదిరేనా?

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా జనాల్లోకి కాంగ్రెస్‌

కామారెడ్డి, జనవరి 25(ఆంఽధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హాత్‌సే హాత్‌ జోడో యాత్రను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాలు, మున్సిపాలిటీలు, మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండాలను ఆవిష్కరించి ఇంటింటా కాంగ్రెస్‌ పార్టీని తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కార్యాచరణను రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపాలని నిర్ణయించింది. అయితే ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ రెండు గ్రూప్‌లుగా విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో ఈ యాత్రతోనైన సమన్వయం కుదరాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేలా కార్యాచరణకు జిల్లా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.

నేటి నుంచి హాత్‌సే హాత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌గాంధీ నిర్వహిస్తున్న భారత్‌ జోడో యాత్రకు అనుసంధానంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే హాత్‌సే హాత్‌ జోడో యాత్ర కాంగ్రెస్‌ పార్టీ నేటి నుంచి ప్రారంభించనుంది. జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో హాత్‌సే హాత్‌ జోడో యాత్ర స్థానిక కాంగ్రెస్‌ నేతలు ప్రారంభించనున్నారు. కామారెడ్డిలో నిర్వహించే ఈ యాత్రకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ హాజరవనున్నారు. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్‌, ఇందిరానగర్‌ కాలనీలో కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగురవేసి ఇంటింటా ప్రచారం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేస్తారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో ఆ పార్టీ ఇన్‌చార్జి వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి రామారెడ్డి మండలంలోని కాలభైరవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రామారెడ్డి, ఇసన్నపల్లి, కన్నాపూర్‌ తండాలో ఇంటింటా హాత్‌సేహాత్‌ జోడో యాత్ర ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత మదన్‌మోహన్‌రావు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని హరిజనవాడలో నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాలరాజు పార్జీ జెండాను ఆవిష్కరించి యాత్రను ప్రారంభిస్తారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని బిచ్కుందలోని పార్టీ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గంగారాం పార్జీ జెండాను ఆవిష్కరించనున్నారు.

సమన్వయం కుదిరేనా?

జిల్లాలో కాంగ్రెస్‌కు గతంలో మంచి పట్టు ఉండేది. గత ఎన్నికల్లోనూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే సురేందర్‌ గెలుపొంది రాజకీయ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు. కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి మంచి ఓటు బ్యాంకే ఉంది. కొన్ని రోజులుగా స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరసనలు, ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. అయితే ప్రధానంగా జిల్లాలో ఆ పార్టీలో నేతల మధ్య సమన్వయం లోపిస్తోంది. ప్రధానంగా ఎల్లారెడ్డి, కామారెడ్డిలోని కాంగ్రెస్‌లో గ్రూప్‌ రాజకీయాలు నెలకొంటున్నాయి. ఎల్లారెడ్డి గ్రూప్‌ తగదాలు ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, మదన్‌మోహన్‌లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి కాంగ్రెస్‌ అధిష్ఠానం పిలుపునిచ్చే ప్రతీ కార్యక్రమాన్ని ఎవరికి వారే చేపడుతూ వస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ రెండు గ్రూప్‌ల అనుచరులు దాడులకు దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. దీంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ క్షేత్రస్థాయి కార్యకర్తలో అయోమయం నెలకొంటూ వస్తోంది. ఇటీవల పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకోవడంతో ఘర్షణలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ ఇరు గ్రూప్‌లు ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హాత్‌సేహాత్‌ జోడో యాత్రతోనైన ఇరుగ్రూప్‌ల మధ్య సమన్వయం కుదురుతుందో లేదో చూడాలి.

జోడో యాత్రతో పెరిగిన ఉత్సాహం

జాతీయ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రతో జిల్లా కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. జిల్లా మీదుగా రాహుల్‌ జోడో యాత్ర జరగడంతో పార్టీ శ్రేణుల్లో కాస్త నూతన ఉత్తేజం పెరిగింది. రాహుల్‌జోడో యాత్రకు దేశవ్యాప్తంగా వస్తున్న ఆధరణకు పార్టీ కార్యకర్తలు చురుకుగా కనిపిస్తున్నారు. జోడో యాత్ర సందర్భంగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల నుంచి తెలుసుకుని జోడో యాత్రలో సందేశాలు ఇచ్చారు. ఈ సందేశాలను అన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హాత్‌సేహాత్‌ జోడో యాత్రతో రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు ఇంటింటా కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పటికే హాత్‌సేహాత్‌ జోడో యాత్రపై నియోజకవర్గాలు, మండలాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించుకున్నారు. నేడు ఈ యాత్రను జెండాలు ఆవిష్కరించి ప్రారంభించనున్నారు. ఈ నెల 6వ తేది నుంచి ఇంటింటా ప్రచారం చేపట్టనున్నారు.

Updated Date - 2023-01-26T01:48:23+05:30 IST