అక్రమాలకు చెక్
ABN , First Publish Date - 2023-01-26T01:53:21+05:30 IST
ఉపాధిహామీ పథకంలో కూలీల హాజరు విషయంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు విధానం అమలులోకి తీసుకువచ్చింది.

- ఉపాధి కూలీల హాజరు ఇక ఆన్లైన్లో
- ఉపాఽధిహామీ పథకం పకడ్బందీగా అమలు
- అవకతవకలు అరికట్టేందుకే అంటున్న అధికారులు
- ఇప్పటికే అమలవుతున్న ఆన్లైన్ నమోదు ప్రక్రియ
- జిల్లాలో 5.80లక్షల మంది ఉపాధిహామీ కూలీలు
కామారెడ్డి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పథకంలో కూలీల హాజరు విషయంలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ హాజరు విధానం అమలులోకి తీసుకువచ్చింది. అలాగే ఇక నుంచి ప్రతీ పని వివరాలను నేషనల్ మాస్టర్ మేనేజ్మెంట్ సిస్టం( ఎన్ఎంఎంఎస్) ద్వారా పంపాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని నేషనల్ ఇన్ఫర్మెటిక్ సెంటర్(ఎన్ఐసీ) రూపొందించింది. ఉపాధి హామీ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూలీల హాజరు విషయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రారంభంలో మ్యానువల్ మాస్టర్ ద్వారా హాజరు వేసేవారు. 2021 నుంచి గత నెలాఖరు వరకు ఎంఎంఎస్ ద్వారా హాజరునమోదు చేసేవారు. ఈనెల 1వ తేదీ నుంచి కూలీల హాజరును ఎన్ఎంఎంఎస్ ఆన్లైన్లో నమోదు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనిని జిల్లాల్లో తప్పక అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో కూలీల హాజరు విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా తెలిసే అవకాశం ఏర్పడుతుంది.
జిల్లాలో 5.80లక్షల మంది ఉపాధి కూలీలు
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్లలోని 526 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,60,780 జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ జాబ్కార్డుల్లో 5,80,621 ఉపాధి కూలీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 91.25లక్షల పని దినాలను అధికారులు గుర్తించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఉపాధిహామీ పనుల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఐసీ పరిధిలోకి వెళ్లింది. దీంతో కూలీలు 100 రోజుల వరకే పనులు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ పనులు మినహాయిస్తే పేద కుటుంబాలకు ఏడాది పొడవున ఉపాధిహామీ ఆదుకుంటుంది. గ్రామాల్లో ప్రధానంగా రైతులకు ప్రయోజనాన్ని కల్పించే కాలువల నిర్మాణాలు, మరమ్మతులు, పూడికతీత, వ్యవసాయ భూముల అభివృద్ధి హరితహారం, కందకాల తవ్వకం, ఫాంపాండ్, వర్మీకంపోస్ట్ షెడ్డు, సోఫిడ్స్, డ్రైవింగ్ ప్లాట్ఫాం తదితర పనులు చేస్తున్నారు.
ఒక్కరున్నా ఆన్లైన్లో హాజరే..
ఎన్ఎంఎంఎస్ ద్వారా గతంలో 20మంది కంటే ఎక్కువ మంది కూలీలు హాజరైతే ఆన్లైన్లో నమోదుచేసేవారు. అంతకంటే తక్కువగా ఉంటే ఈఎంఎంఎస్ ద్వారా హాజరు ఉండేది. ప్రస్తుత సంఖ్యతో పని లేకుండా ఒక కూలీ ఉన్నప్పటికీ ఎంఎంఎస్ విధానం ద్వారా ఆన్లైన్లోనే అటెండెన్స్ అప్లోడ్ చేయకపోతే కూలీలకు ఎటువంటి పేమెంట్ జరగదు. అలాగే పని ప్రదేశంలో రెండు సార్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
పనుల కుదింపు
ఉపాధిహామీ కింద చేపట్టే అన్ని పనులను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉండగా ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, మేకల షెడ్ల వంటి వ్యక్తిగత ప్రయోజన పనులకు మినహాయింపు ఇచ్చింది. గతంలో ఒక్కో గ్రామానికి ఏడాదిలో 40 వరకు పనులు చేపట్టే అవకాశం ఉండగా ఇప్పుడు 20కి మాత్రమే పరిమితం చేశారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి వందరోజుల వరకు పని కల్పించాల్సి ఉండగా 60 రోజులకు కూడా పని కల్పించడం లేదు. ఉపాధి హామీ కింద పని కోరిన వారికి రెండు వారాల్లో పని కల్పించాల్సి ఉండగా పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. అయితే సెల్ఫోన్ సిగ్నల్ అందని ప్రాంతాల్లో యాప్ ద్వారా హాజరు నమోదు చేయడం కష్టసాధ్యంగా మారుతోంది. కూలీలకు కేటాయించిన కొలతలు, పరిమాణం ప్రకారమే డబ్బు చెల్లిస్తున్నప్పుడు పని వేళల్లో సడలింపులు ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట
ఉపాధి పథకం ప్రారంభంలో కూలీల మస్టర్ల విషయంలో గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. సోషల్ ఆడిట్ జరిగినప్పుడు పలు చోట్ల కూలీల హాజరు విషయంలో సమస్య ఎదురైంది. కొన్నిచోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు తమ కుటుంబ సభ్యుల వారికి అనుకూలమైన వారు పనులకు రానప్పటికీ హాజరైనట్లు చూపించి అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఎంఎంఎస్ విధానం అమలులోకి రావడంతో ఇటువంటి అక్రమాలకు చెక్ పడనుంది. అయితే ఆన్లైన్ హాజరు విధానం నుంచి వ్యక్తిగత పనులకు మినహాయింపు ఇచ్చారు. అంటే ప్లాంటేషన్, రీప్లాంటేషన్, హార్టికల్చర్, హౌజింగ్ పనులు వంటి వాటికి ఈ మినహాయింపు ఉండనుంది.