పాతగుట్ట బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి

ABN , First Publish Date - 2023-02-07T00:16:26+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనృసింహుడి దేవాలయ తిరుక ల్యాణబ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో పరిసమాప్తమయ్యాయి.

పాతగుట్ట బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి
అష్టోత్తర శత కలశాలకు పూజలు నిరహిస్తున్న అర్చకులు

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 6: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట అనుబంధ ఆలయమైన పాత గుట్ట లక్ష్మీనృసింహుడి దేవాలయ తిరుక ల్యాణబ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో పరిసమాప్తమయ్యాయి. పాత గుట్ట ప్రధానాలయంలోని స్వయంభువులను కొలిచిన ఆచార్యులు అష్టోత్తర శతఘటాభిషేక పూజలను ఆగమ శాస్త్రానుసారం నిర్వహించారు. ప్రధాన మండపంలో 108 కలశాలను ఏర్పాటుచేసి, 108 ద్రవ్యాలు, 108 ఔషధాలు, 108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్చించారు. ఈ 108ఘటాలకు ముక్కోటి దేవతలను ఆవాహన చేసి ఆహుతులకు సమర్పించారు. అనంతరం యాగశాలలో నిత్య లఘు పూర్ణాహుతిని నిర్వహించి గర్భాలయంలోని స్వయంభువులకు, సువర్ణ కవచమూర్తులకు, ఉత్సవమూర్తులకు శాంతి అభిషేక పూజలను నిర్వహించారు. ఉత్సవాల్లో పారాయణాలు జరిపిన రుత్వికులు, పండితులను సన్మానించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియడంతో మంగళవారం నుంచి పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యకల్యాణోత్సవం, బ్రహ్మోత్సవ సేవా కైంకర్యాలు ఆరంభించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ వైదిక ఆధ్యాత్మిక వేడుకలు దేవస్థాన ప్రధానార్చకులు మరింగంటి మోహనాచార్యులు, అర్చకబృందం ఆధ్వర్యంలో కొనసాగగా, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఇన్‌చార్జి ఈవో ఎం.రామకృష్ణారావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ పాల్గొన్నారు. యాదగిరికొండపైన సోమ వారం శివకేశవులకు నిత్యారాధనలు ఆయా సంప్రదాయ రీతిలో కొనసాగాయి. యాదగిరీశుడిని బాసర దేవస్థాన ఈవో విజయరమణారావు కుటుంబ సమే తంగా దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించగా, గర్భాలయంలోని మూలమూర్తులను దర్శించుకు న్నారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా, దేవస్థాన సిబ్బం ది స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ.24,40,935 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

15 నుంచి మహాశివరాత్రి మహోత్సవాలు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కొండపైన కొలువుదీరిన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి సన్నిధి(శివాలయం)లో ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగనున్నాయి. ఆరేళ్లుగా శివాలయ పునర్నిర్మాణ పనుల కారణంగా తాత్కాలిక ఉపాలయంలో వేడుకలను శైవాగమ సంప్రదాయరీతిలో నిర్వహించారు. శివాలయ ఉద్ఘాటన తర్వాత మొదటిసారి రానున్న మహోత్సవాలు కావడంతో ఏర్పాట్లపై దేవస్థాన అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు దేవస్థాన ఇన్‌చార్జి ఈవో ఎం.రామకృష్ణారావు ఆయా శాఖల అధిపతులతో మహోత్సవాల నిర్వహణపై సమీక్షిస్తున్నారు.

మహాశివరాత్రి వేడుకల వివరాలు ఇలా..

15వ తేదీన ఉదయం శైవాగమ సంప్రదాయం ప్రకారం విఘ్నేశ్వరుడిని కొలుస్తూ స్వస్తిపుణ్యాహవాచన పూజలతో శివరాత్రి మహోత్సవాలకు శ్రీకారం పలుకుతారు.

16న శివాలయంలో ద్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం,అగ్నిప్రతిష్ట.

17న మధ్యాహ్నం రుద్రహవనం, రాత్రికి శివకల్యాణోత్సవం.

18న మహాశివరాత్రి, మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేక పూజలు.

19న లక్షభిల్వార్చన..రాత్రికి దివ్య విమానరథోత్సవం

20న మహాపూర్ణాహుతి, త్రిశూలోత్సవంతో ఉత్సవాల పరిసమాప్తి.

Updated Date - 2023-02-07T00:16:27+05:30 IST