నృసింహా..! మాకేమీ శిక్ష

ABN , First Publish Date - 2023-01-26T01:18:05+05:30 IST

జిల్లాలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు ఏళ్ల తరబ డి నిరీక్షణ తప్పడంలేదు.

నృసింహా..! మాకేమీ శిక్ష
బస్వాపూర్‌ ప్రాజెక్ట్‌

ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిందేనా?

పరిహారం, పునరావాసం కోసం బస్వాపూర్‌ (నృసింహసాగర్‌) నిర్వాసితుల నిరీక్షణ

పరిహారం అందక ఒకరి ఆత్మహత్య, గుండెపోటుతో ఇద్దరి మృతి

రోడ్డున పడిన కుటుంబాలు

బస్వాపూర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

జిల్లాలోని బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు ఏళ్ల తరబ డి నిరీక్షణ తప్పడంలేదు. ఇదిగో.. పరిహారం, అదిగో పునరావాసం అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందే తప్ప కార్యాచరణ మాత్రం కన్పించడంలేదు. కాళేశ్వ రం ప్రాజెక్ట్‌లో ప్రభుత్వం భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌లో బస్వాపూర్‌(నృసింహసాగర్‌) రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ కింద పరిహారంతోపాటు పునరావాసం కోసం గ్రామస్థులు మూడేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

- (ఆంధ్రజ్యోతి-యాదాద్రి)

ఓవైపు ప్రాజెక్టు పనులు పూర్తవుతుండగా... మరోవైపు గ్రామాలను ఖాళీచేసే సమయం అసన్నమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోంది. దీంతో బీఎన్‌ తిమ్మాపూర్‌ గ్రామస్థులు గత 58 రోజులుగా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ కట్టపై ఆందోళనలు కొనసాగిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్‌తండా గ్రామస్థులు 2022 నవంబరులో తొమ్మిది రోజులపాటు దీక్షలు చేశారు. పరిహారం చెల్లింపుపై ప్రభుత్వంనుంచి స్పందన రాకపోవడంతో ఈ నెల 20, 21న 48గంటలపాటు కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ రూపాల్లో నిర్వాసితులు చేస్తున్న ఉద్యమానికి విపక్షాలు మద్దతు ప్రకటించి, ఆందోళనలు పాల్గొంటున్నాయి. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌చేస్తూ కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్నారు.

కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భాగంగా..

జిల్లాకు గోదావరి జలాల మళ్లింపునకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ రిజర్వాయర్‌ పనులు చేపట్టారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే కాళేశ్వరం 16వ ప్యాకేజీలో భువనగిరి మండలం బస్వాపూర్‌ వద్ద నిర్మిస్తున్న నృసింహస్వామి రిజర్వాయర్‌ను పూర్తిచేసి గోదావరి జలాల మళ్లింపు పనులు చేపడుతున్నారు. 11.39 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణమవుతోన్న బస్వాపూర్‌ నృసింహస్వామి రిజర్వాయర్‌కు 1.50 టీఎంసీల నీటిని మళ్లించి, నిల్వ చేసే సామర్థ్యం మేరకు తొలిదశలో పనులను పూర్తికి లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ రిజర్వాయర్‌కోసం భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌లో 1,761 ఎకరాలకు 382, బస్వాపూర్‌లో 1,113 ఎకరాలకు 900 ఎకరాలు, వడపర్తిలో 445 ఎకరాలకు 285 ఎకరాలు సేకరించారు. జంగంపల్లిలో 740 ఎకరాలకు 129 ఎకరాలను సేకరించడానికి నోటిఫికేషన్‌ జారీచేశారు. వీటిలో బీఎన్‌ తిమ్మాపూర్‌లో 700 ఎకరాలు ప్రభుత్వభూమి కాగా, మరో 400 ఎకరాలు రైతులకు చెందినవి. ఇప్పటివరకు రైతులకు రూ.107కోట్లు చెల్లించారు. భూములు కోల్పోతున్న రైతులకు మరో రూ.198 కోట్లు చెల్లించాల్సి ఉంది. రిజర్వాయర్‌లోకి నీరు మళ్లించిన పక్షంలో ఈ గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. ఈ గ్రామాలను ఖాళీ చేస్తే తప్ప రిజర్వాయర్‌లోకి నీరును వదిలలేని పరిస్థితి. రిజర్వాయర్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరినప్పటికీ, ముంపు గ్రామాలకు పునరావాసం కల్పనలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇళ్ల స్థలాల కేటాయింపు, నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రిజర్వాయర్‌లోకి ఇప్పటివరకు నీరు మళ్లించలేదు. పరిహారం చెల్లింపు ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తుండటంతో గ్రామస్థులు ఆవేదన చెందుతూ, ఆందోళనబాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

‘రైతుబంధు’కు నోచని రైతులు

బస్వాపూర్‌ రిజర్వాయర్‌తో బీఎన్‌ తిమ్మాపురం, చౌకలతండా, లప్పానాయక్‌తండా ముంపునకు గురవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయడంతో తమకు భూములు ఉన్నా లేనట్టేగా అన్న ఆందోళనలో ఉన్నారు. సంక్షేమ పథకాలు కూడా అందడంలేదు. ఈ గ్రామంలోని రైతులకు రైతుబంధు పథకం కింద డబ్బులు రావడంలేదని, ప్రమాదవశాత్తు రైతులు మృతి చెందినా... రైతు బీమాకు నోచడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పక్కనున్న గ్రామాల్లోని భూములకు కోట్ల రూపాయల్లో ధరలు పలుకుతున్నాయని, తమ భూములు క్రయ, విక్రయాలు కూడా జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల పేరుమీద ఉన్న భూములను వారసులకు విరాసత్‌(ఫౌతీ) చేయాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఈ భూముల సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు విరాసత్‌ చేయలేని అధికారులు వెల్లడిస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వపరంగా అందించే అన్ని పథకాలు తాము కోల్పోతున్నామని, భూములకు పరిహారం అందకపోవడంతో మనస్తాపానికి గురై పిన్నం సతీష్‌(42)అనే రైతు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకు ని ఆత్మహత్య చేసుకున్నాడని, మరో రైతు రావుల రాజు(40), జూపెల్లి నర్సింహ(48) గుండెపోటుతో మృత్యువాతపడ్డారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

నత్తనడకన పునరావాసం పనులు

రిజర్వాయర్‌ నిర్మాణంతో భువనగిరి మండలం బీఎన్‌తిమ్మాపూర్‌, యాదగిరిగుట్ట మండలంలోని లక్ష్మీనాయకుడి తండా, చొంగల్‌ నాయకుడి తండా గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి. ఈ గ్రామస్థుల పునరావాసం కోసం రూ.84కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు రూ.50కోట్లు విడుదల చేయగా, మరో రూ.34కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో పనులు నత్తనడకన కొసాగుతున్నాయి. బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితులకోసం భువనగిరి మండలం హుస్సేనాబాద్‌లోని సర్వేనెంబర్‌ 107లో గల 95ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. మొత్తం 118 ఎకరాల్లో లేఅవుట్‌ను రూపొందించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ, కొంతమంది రైతులు భూమి ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో 95 ఎకరాల్లో పనులు చేపట్టారు. 95 ఎకరాల్లో లే అవుట్‌లో రోడ్లు, ఇళ్లస్థలాలు, పార్కులు, సామాజిక అవసరాలకోసం ప్లాన్‌ సిద్ధం చేసి, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గుట్టలుగా ఉన్న భూమిని పూర్తిగా చదును చేసి ఫార్మేషన్‌ రోడ్లు పూర్తిచేశారు. ప్లాట్లవారీగా సరిహద్దు రాళ్లను కూడా పాతారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు లేఅవుట్‌ అభివృద్ధి చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేను పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్‌తో గ్రామాల్లో ఇళ్లను కోల్పోతున్న నిర్వాసితులకు 200 గజాల స్థలంతోపాటు ఇళ్ల నిర్మాణానికి రూ.5.60లక్షల వరకు ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది. బీఎన్‌ తిమ్మాపూర్‌లో ఇళ్లు కోల్పోతున్న వారిలో...మొత్తం 1056 మందిని లబ్ధిదారులుగా తేల్చారు. అయితే అధికారులు ఇప్పటివరకు 500 మంది ముంపు నిర్వాసితులకు ఒక్కో లబ్ధిదారునికి రూ.5.60లక్షల చొప్పున... రూ.28కోట్లు నిధులు విడుదల చేశారు. మరో 556 మందికి రూ.31.13కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. యాదగిరిగుట్ట మండలంలోని లక్ష్మీనాయకుడితండా, చొంగల్‌ నాయకుడి తండా నిర్వాసితులకు దాతర్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 297 ప్రభుత్వం గుర్తించి, లేఅవుట్‌ రూపొందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధంచేసి, ప్రభుత్వానికి పంపారు. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో పునరావాస పనులు ఇంకా ప్రారంభించలేదు.

పరిహారంపై ప్రభుత్వానికి నివేదించాం

పరిహారం చెల్లించేందు కు అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.50 కోట్లు పంపిణీ చేశాం. మరో రూ.34కోట్లు మంజూరు కావాల్సి ఉంది. భువనగిరి మండలం బీఎన్‌ తిమ్మాపూర్‌ నిర్వాసితుల కోసం హుస్సేనాబాద్‌లోని అసైన్‌మెంట్‌, ప్రభుత్వ భూమిని గుర్తించాం. సర్వేనెంబర్‌ 107లో 95 ఎకరాల్లో ప్రస్తుతం లేఅవుట్‌ను రూపొందించి పనులు చేపట్టాం.

- డి.శ్రీనివా్‌సరెడ్డి, అదనపు కలెక్టర్‌

నష్టపరిహారం, పునరావాసం కోసం మూడేళ్లుగా ..

రిజర్వాయర్‌ నిర్మాణంతో గ్రామంలోని భూములు, ఇళ్లు కోల్పోతున్నాం. అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వేలు పూర్తి చేశారు. త్వరలోనే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. నష్టపరిహారం కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వం మా బాధను అర్థం చేసుకుని ఒకేసారి పరిహారం, పునరావాసం కల్పించాలి.

- బాలరాజు, బీఎన్‌తిమ్మాపూర్‌ ముంపు నిర్వాసితుడు

Updated Date - 2023-01-26T01:18:05+05:30 IST