ఉపాధి కోసం వెళ్తూ.. మృత్యు ఒడికి

ABN , First Publish Date - 2023-02-02T00:43:49+05:30 IST

ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరిన తల్లీకుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున పెద్దఅడిశర్లపల్లి మండలం చిలకమర్రి స్జేజీ సమీపంలో కోదాడ-

ఉపాధి కోసం వెళ్తూ.. మృత్యు ఒడికి
వెంకాయమ్మ, గణేష్‌ (ఫైల్‌ ఫొటో)

కారు ఢీకొని తల్లీకుమారుడి మృతి

పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 1: ద్విచక్ర వాహనంపై స్వగ్రామం బయలుదేరిన తల్లీకుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం తెల్లవారుజామున పెద్దఅడిశర్లపల్లి మండలం చిలకమర్రి స్జేజీ సమీపంలో కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి-167పై ఈ సంఘటన జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ రంజితరెడ్డి , స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొప్పరం మండలం సంతమాగులూరు గ్రామానికి చెందిన గుంజి ఎలమంద, వెంకాయమ్మ దంపతులు దేవరకొండ మండలం తాటికోలు గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఎనిమిదేళ్లుగా తాటికోలు గ్రామంలో సుతారు పనులు చేస్తూ జీవనం సాగిస్తుండగా, వారికి కుమారుడు గంజి గణేష్‌(19), కుమార్తె ఉన్నారు. గణే్‌షకు సంతమాగులూరులో ఉపాధి దొరకడంతో అక్కడ పనిలో పెట్టి వచ్చేందుకు తల్లి వెంకయమ్మతో బుధవారం తెల్లవారుజామున తాటికోలు నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పెద్దఅడిశర్లపల్లి మండలం చిలకమర్రి స్టేజీ సమీపం దాటిన తర్వాత వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పెద్దవూర నుంచి కొండమల్లేపల్లికి ఎదురుగా వస్తున్న తవేరా కారు డ్రైవర్‌ నరేష్‌ వేగంగా నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న తల్లీకుమారులు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని కారు కొద్దిదూరం ఈడ్చుకుపోవడంతో ట్యాంక్‌ నుంచి పెట్రోల్‌ లీకై ఒక్కసారిగా మంటలు చేలరేగి ద్విచక్రవాహనం దగ్ధమైంది. దీంతో డ్రైవర్‌ కారును అక్కడే వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న గుడిపల్లి ఎస్‌ఐ రంజితరెడ్డి, తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహలను పరిశీలించారు. వారివద్ద ఉన్న సెల్‌ఫోన ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ మార్చురీకి తరలించారు. భర్త ఎలమంద ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఘటనకు కారణమైన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరిన 45 నిమిషాల్లో తల్లీకుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందటంతో తాటికోలులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2023-02-02T00:43:53+05:30 IST