దారులన్నీ పెద్దగట్టు వైపే...

ABN , First Publish Date - 2023-02-07T00:53:04+05:30 IST

పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు భక్తజనం పోటెత్తింది. లక్షలాది మంది రాకతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. భేరీ మోతలు, ఓ లింగా ఓ లింగా అంటూ స్వామి నామస్మరణల మధ్య గజ్జెల లాగులతో యాదవుల కత్తుల, కటారీ విన్యాసాలు చేస్తూ ఆలయం వద్దకు భక్తులు చేరుకున్నారు.

దారులన్నీ పెద్దగట్టు వైపే...
స్వామివారిని దర్శించుకున్న మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌

భక్తులతో కిక్కిరిసిన పరిసరాలు

ఐదు కిలోమీటర్ల మేర భక్తుల గుడారాలు

స్వామిని దర్శించుకున్న మంత్రులు జగదీ్‌షరెడ్డి, శ్రీనివా్‌స యాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌

రెండో రోజు 8 లక్షల మంది జాతరకు వచ్చిన అంచనా

చివ్వెంల / భానుపురి / సూర్యాపేట(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 6 : పెద్దగట్టు లింగమంతులస్వామి జాతరకు భక్తజనం పోటెత్తింది. లక్షలాది మంది రాకతో గట్టు పరిసరాలన్నీ కిటకిటలాడాయి. భేరీ మోతలు, ఓ లింగా ఓ లింగా అంటూ స్వామి నామస్మరణల మధ్య గజ్జెల లాగులతో యాదవుల కత్తుల, కటారీ విన్యాసాలు చేస్తూ ఆలయం వద్దకు భక్తులు చేరుకున్నారు. మహిళలు గంపలతో ఉగ్రాలు ఊగుతూ స్వామిని దర్శించుకున్నారు. జిల్లా కేంద్రానికి చేరే దారులన్నీ పెద్దగట్టువైపే మళ్లాయి. సోమవారం సుమారు 8 లక్షల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.

జాతరలో భాగంగా ఆదివారం అర్ధరాత్రి పెద్దగట్టుకు దేవరపెట్టె రాకతో సోమవారం ఉదయం సౌడమ్మ, యలమంచమ్మ, ఆకుమంచమ్మ దేవతలకు బోనాలు సమర్పించారు. సాయంత్రం మద్దెల పోలు పోశారు. మధ్యాహ్నానికి ఆలయ పరిసరాలు భక్తజనంతో నిండిపోయాయి. జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. దేవతలకు పెద్దసంఖ్యలో జీవాలను బలి ఇచ్చి మొక్కు తీర్చుకున్నారు. మహిళలు గంపలు ఎత్తుకుని గుడిచుట్టూ నృత్యాలు చేస్తూ ప్రదక్షణలు చేశారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో తరలివచ్చిన భక్తులు దురాజ్‌పల్లి చుట్టుపక్కలా ఐదు కిలోమీటర్ల మేర గుడారాలు వేసుకొని వంటలు వండుకున్నారు. గుట్టపై నుంచి చూస్తే కిలోమీటర్ల మేర ఎటుచూసినా టెంట్లు, గుడారాలే కనిపించాయి. దురాజ్‌పల్లి, కాశీంపేట, కలెక్టరేట్‌, గుంజలూరు వరకు జనసందడి కనిపించింది. సీసీ కెమెరాల ద్వారా బందోబస్తును జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీష్‌రెడ్డిలతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, విమలక్క, ఆకునూరి మురళి, ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు.

నేడు చంద్రపట్నం

పెద్దగట్టు జాతరలో మంగళవారం ఉదయం గొల్ల హక్కుదారులైన మున్న, మెంతబోయిన కుటుంబీకులు తమ ఆశ్రితులైన బైకాని వారితో చంద్రపట్నం వేయిస్తారు. రెండు మట్టి కంచుడుల్లో నువ్వులనూనెతో జ్యోతులు వెలిగిస్తారు. లింగమంతులస్వామి మాణిక్యమ్మ కల్యాణాన్ని నిర్వహిస్తారు.

స్వరాష్ట్రంలోనే పెద్దగట్టుకు ప్రాధాన్యం: మంత్రి తలసాని

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకే పెద్దగట్టు జాతరకు అధిక ప్రాధాన్యం లభించిందని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. జాతరకు సీఎం కేసీఆర్‌ అత్యధిక నిధులు కేటాయించి, ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నారు. జాతర ప్రాముఖ్యం, ప్రాశస్త్యం దినదినాభివృద్ధి చెంది వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు పెద్దగట్టుకు తరలివస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలందరికీ లింగమంతులస్వామి ఆశీస్సులుండాలని కోరుకున్నాన్నారు.

సబ్బండ వర్గాల జాతర : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు సబ్బండ వర్గాల జాతర అని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. తెలంగాణలో సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు జాతరలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. పెద్దగట్టు వద్ద భవిష్యతలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత సౌకర్యాలు ఏర్పాటవుతాయన్నారు. గత ప్రభుత్వాలు దేవాలయాల అభివృద్ధిపై వివక్ష చూపించాయన్నారు. వచ్చే జాతరకు పెద్దగట్టును మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

భక్తుల కోలాహలమే నిదర్శనం : మంత్రి జగదీష్‌రెడ్డి

పెద్దగట్టు జాతరకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల్లో కనిపిస్తున్న కోలాహలమే రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనమని మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి యజ్ఞంలో భాగంగా ఎడారిలా ఉన్న సూర్యాపేట ప్రాంతం సస్యశ్యామలం అయ్యిందన్నారు. గోదావరి జలాలతో లింగమంతులస్వామి పాదాలను తడిపామన్నారు. స్వామి ఆశీస్సులతో దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటిస్థానంలో నిలిచాయన్నారు. కాలం కలిసివచ్చి పాడి పంటలు బాగా పండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-02-07T00:53:07+05:30 IST