ఉద్యమకారులకు అడుగడుగునా అవమానాలు

ABN , First Publish Date - 2023-01-26T01:28:18+05:30 IST

తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్‌ఎస్‌లో తగిన గౌరవం దక్కకపోగా, అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టామని అలాంటి తాము నేడు సొంత పార్టీలోనే ఆత్మగౌరవం కోసం గొంతెత్తాల్సి రావడం బాధాకరమన్నారు.

ఉద్యమకారులకు అడుగడుగునా అవమానాలు
జిల్లాకేంద్రంలో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌

ఆత్మగౌరవం కోసం గొంతెత్తాల్సి రావడం బాధాకరం

ఉద్యమకారులను వేధిస్తే ఊరుకునేది లేదు

ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌

నల్లగొండ టౌన్‌, జనవరి 25: తెలంగాణ ఉద్యమకారులకు బీఆర్‌ఎస్‌లో తగిన గౌరవం దక్కకపోగా, అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టామని అలాంటి తాము నేడు సొంత పార్టీలోనే ఆత్మగౌరవం కోసం గొంతెత్తాల్సి రావడం బాధాకరమన్నారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఉద్యమకారులను వేధిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే పోరాటానికి కూడా వెనకాడేది లేదని తేల్చి చెప్పారు. తమది ఆత్మగౌరవ పోరాటమే తప్ప పార్టీ నాయకత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న 50ఏళ్ల అనుబంధాన్ని సైతం తెంచుకుని ఆత్మగౌరవ పోరాటం కోసం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరామని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడానికి ఎంతో పోరాటం చేశామని, 14ఏళ్ల పాటు ఎన్నో అవమానాలు భరిస్తూ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేశామని చెప్పారు. అయినప్పటికీ 2004నుంచి 2018 వరకు తనకు పోటీ చేసే అవకాశం దక్కలేదని, ఈ క్రమంలో రాజకీయంగా ఎవరితో పోరాటం చేశానో పొత్తులో భాగంగా వారినే గెలిపించడానికి పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు పనిచేశామన్నారు.

పార్టీ కోసం అన్నింటినీ ఓర్చుకున్నాం

పార్టీ నిర్ణయం మేరకు అన్నింటినీ దిగమింగుతూ పనిచేశామని, తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడానికి ఎన్నో త్యాగాలు చేశామని ఉద్యమం కోసం వంద కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అమ్ముకున్నానని అయినప్పటికీ బాధపడలేదన్నారు. తమతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నవారు, అసలు ఉద్యమంలో లేని వారు సీఎం కేసీఆర్‌ భిక్షతో పదవులు పొంది తమకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని స్వయంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని, హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా నేటికీ ఎలాంటి పదవీ ఇవ్వలేదన్నారు. 22ఏళ్లుగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తున్నామని, ఇంకా ఎంతకాలం ఇలా పనిచేయాలని ప్రశ్నించారు. పార్టీలో కొత్తగా చేరిన వారు ఉద్యమకారులను అణిచివేస్తున్నారని, తెలంగాణ కోసం అన్నింటినీ వదిలేసి ఉద్యమం చేసిన వారు నేడు దరిద్రం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయ సమ్మేళనానికి రానివ్వకుండా కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని అయినప్పటికీ వందలాది మంది ఉద్యమకారులు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు.

ఉద్యమకారులను వేధిస్తే ఊరుకునేది లేదని, ఓపికకు కూడా హద్దు ఉంటుందన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి తామేమీ వ్యతిరేకం కాదని, కానీ పాత వారిని కూడా కలుపుకునిపోవాల్సిన బాధ్యత పదవుల్లో ఉన్న వారిపై ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఉద్యమకారులకు సరైన వాటా ఇవ్వాల్సిందేనన్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఉద్యమాన్ని సజీవంగా ఉంచి పార్టీ నిర్మించిన తెలంగాణ ఉద్యమకారుల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించాలని కోరారు. తామంతా కేసీఆర్‌ బిడ్డలాంటి వాళ్లమని, బిడ్డల జీవితాలను ఆగం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు చీర పంకజ్‌యాదవ్‌, సింగం రాంమోహన్‌, బక్క పిచ్చయ్య, జమాల్‌ఖాద్రి, వాసుదేవుల వెంకటనర్సయ్య, మామిడాల రమేష్‌, బక్కయ్య, ఏదుళ్ల అరుణాకర్‌రెడ్డి, ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:28:19+05:30 IST