సిలిండర్ పేలి నానమ్మ, మనవరాలు సజీవ దహనం
ABN , First Publish Date - 2023-01-26T00:01:03+05:30 IST
గ్యాస్, సిలిండర్ పేలి నానమ్మ, మనవరాలు సజీవదహనమైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్నశివనూర్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.

పింఛన్, రేషన్‌కోసం ఊరికి వచ్చి మృత్యువాత
చేగుంట మండలం చిన్నశివనూరులో విషాదం
చేగుంట, జనవరి 25: గ్యాస్, సిలిండర్ పేలి నానమ్మ, మనవరాలు సజీవదహనమైన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్నశివనూర్లో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబసభ్యులు, గ్రామస్థుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పిట్టల అంజమ్మ(58) తన ఇద్దరు కొడుకులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరు ప్రాంతానికి మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం వలస పోయారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పింఛను, రేషన్ బియ్యం కోసం అంజమ్మ తన రెండో కొడుకు రాజేష్ చిన్న కూతురు మధుమిత(7)తో కలిసి సొంత ఊరికి వచ్చారు. మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్‌పై వంట చేసుకుని తిని ఇంట్లోనే నిద్రించారు. గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయకపోవడంతో గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. అర్ధరాత్రి నిద్రలేచిన అంజమ్మ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో దీపం వెలిగించే క్రమంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి సిలిండర్ పేలిపోయింది. దీంతో మంటలు ఇంటి పైకప్పు వరకు వ్యాపించడంతో పెంకుటిల్లు బూడిదై వారి మీదనే పడింది. అంజమ్మ తలుపు వద్ద సజీవదహనం కాగా చిన్నారి మధుమిత నిద్రలోనే సజీవ దహనమైంది. ఒక్కసారిగా పేలిన శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఇళ్లవారు నిద్రలేచి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. ఫైరింజన్సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పిసే సరికి నానమ్మ, మనవరాలు ఇద్దరు అగ్నికి ఆహుతయ్యారు. సమాచారం అందుకున్న చేగుంట ఎస్ఐ ప్రకా్‌షగౌడ్, తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని ఎంపీ హామీ ఇచ్చారు.