కల్వర్టును ఢీకొని దూసుకెళ్లిన కారు

ABN , First Publish Date - 2023-01-25T23:50:40+05:30 IST

చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో బుధవారం ఉదయం కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో సీఐ శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

కల్వర్టును ఢీకొని దూసుకెళ్లిన కారు
ధ్వంసమైన కారు, ఆస్పత్రి వద్ద సీఐని పరామర్శిస్తున్న సిద్దిపేట అడిషనల్‌ డీసీపీ మహేందర్‌

- చేర్యాల సీఐ శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు

- ముస్త్యాల శివారులో ఘటన

చేర్యాల, జనవరి 25: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో బుధవారం ఉదయం కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న ఘటనలో సీఐ శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. సీఐ మంచినీళ్ల శ్రీనివాస్‌ కారును డ్రైవింగ్‌ చేస్తూ జనగామ నుంచి చేర్యాలకు బయలుదేరారు. ఈ క్రమంలో ముస్త్యాల శివారు ప్రగతి హాస్టల్‌ సమీపంలోని మూలమలుపు వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని కిందికి దూసుకువెళ్లింది. దీంతో సీఐ శ్రీనివాస్‌ తల, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. కల్వర్టు ముందు భాగం ధ్వంసమవడంతో పాటు కారు ముందుభాగం దెబ్బతిన్నది. చుట్టుపక్కలవారు సహాయకచర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం సీఐని మెరుగైన చికిత్స కోసం సిద్దిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అడిషనల్‌ డీసీపీ సందెపోగు మహేందర్‌ ఆస్పత్రికి వెళ్లి సీఐ శ్రీనివా్‌సను పరామర్శించి వైద్యసేవలను పరిశీలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించారు. ఆయన వెంట చేర్యాల ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి ఉన్నారు. గతంలో ఇదే కల్వర్టు వద్ద ఓ ఎస్‌ఐ కారు బోల్తాపడి గాయాలు కాగా, పలు వాహనాలు సైతం బోల్తాపడి ప్రయాణికులు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా చేర్యాల సీఐ తీవ్ర గాయాలపాలవడం చర్చనీయాంశంగా మారింది. ఘటనా స్థలం వద్ద రోడ్డును సరిచేసి ప్రమాదాలు జరకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - 2023-01-25T23:50:40+05:30 IST