రాజ్‌భవన్‌ ‘ఎట్‌ హోం’కు సాహస బాలిక

ABN , First Publish Date - 2023-01-25T23:52:39+05:30 IST

మండలంలోని వెంకటాయపల్లికి చెందిన సాహస బాలిక శివ్వంపేట రుచితకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఎట్‌ హోం (తేనీటి విందు) కార్యక్రమానికి ఆహ్వానం అందింది.

రాజ్‌భవన్‌ ‘ఎట్‌ హోం’కు సాహస బాలిక
శివ్వంపేట రుచిత, రాజ్‌భవన్‌ నుంచి అందిన ఇన్విటేషన్‌

తూప్రాన్‌, జనవరి 25: మండలంలోని వెంకటాయపల్లికి చెందిన సాహస బాలిక శివ్వంపేట రుచితకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఎట్‌ హోం (తేనీటి విందు) కార్యక్రమానికి ఆహ్వానం అందింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళి సై సుందరరాజన్‌ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న సాయంత్రం 7 గంటలకు తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మాసాయిపేట రైలు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులను రక్షించి సాహస బాలిక అవార్డును పొందిన రుచితకు ఆహ్వానం అందింది. అలాగే ఫోన్‌ చేసి ఎట్‌ హోం కార్యక్రమానికి ఆహ్వానించారు. వివరాల్లోకి వెళ్తే.. తూప్రాన్‌కు చెందిన కాకతీయ స్కూల్‌ బస్సు 2014 జూలై 24న మాసాయిపేట వద్ద కాపలాలేని రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద పట్టాలు దాటుతుండగా, రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తూప్రాన్‌ మండలం ఇస్లాంపూర్‌, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, కిష్టాపూర్‌ గ్రామాలకు చెందిన 14 మంది విద్యార్థులు, డ్రైవర్‌, క్లీనర్‌ మృతి చెందారు. ఆ ప్రమాదంలో స్కూల్‌ బస్సులోనే ఉన్న వెంకటాయపల్లికి చెందిన 4వ తరగతి విద్యార్థిని శివ్వంపేట రుచిత ఇద్దరు చిన్నారులను రక్షించింది. దీంతో ఆమెకు నేషనల్‌ బ్రేవరీ (గీతా చోప్రా) అవార్డు- 2015 ప్రకటించి, రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. రుచిత ప్రస్తుతం తూప్రాన్‌లోని అభ్యాస ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఐసీఎ్‌సఈ ఫ్లస్‌ వన్‌ (ఇంటర్మీడియట్‌ ప్రథమ) చదువుతుంది.

Updated Date - 2023-01-25T23:52:39+05:30 IST