యాజమాన్య పద్ధతులు పాటించాలి

ABN , First Publish Date - 2023-02-02T00:15:39+05:30 IST

వరిలో రైతులు యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్‌ అన్నారు.

యాజమాన్య పద్ధతులు పాటించాలి
చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో వరి పంటను పరిశీలిస్తున్న డీఏవో శివప్రసాద్‌, శాస్త్రవేత్తలు

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్‌

మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో పంట క్షేత్రాలను సందర్శించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

మొగి పురుగు నివారణపై రైతులకు అవగాహన

చిన్నకోడూరు/నంగునూరు, ఫిబ్రవరి 1 : వరిలో రైతులు యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడి పొందే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్‌ అన్నారు. జిల్లాలో యాసంగి వరి పంటలో కాండం తొలిచే పురుగు(మొగి) ఉధృతం అవుతున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు బుధవారం చిన్నకోడూరు మండలంలోని కస్తూరిపల్లి గ్రామంలో, నంగునూరు మండలం నర్మెట్ట, ఖానాపూర్‌ గ్రామాల్లో వరి పంటలను ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ, తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం, రాజేంద్రనగర్‌ వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కాండం తొలిచే పురుగు నివారణ యాజమాన్యంపై రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. పురుగును గమనించడానికి దీపపు ఎర, సోలార్‌ దీపపు ఎర, లేదా లింగాకర్షక బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగుపై నిఘా పెట్టాలన్నారు. పిలక దశలో ఎకరాకు మూడు లింగాకర్షక బుట్టలు పెట్టి అందులో వారానికి బుట్టకు 25 నుంచి 30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలన్నారు. ప్రధాన పొలంలో గుళికల మందులు వాడితే ఖర్చు ఎక్కువ అవుతుందని, వరి నాటు వేసే వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే గుళికలు వేయాలన్నారు. ఒకవేళ నారుమడిలో వేయకపోతే 15 రోజుల వయసున్న పిలక దశలోనూ తప్పకుండా వాడాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే లార్వాదశలో వరిపై నష్టపరుస్తున్నట్టు సమాచారం అందుతుందని వ్యవసాయాధికారుల సూచనలను పాటించాలని తెలిపారు. చౌడు నివారణకు నీటి యాజమాన్యం పద్ధతులను పాటించాలని సూచించారు. పొట్టదశలో తెల్ల కంకి నివారణకు, చిరుపొట్ట దశలో మెడ విరుపు నుంచి పంటను కాపాడుకోవడానికి ఏమోతాదుల్లో ఎరువులను వాడాలో తగిన సూచనలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీదేవి, వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు ఏడీఏ పద్మ, ఏవో జయంత్‌కుమార్‌, సర్పంచ్‌లు పద్మ స్వామి, అజీజ్‌, రైతుబంధు సమితి నేతలు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

పొద్దుతిరుగుడు సాగులో...

సిద్దిపేట రూరల్‌, ఫిబ్రవరి 1 : పొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులకు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు. సిద్దిపేట రూరల్‌ మండలంలోని బుస్సాపూర్‌ గ్రామంలో బుధవారం శిక్షణ నిర్వహించారు. ఆగ్రో శాస్త్రవేత్త డి.శ్వేత పంటల వైవిద్యీకరణలో నూనెగింజల పాత్ర, ప్రత్యామ్నాయ పంటల వరి మాగాణులలో నూనెగింజల పంటల ఉత్పత్తి సాగు పద్ధతుల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రస్తుతం కూలీల కొరతను అధిగమించడానికి యాంత్రీకరణ ప్రాముఖ్యాన్ని తెలిపారు. కలుపు నివారణ, పూత దశలో పొద్దుతిరుగుడుకు ఏమోతాదులో ఎరువులను పిచికారీ చేయాలో వివరించారు. పూత దశలో పొద్దుతిరుగుడుకు బోరాక్స్‌ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. మృత్తికా శాస్త్ర విభాగం శాస్తవేత్త ఎన్‌.సాయినాథ్‌, బ్రీడింగ్‌ శాస్త్రవేత్త ఉమారాణి రసం పీల్చే పురుగు నివారణకు, వయ్యారి భామ కలుపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలను తెలిపారు. పొద్దుతిరుగుడులో వివిధ నూనెగింజల పంటలో విత్తనోత్పత్తి, మెలకువలపై అవగాహన కల్పించారు. రైతుల పొలాలను సందర్శించన శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు ప్రథమ శ్రేణి క్షేత్ర ప్రదర్శనలో భాగంగా పొద్దుతిరుగుడు రైతులకు బోరాక్స్‌ సుల్ఫేర్‌ మందును అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలతో పాటు బుస్సాపూర్‌ సర్పంచ్‌ కొడారి సదాశివరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రేమ్‌సాయి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-02T00:15:40+05:30 IST