ప్రజా కంటకులుగా మారిన ఎంపీ, ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-02-05T23:05:13+05:30 IST

తొగుట, ఫిబ్రవరి 5: ప్రజా కంటకులుగా మారిన మెదక్‌ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యేను ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నేత, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రజా కంటకులుగా మారిన ఎంపీ, ఎమ్మెల్యే
తొగుట గ్రామంలో పాదయాత్ర చేస్తున్న శ్రీనివాస్‌రెడ్డి

ప్రజా క్షేత్రంలో అడుగడుగునా నిలదీయండి

భూనిర్వాసితుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తాం

కాంగ్రెస్‌ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి

తొగుట, ఫిబ్రవరి 5: ప్రజా కంటకులుగా మారిన మెదక్‌ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యేను ప్రజాక్షేత్రంలో అడుగడుగునా నిలదీయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నేత, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం తొగుట గ్రామంలో చేపట్టిన ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ దుబ్బాక అత్మగౌరవ పాదయాత్రలో భాగంగా గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మల్లన్నసాగర్‌ నిర్మాణం వల్ల తొగుటలో రైతుల భూములు కోల్పోయి గూడే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. భూనిర్వాసిత రైతులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం అందించి వారిని అన్నివిధాలా ఆదుకోవాలనిప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. భూ నిర్వాసితుల హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మోసపు హామీలతో గద్దెనెక్కిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, రెండుసార్లు ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్‌రెడ్డి తొగుట గ్రామ భూనిర్వాసితులకు, రైతు కూలీలకు ఏమి చేశారో జవాబు చెప్పాలని సవాల్‌ విసిరారు. మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యంరెడ్డి హయాంలో తొగుటలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్కపనైనా ఇరువురు నేతలు చేశారా అని ప్రశ్నించారు. తొగుటలో లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ అతిథి గృహం నేడు ప్రజాప్రతినిధుల, అధికారుల నిర్లక్ష్యం మూలంగా బూత్‌ బంగ్లాగా మారిందన్నారు. మండల కేంద్రానికి రెండేళ్లుగా ఒక్క ఎర్రబస్సు కూడా రావడం లేదని, విద్యార్థులు ఉన్నత చదువులకు, ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేట్‌ వాహనాలు ఆశ్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ఎంపీ, ఎమ్మెలేకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇరువురు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడానికి పాకులాడుతున్నారే తప్ప ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి పట్ల వారికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ముత్యమన్న ఆశయ సాధకుడిగా మీ ముందుకు వచ్చానని, ఆశీర్వదించి అక్కున చేర్చుకుంటే మీలో ఒక్కడిగా ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తానని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొంగరి నర్సింహులు, చిక్కుడు నవీన్‌, తిరుపతి, బాలమల్లు, శ్రీనాకర్‌రెడ్డి, నర్సింహులు, బాలరాజు, అఖిల్‌గౌడ్‌, విజయ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, విష్ణు, యాదగిరి, మహిపాల్‌రెడ్డి, రాజు, మహేష్‌, పరశురాములు భరత్‌, శివకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T23:05:14+05:30 IST