కూడవెళ్లి పరవళ్లు

ABN , First Publish Date - 2023-02-07T00:06:19+05:30 IST

. గోదావరి జలాలు కూడవెల్లి వాగుపైన చెక్‌డ్యాంలపై నుంచి పరవళ్లు తొక్కుతుండడంతో అన్నదాతల్లో సంతోషాన్ని నింపుతున్నది.

కూడవెళ్లి పరవళ్లు
వెంకట్రావుపేట చెక్‌డ్యాం వద్ద పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలు

యాసంగి పంటకు మల్లన్నసాగర్‌ నీటివిడుదల

వాగుపై చెక్‌డ్యాముల్లో రెండు టీఎంసీల నిల్వ

56 వేల ఎకరాలకు అందనున్న సాగునీరు

గోదావరి జలాలతో అన్నదాతల్లో ఆనందం

దుబ్బాక, పిబ్రవరి 6 : ఎండుతున్న పంటకు కూడవెల్లి జీవం పోసింది. మల్లన్నసాగర్‌ నుంచి నీటిని విడుదల చేయడంతో రైతులలో ఆశలను చిగురింపజేసింది. గోదావరి జలాలు కూడవెల్లి వాగుపైన చెక్‌డ్యాంలపై నుంచి పరవళ్లు తొక్కుతుండడంతో అన్నదాతల్లో సంతోషాన్ని నింపుతున్నది.

మూడు రోజుల క్రితం గజ్వేల్‌ నియోజకవర్గం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్‌ నీటిని విడుదల చేయడంతో దుబ్బాక నియోజకవర్గంలోని 35 వేల మంది రైతుల వేసిన వరిపంటను కాపాడుకోవడానికి వీలు కలుగనున్నది. దుబ్బాక నియోజకవర్గంలో సుమారు 54 కిలోమీటర్ల పొడువునా వాగు పారుతూ, సరిహద్దు రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీర్‌రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరుకు చేరుతాయి. ప్రస్తుతం నీటి విడుదలతో మిరుదొడ్డి, అక్బర్‌పేట- భూంపల్లి, దుబ్బాక మండలాలను దాటి ఎగువ మానేరును తాకేందుకు పరవళ్లు తొక్కుతున్నాయియి. దుబ్బాక నియోజక వర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మండలాల్లోని రైతులకు ఎక్కువగా లబ్ధిచేకూరనున్నది. నియోజకవర్గంలో వాగుపై తొగుట మండలం వెంకట్రావుపేట, లింగంపేట సరిసరాలల్లో రెండు చెక్‌డ్యాంలను సుమారు రూ.4 కోట్లతో నిర్మించారు. ప్రస్తుతం వాగుపై సుమారు 26 చెక్‌డ్యాంలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి వాగులో సుమారు 2.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. నీటి విడుదలతో వాగు గుండా 7వేల క్యూసెక్కుల నీరు పారుతున్నది. మరో రెండు టీఎంసీలు ఎగువ మానేరులోకి చేరుతుంది. దీంతో సుమారు 56 వేల ఎకరాల పొలానికి సాగునీరందుతుంది. భూగర్భజలాల పెంపుతో మరో 15 వేల ఎకరాల వరకు లబ్ధిచేకూరనున్నది. కూడవెల్లి వాగుపై చెక్‌డ్యాముల్లో నీరు నిల్వ ఉండటంతో సుమారు 52 గ్రామాల పరిధిలో భూగర్భ జలాలు పెరుగుతాయి. గత మాఘ అమావాస్యకు ముందే నీటిని విడుదల చేయాలని రైతులు కోరినప్పటికీ వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణం చేపడుతుండటంతో జాప్యం జరిగింది. రైతుల విన్నపం మేరకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చొరవ తీసుకుని నీటిని విడుదల చేశారు. దీంతో ఎండిపోతాయనుకున్న యాసంగి పంటకు సకాలంలో నీరందుతుండటంతో రైతుల్లో ఆనందం నెలకొన్నది.

ఎగువ మానేరుతోనూ ప్రయోజనం

రాజన్నసిరిసిల్లా జిల్లా గంభీర్‌రావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు ద్వారా దుబ్బాక మండలానికి ఎక్కువ ప్రయోజనం చేకూరనున్నది. ఎగువ మానేరు నిండితేనే, దుబ్బాక పట్టణంతోపాటు మండలంలోని చెల్లాపూర్‌, రాజక్కపేట, అప్పనపల్లి, హసన్‌మీరాపూర్‌, మల్లాయపల్లి, కమ్మర్‌పల్లి, పెద్దచీకోడు, ఆరెపల్లి, పోతారం, అచ్చుమాయిపల్లి, గంబీర్‌పూర్‌, శిలాజీనగర్‌ గ్రామాలకు భూగర్భ జలాలు పెరిగి, ఊటద్వారా బోరుబావుల్లో పుష్కలమైన నీరు చేరే అవకాశం ఉంది. దుబ్బాక మండలంలోని చెరువులకు ఇంకా మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కాలువలను అనుసంధానం చేయనప్పటికీ, భూగర్భజలాల ద్వారానే ఆధారపడి ఉండటంతో రైతులు ఎండకాలంలో మరోసారి నర్మాల(ఎగువ మానేరు) ప్రాజెక్టు పరవళ్లు దూకాలని ఆశిస్తున్నారు. నీటి విడుదలతో ఈసారి కూడా నర్మాల తీర ప్రాంతాలతో పాటు ప్రాజెక్టుపై ఆధారపడిన రైతుల ఆశలు నెరవేరుతున్నాయి.

Updated Date - 2023-02-07T00:06:20+05:30 IST